Thursday, July 30, 2009

గడప


తలుపు ముందు రాత్రనకపగలనక
కుక్కలా కాపలా కాస్తావు..
ఎవరికోసమో ఆబగా ఎదురు చూస్తావు..

ఎవరో నీ ముఖాన పులిమిన
పసుపు మరక తప్ప.. నీకస్థిత్వమేది?
వాళ్ళ కాళ్ళు తుడిచేందుకు నీతలన
వేసిన చెంగు తప్ప నీదైనదేది?

ప్రతి వాడూ దాటి పైకెళ్ళేవాడే
విలాసంగా దిగి తన దారి పట్టేవాడే
ఆగినా.. ఎవరన్నా... అది తొక్కేందుకే!

నిన్ను చూస్తే నన్నద్దంలో చూసినట్లుంది
తేడా ఒకటే, గడపవి గద? భావాలుండవు!
నీ ముఖాన పసుపుమరకలు,
నాకు నీటి చారలు !!


Wednesday, July 29, 2009

మనగలను


ఆ కళ్ళలోకి చూసినప్పుడల్లా..
ఓ వింత అనుభూతి..
ఈ తరుణం జీవితాంతం
నిలిచి పోగలదన్న ఆశ

మరో అనుభవం ఏదీ
దీనికి సరిరాదు. అసలు
అటువంటిది మరొకటి
ఉండదేమో ...

నువ్వు నాకు తెలుసన్న
పరిధిలోనే.. ఈ ఆనందమంతా..
ఐనా అదిచాలు.. అంతకన్నా
అడిగేదేమీలేదు.. అడగలేను.

గుండెనోడిపోయిన మనిషిని
అందులో నువ్వు నిండి ఉన్నావని
ఎలా చెప్పేది ? మన గలనన్న
మాటనెలా ఇచ్చేది ?


(కనుషి బ్లాగు రచయిత వంశీ గారికి కృతజ్ఞతలతో )

Tuesday, July 28, 2009

కవితా శకలం


చూపులు కలిసిన ప్రతిసారీ
పెగలని పదాలు
పెదవుల మాటునే
కరిగిపోతున్నాయి..
పువ్వులు పూస్తున్నాయి..

జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి..

నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !

నిప్పును మ్రింగి
వెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...

నీక్కావల్సినదానిని
మరో సారి చెప్పనీ..
నేను నిన్ను మరచాను !!

నిజమే.. నిన్ను నేను మరచాను..
కానీ... నువ్వే !!.... ప్రతిక్షణం..
ప్రతిఒక్క క్షణం.. గుర్తొస్తున్నావు ..

కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో !!

Friday, July 24, 2009

నాకూ మరణం కావాలి !!


మెరిపించిన కనులను
పెదవి విరుపులు
మరుగుచేస్తున్నాయి..
ఐనా.. ఈ తావు వీడలేను


నేను..
నిశీధిలో కలిసిన
మూగ నవ్వును ..
తడి స్పర్శ తెలియని
తపన జీవిని ..
ఏ గంధమూ లేని
మనసుగంధాన్ని..

రాలిన ప్రతి పువ్వూ
విధి విదిల్చిన రంగువే
అంటూ దెప్పుతుంది.
చివుక్కుమన్న ప్రాణం
చిన్నబోతుంది.

మంచు ముత్యాలూ
తేనెటీగలూ
కొప్పు శిఖరాలూ
కోవెల మెట్లూ
అన్నీ నా కలల ప్రపంచంలో ..
కరగని కధలే..

అలంకారానికీ కొరగాక
ఆనందాలకూ పనికిరాక
చావుకీ దూరంగా
ఎందుకీ బ్రతుకు? ఎవరికోసం.

ఆ నవ్వు.. ఆ స్పర్శ..
ఆ మమత.. ఆ ఆనందం..
నాకూ కావాలి.

మరుజన్మ కైనా.. కానీ
ప్స్చ్‌ .. మరణమూ రాదుగా.
కాగితం పువ్వును నేను..
ఈ బ్రతుకింతే !!

త్రినాధ్ గారు తన బ్లాగులో ఆంగ్లంలో రాసిన కవిత నుండి స్పందన పొంది రాసిన కవిత ఇది. ఆకవితను ఇక్కడ http://musingsbytrinath.blogspot.com/2007/12/paper-flower-suggested-by-prashanth.html

Tuesday, July 21, 2009

డైరీ


అస్థవ్యస్తం.. రణగొణధ్వనులు..
ఎపుడూ.. ఏదో వెదుకులాట ...

క్యాలికో ముసుగులో
ఆనాటి జీవితం..
విప్పారిన రెప్పలతో..వచ్చేసరికి..

