Tuesday, August 4, 2009

నేనెవరు ?


పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
ముక్కలేరుకుంటూ మిగిలిపోయాను.

రగులుతున్న మంటల్ని
పంటి బిగువున కట్టేస్తే
మొహమాటమనుకున్నారు..
మౌనంగానే మరలిపోయాను.

శతకోటి కోణాల
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని తుడుచుకెళుతున్నారు..

నా లోతులు తవ్వి
పోసిన నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..

అద్దం మీద ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?

11 comments:

 1. ఆత్రేయ గారు, ఇదన్యాయమండి, పనికట్టుకు నా కళ్ళకి పనిచెప్తున్నారు. ఎవరాళ్ళు ముందది చెప్పండి. వాళ్ళ సంగతి నాకొదిలేయండి. ;)
  మనకు మనం అజ్ఞాతంగా, అపరిచితంగా,పరాయిగా మిగిలిపోవటం మామూలేగా... నీటిగుట్టలు నీరుకారిపోయాక మిగిలిన గుంటల్లోనో, తడీఅరీఆరని కనుల లోతుల్లోనో మనని మనం వెదుక్కోవచ్చు. నన్ను నేను వెదుక్కున్న ప్రతిసారి ఓ కొత్త రూపులో నాకు దొరికాను. దొరక్కుండాపోతామేనని బిక్కమొహం వేసుకుని మరీ దొరికాను. కనుక మిమ్మల్ని మీరు పోల్చుకోవాలేమో... ఆలోచించండి.

  ReplyDelete
 2. "నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
  ఇక నా పరిచయమెవరినడగను ? "
  - Wow!!

  ReplyDelete
 3. అందంగా రాస్తారు ....అంతకు మించి కవితకు తగ్గ బొమ్మ పెడతారు .ఇది మీకే సాధ్యం గురువుగారూ !అసలా బొమ్మలో మీ అక్షరాలకర్ధం మేం వెతుక్కుంటున్నాం .

  ReplyDelete
 4. పరిమళంగారు చెప్పింది అక్షరాలా నిజం...

  ReplyDelete
 5. చాలా చాలా బాగరాసారు

  ReplyDelete
 6. "శతకోటి కోణాల
  సజీవ శిల్పాన్ని నేను"

  అక్షర సత్యమది.


  "తెరమీద బొమ్మ గానే
  తడిమి చూస్తున్నారు...
  చేతికంటిన తడిని తుడుచుకెళుతున్నారు.."

  ఎవరండీ వారు?

  "అద్దం మీద ఊదిన ఆవిరవుతున్నాను.."

  చాలా చక్కని వర్ణన. నూతన భావాన్ని వ్యక్త పరిచారు. :)

  "నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను"

  ఆత్మ విమర్శలో పడ్డరన్నమాట.
  మరేం భయం లేదు, అదే మీకు చుక్కాని అవుతుంది :)

  "ఇక నా పరిచయమెవరినడగను ? "

  మమ్మల్నడగండి.

  మనసున్న కవిరాజు మీరు.
  కవిత చాలా బగా రాశారు:)

  ReplyDelete
 7. ఉష గారూ మీ సమాధానం బాగుంది. మనము నిర్మలమయిన మనస్సుతో ఒకరికి సహాయం చేసినప్పుడు.. దాంట్లోనూ మనకేదో లాభం ఉందేమోనన్న కోణంలో చూసే జనాలు కోకొల్లలు. అలాగే ఒకరికోసం నిస్వార్ధంగా.. బాధను మనమనుభవిస్తూ చేసిన సహాయాన్నందుకుని దులుపుకుని పోయేవాళ్ళు చాలామంది.. అలాంటప్పుడు.. నేనింత నిర్మలంగా ఎందుకుండాలి ? నా భావాన్ని వాళ్ళెందుకు అర్ధంచేసుకోరు అన్న ఆవేదన కలుగుతుంది. అంటే వాళ్ళు దగ్గర కూర్చుని సముదాయించాలనో లేకపోతే నీకు రుణపడి ఉంటాను అని వాగ్దానాలు చెయ్యాలనో నా భావం కాదు. ఐనా పిచ్చి మనస్సు ఊరుకుంటుదా..? ఇలా కాగితాలమీద మరకలు చేస్తుంది. మీ అలోచనలకు ధన్యవాదాలు.

