Monday, July 13, 2009

తడిసిన ప్రస్తుతం


అటక మీది అనుభవాలూ
అనుభూతులూ, అత్మీయతలూ
ఒళ్ళోకి జార్చాను.

కళ్ళు తడిమిన ప్రతిజ్ఞాపకం
ముంగిట్లో మరోసారి
ప్రస్తుతమై ప్రవహిస్తోంది.

అర్ధించినా ఆగనివి, ఈనాడు
మునివ్రేళ్ళమీద .. వెనక్కీ ముందుకీ
చెప్పినట్లు ఆడుతున్నాయి..

గతించి బాధించినా
తిరిగి ప్రసవమై..
అపురూపంగా.. హృద్యంగా..
కనిపిస్తున్నాయి..

ఇంతలో.. మీరు....
తనివితీరా చూసుకునేలోపే..
తడితెరల వెనక మరుగయ్యారు..

ఎందుకో అదిరే పెదిమలకు
తోడుగా... చిన్న మూలుగు..,
వణికిన వేది నిట్టూర్పు.
గుండెలో శూన్యం
బరువుగా ప్రతిధ్వనించింది !..

తడిసిన రెప్పతీరాలను
చూసుకుంటూ..
ప్రస్తుతం.. బరువుగా.
తిరిగి అటకెక్కింది.


ఈనెల కౌముది పత్రికలో ప్రచురించబడిన కవిత.. చిన్న మార్పులతో..
http://www.koumudi.net/Monthly/2009/july/index.html

5 comments:

  1. మొత్తానికి మళ్లీ అటకెక్కించారు.
    చాలా బాగుంది గురువు గారూ.

    మరి జీడిపప్పు గారి రిక్వెస్ట్ కు సమాధానం ఇస్తారు కదూ! ఎదురు చూస్తుంటాం

    ReplyDelete
  2. పద్మార్పిత గారు, శృతిగారు ధన్యవాదాలు.
    జీడిపప్పు గారూ.. నా బ్లాగు వైపుగా వచ్చినందుకు కామెంటినందుకు ధన్యవాదాలు. మీరు పంపిన లింకు చూడగానే వచ్చిన భావాలను. రాశాను చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.

    ReplyDelete
  3. శ్రీ ఆత్రేయగారికి, నమస్కారములు.

    మీ కవిత బరువు నా గుండె బరువును పెంచింది. "గుండెలొ శూన్యం బరువుగా ప్రతిధ్వనించింది" అన్న వాక్యం చాలా గొప్పగా వున్నది. ఇది చాలా లోతైన మాట. "నిశ్శబ్దంలోనే మనం శబ్దాన్ని వినగలం. ధ్వని, శూన్యంలోనే ప్రతిధ్వనిస్తుంది. శూన్యమైన గుండెలో కూడా బాధ అలాగే ప్రతిధ్వనిస్తుంది.

    గమనిక:- ఈ మధ్య మీ సైట్ తెరవబడి, ఒక warning box కనబడి, site could not be opened, aborted అని వస్తున్నది. ఏదైనా సమస్య ఉనందేమో చూడగలరు.

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  4. మాధవరావు గారు ధన్యవాదాలండి. ఈ సమస్య మీకొక్కరికే వస్తున్నట్టుంది. ఐనా.. మరోసారి నా బ్లాగు సెట్టింగులు చూస్తానండి. ఈ విషయం నా సమక్షానికి తెచ్చినందుకు, ఇక్కడ కామెంటినందుకు ధన్యవాదాలు

    ReplyDelete