చుట్టూ ప్రపంచం.. మాయమవుతూ..
బరువు శ్వాసనూ...బోలెడు నిశ్శబ్దాన్నీ
వదిలిపోయింది.

ఇంకి పోయిన ఇంకు మూటల్లోని
కలల దొంతరలు..
పుటల మధ్య రెక్కలై మిగిలిన
పువ్వు శిధిలాలు..
కవిత ముసుగులో ఒదిగిన
ఆశ ఖండాలు..
పిల్లలింకా పెట్టని నెమలి పించాలు...

మనసు మల్టీప్లెక్సుగా
మారిపోయింది.

తోడు రాలేని వసంతాలు...
ఆ తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.

Monday, July 20, 2009

గుండె గుడి


మనసు కొండ మీది మందారాన్ని
పూజ వస్తువుగానే పొదువుకున్నాను..
నిరీక్షణలో కరిగిపోయిన కాలాన్ని
నీరాజనంగానే అద్దుకున్నాను...

నిన్ను కోరిన మనసు మధనను
ప్రసాదమంటూ సమాధానపడ్డాను..
తపన మిగిలిన తడికన్నులను
నిర్మాల్యమని తృప్తిపడ్డాను..

మాటల గారడీలో
పెదవుల వెనక నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన రెప్ప చూరుల
వెంట ఆవిరయిన ఆశ క్షణాలనూ..
గోటి మొనతో మీటి..

గుండె గుడిలో వెలిసిన దేవతకు
మంగళహారతి అనుకున్నాను.

Friday, July 17, 2009

మరో ప్రపంచం


అదిగో అదిగగిగో .. మరో ప్రపంచం

విధి మలిచిన మూసల నుండీ..
ఆశగా కొరికిన గాలాలనుండీ..
తపన చుక్కాని మలుపుల నుండీ..
తీరం చేర్చని గుండాలనుండీ..

ఒక్క సారిగా..తప్పించేందుకు..
అర్రులు చాచి పరుగు పరుగున..
అదిగో .. మరో ప్రపంచం..

అశ్రు రహితం, సర్వ హితం
శాంతం.. శ్యామలం..
అదిగో .. మరో ప్రపంచం..

నిశ్శబ్దం, నిర్మోహం, నిశ్చలం
నిర్మలం. నిర్వాణం..
ఆహా మరో ప్రపంచం..

అందరి వైపుకా గమ్యపు పయనం..
వస్తోందంటే భయాలు ఎందుకు ?

కలల తెప్పపై దాటిన రాత్రులు..
రెప్పలు పూసిన ఆశల మూటలు..
అన్నిటి నుంచి విముక్తి అదిగో..

మరో ప్రపంచం మరో ప్రపంచం..

Thursday, July 16, 2009

సగటు సాఫ్టువేరు బ్రతుకు


దైనందిన జీవితపు
నిష్టూరాల నేపధ్యంలో..
భాంధవ్యాలు క్లాజెట్టులోనుంచి
ఆర్తిగా పిలుస్తూ ఉంటాయి..

చూడగోరి బెంగపడ్డ
అమ్మ చెక్కిళ్ళ తడిని
ఫోను తంత్రులే
తుడుస్తుంటాయి..

జన్మ దినాలూ ఆనందాలూ..
ఈకార్డులు, కేకుముక్కల్లోనే..
పరవళ్ళు తొక్కుతుంటాయి..

చెల్లి పెళ్ళికో, తాత తల కొరివికో
వెళ్ళాలన్న తపనలు
ఎవరి సంతకం కోసమో
ఆబగా వేచి చూస్తుంటాయి.

వదిలొచ్చిన దేశం
గోడమీద పోస్టరులోనూ..
అమ్మ చేతి రుచి
అంగడి సీసాల్లోనూ..
నాన్న ఆశలు
పరుసు మడతల్లోనూ..

పాతికేళ్ళ అనుబంధం
పాశ్చాత్య మోజు వెనకో..
పరిస్థితుల వేడి వెనకో..
దాచుకున్న ప్రవాసీ బ్రతుకులివి..

చౌకధరల అడవుల్లో
తనవారిని వెతుక్కుంటున్న
ఓ ద్రిమ్మరి బ్రతుకిది..
సగటు సాఫ్టువేరు బ్రతుకిది.


తానా 2009 సావనీరులో ప్రచురించ బడిన కవిత. చిన్న మార్పుతో..

Tuesday, July 14, 2009

ఆటో నడిపే దేముడు...

జీడిపప్పు గారు

మంచి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అతనికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను. మీరు పంపిన లింకులకు నా చిరు స్పందన. కవిత అని అనలేమేమోగానీ.. వచ్చిన భావాలను వచ్చినట్లు యధా తధంగా కాగితం ఎక్కించాను. మీ అభిప్రాయం చెప్పగలరు...