  S సౌమ్య గారు నా బ్లాగుకు స్వాగతమండీ .. కామెంటినందుకు ధన్యవాదాలు.

  పరిమళం గారు ధన్యవాదాలు. యాదృచ్చికంగా గూగ్లెలో దొరికిన బొమ్మను దాచుకున్నాను. ఇలా ఉపయోగపడింది.

  పద్మార్పిత గారూ.. చిత్రాలు వాటి వాడకం గురించి మీరు నన్ను అభినందించడం బాగుంది. మీరేమన్నా.. ఆ విషయంలో నేను మీ తరువాతే.. ధన్యవాదాలు .

  చాలా చాలా ధన్యవాదాలు నేస్తం.

  విశ్వప్రేమికుడు గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. 'కవిరాజు ' ఇలా బిరుదులిచ్చి బరువు పెంచకండీ.. ;-)

  మిశ్రీసభ్రఫప్ర గారూ.. హమ్మయ్య మీపేరు కుదించేశానండీ.. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. "మనము నిర్మలమయిన మనస్సుతో ఒకరికి సహాయం చేసినప్పుడు.. దాంట్లోనూ మనకేదో లాభం ఉందేమోనన్న కోణంలో చూసే జనాలు కోకొల్లలు. "
  ఇందులో క్రొత్త ఏముందండి? Just ask yourself what's new? and why now? అది వాళ్ళ సంకుచితం. ఎన్ని కన్నీటి మూటలు దింపేకనో నా గుండె ఈ పాఠం నేర్చుకుంది. మీవీ ఖర్చు కాక మునుపే నా మాట మన్నించండి.

  "అలాగే ఒకరికోసం నిస్వార్ధంగా.. బాధను మనమనుభవిస్తూ చేసిన సహాయాన్నందుకుని దులుపుకుని పోయేవాళ్ళు చాలామంది.. "
  నేను అటువంటి వాళ్ళ "నామకోటి" వ్రాసేసానండి. అలాగని అడిగినవారినీ కాదనలేను. కొందరం ఇలా పుడతాం అంతే!

  "నేనింత నిర్మలంగా ఎందుకుండాలి ?"
  నేనెందుకు వాళ్ళ కోసం మారాలి అనుకోండి. మీకు మీరుగానే మీకిష్టం అని సర్దిచెప్పుకోండి. కావాలంటే ఇలా పదాల్లో కరిగిపోండి, కానీ మారకండి. మనది కాని నైజం మనని బ్రతకనీయదు. ఇది అనుభైకవేద్యమే..

  ReplyDelete
 9. నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
  ఇక నా పరిచయమెవరినడగను ?
  చాలా అందం గా చెప్పేరు భావాన్ని... ఎలా ఐనా మనసు కవి ఆత్రేయ గారు కదా :-)

  ReplyDelete
 10. ఉష గారు మీ సాంత్వన మాటలకు ధన్యవాదాలు. ఈ మాటలన్నీ మనను మనం మభ్యపెట్టుకునో, సరిపెట్టుకునో బ్రతకడానికేగా.. అలా బ్రతికేకంటే ఒకరినొకరు అర్ధంచేసుకుని కలిసి జీవించగలిగితే అధ్భుతమైన ప్రపంచమవుతుంది.. స్వర్గమే దిగినట్టవుతుంది. మీ ఆలోచనలు బాగున్నాయి. మరో సారి ధన్యవాదాలు.

  భావన గారు ధన్యవాదాలండి. ఆత్రేయగారంతగా రాయలేకపోయినా.. ఏదో .. మనసు స్పందించిన ప్రతిసారీ.. ఇలా ఆధ్యనితరంగాలు అక్ష్రరరూపం తీసుకుంటాయి. మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు.

  ReplyDelete