మీరిచ్చిన లింకులు ఇక్కడి చదువరులకోసం మరోసారి

http://i28.tinypic.com/2jvbm1.jpg
http://i26.tinypic.com/34ika6x.jpg



ఆటో నడిపే దేముడు...
=================

అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
అద్దెకడుపుల వేలంపాటలూ..
ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..

కకృతి కోరల కరాళ నృత్యం..
కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..

మధ్య పేజీలో మరో ఉదయం..

కలికాలపు ప్రవాహంలో...
అడ్డుగా .. ఓ గడ్డి పరక.

తన బ్రతుకే ఎదురీత..
ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
ఓ కాలుతున్న కడుపు..

ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..

ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు..

చెమరిన కళ్ళతో..
తన కాళ్ళకిదే కవితాబిషేకం.!!

Monday, July 13, 2009

నా ప్రేమతో నీకో నీకో రూపమిచ్చాను





పిలిచి పిలిచి నాలుక పిడచకడుతున్నా..
ఎదురు చూసిచూసి కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం ఏ గుండె గంటలు చేరదు !!

మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.

ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడమే
నాకిష్టం..
మొండి ప్రేమలో..
దీపపు పురుగును కాలేను..

నువ్వు మనలేకనే.. మనగలవా అన్న ఆ ప్రశ్న..
మరో సారి నిన్ను నువ్వు చూసుకో..
ప్రణయమని కరుగుతావో.. ప్రక్షాళితమవుతావో.

my response to Sruti's kavita at http://sruti-minestam.blogspot.com/2009/07/blog-post_12.html

తడిసిన ప్రస్తుతం


అటక మీది అనుభవాలూ
అనుభూతులూ, అత్మీయతలూ
ఒళ్ళోకి జార్చాను.

కళ్ళు తడిమిన ప్రతిజ్ఞాపకం
ముంగిట్లో మరోసారి
ప్రస్తుతమై ప్రవహిస్తోంది.

అర్ధించినా ఆగనివి, ఈనాడు
మునివ్రేళ్ళమీద .. వెనక్కీ ముందుకీ
చెప్పినట్లు ఆడుతున్నాయి..

గతించి బాధించినా
తిరిగి ప్రసవమై..
అపురూపంగా.. హృద్యంగా..
కనిపిస్తున్నాయి..

ఇంతలో.. మీరు....
తనివితీరా చూసుకునేలోపే..
తడితెరల వెనక మరుగయ్యారు..

ఎందుకో అదిరే పెదిమలకు
తోడుగా... చిన్న మూలుగు..,
వణికిన వేది నిట్టూర్పు.
గుండెలో శూన్యం
బరువుగా ప్రతిధ్వనించింది !..

తడిసిన రెప్పతీరాలను
చూసుకుంటూ..
ప్రస్తుతం.. బరువుగా.
తిరిగి అటకెక్కింది.


ఈనెల కౌముది పత్రికలో ప్రచురించబడిన కవిత.. చిన్న మార్పులతో..
http://www.koumudi.net/Monthly/2009/july/index.html

Saturday, July 11, 2009

రోదించు..


రెప్పక్రింద కాష్టమై మిగిలిన ప్రేమ..,
కనపడని విధి కాలడ్డంపెట్టిన కలయిక..,
జ్నాపకాలు శ్వాశిస్తూ ప్రస్తుతానికిచ్చే తర్పణలు..,

త్యాగాల కొమ్మకి వ్రేలాడే
నిరాశ తల అది.. కనబడటంలేదా ?!
ఓడి తెగిన కంఠం నుంచి
కారే ఆశ మడుగులు..కనబడటంలేదా ?!

బుకాఇంచకు..
ఇది ఓటమి కాదంటావా..?
నీ కళ్ళ తడి రాదంటావా... ?


గుండెలో దిగిన బాకు..
పిడి నగిషీల వర్ణన ఎంతకాలం..?
కాళ్ళక్రింద రేగిన నేలతడుపు...
గంధాల వర్ణన ఎంతకాలం..?

నిరాశకు.. గెలుపు పులిమి..
ఇప్పుడు నువ్వు మింగే నీరు...
గతం నుండి కాల నాగై నీ మెడదిగుతుంది
కంటి కొలనులో జీవనదై జీవితాంతం పారుతుంది...

ఓ ఏడుపుతో పోయే తరుణాన్ని..
ఉదారత పులిమి బ్రతుకంతా నింపకు..
నేచూసిన ఆ బ్రతుకు నీకొద్దు..

భూనభోంతరాళాలు బ్రద్దలయ్యేలా..
రోదించు..
ఉపశమించు....
జీవించు....

http://anu-parimalam.blogspot.com/2009/07/blog-post_10.html కు నా స్పందన