Thursday, July 30, 2009

గడప


తలుపు ముందు రాత్రనకపగలనక
కుక్కలా కాపలా కాస్తావు..
ఎవరికోసమో ఆబగా ఎదురు చూస్తావు..

ఎవరో నీ ముఖాన పులిమిన
పసుపు మరక తప్ప.. నీకస్థిత్వమేది?
వాళ్ళ కాళ్ళు తుడిచేందుకు నీతలన
వేసిన చెంగు తప్ప నీదైనదేది?

ప్రతి వాడూ దాటి పైకెళ్ళేవాడే
విలాసంగా దిగి తన దారి పట్టేవాడే
ఆగినా.. ఎవరన్నా... అది తొక్కేందుకే!

నిన్ను చూస్తే నన్నద్దంలో చూసినట్లుంది
తేడా ఒకటే, గడపవి గద? భావాలుండవు!
నీ ముఖాన పసుపుమరకలు,
నాకు నీటి చారలు !!


14 comments:

 1. భావాలు లేని గడప తరపున నా వకాల్తా :)

  దాటి వెళ్ళిన వాడు మళ్ళీ రాకపోడు,
  తొక్కి వెళ్ళినవాడే నాకు మొక్కకపోడు !

  మొహాన నీటి చారికే మనిషికి మనసుందని సాక్ష్యం,
  నా మొహాన ఈ పసుపు మరకే ఏనాటికీ నా అస్థిత్వం !

  ReplyDelete
 2. Okate Maata.. Super.. Ayithe.. Vemana Gaaru.. inti Gadapa.. ki..gudi gadapaki.. thedalunnai.. kadaa.. thokkuthaaru.. mokkutharu...:)

  ReplyDelete
 3. నా కవిత "ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు! " http://maruvam.blogspot.com/2009/05/blog-post_26.html
  నుండి సంగ్రహించి కాస్త పొడిగిస్తూ...

  "గడప మీద కుంకుమబొట్టు వెలిసినా,
  నిరంతరం వేయిపాదాలు ఆ గడప దాటినట్లే,
  ఆ రంగులద్దిన మోవి చిరునగవు మెరుపక్కడే.

  మోవి మీద నీటి చార ఆరినా
  నిరీక్షణ రేయిపవలు గుండె సాగించినట్లే
  ఆ మనిషి కలల సాకార ప్రాకారముండులే.."
  *********************************
  ఏదో కదలిక ఇలా... నా వేదనలు కలకాలం వుండవు, వచ్చిన ఆనందాలు నిలవవు. నడుమ నా మది గీతాలు కాసింత ఇటూ, తదుపరి అటూను..

  ReplyDelete
 4. వేమన గారు నా బ్లాగులోకానికి స్వాగతం. మీ కౌంటరు బాగుంది. నిజమే గడప కాసే కావలి తలుపును బట్టి ప్రతిగడప జీవితం మారుతుంటుంది. నేరాసింది నిజంగా 'గడప ' గురించేనంటారా ? మరో సారి చదవండి :-)

  ప్రేమికుడు గారు ధన్యవాదాలు

  శివ గారు వేమనగరి ప్రశ్నకి మీ సమాధానం ఆలోచనాత్మకంగా ఉంది. ధన్యవాదాలు.

  ఉష గారు.. ఇక మీ పలుకులగురించి చెప్పేదేముంది. తెలుగుతల్లి ముద్దుబిడ్డమీరు :-) పదాలలా జాలువారుతాయి. ఆశ మొగ్గలు అలా అలా జల్లి పోతాయి. ధన్యవాదాలు.

  ReplyDelete
 5. ఆత్రేయ గారూ, ఈ మధ్య పాఠకులకు ఒకే కవితలో పలుభావాల సంగమాన్ని అందిస్తున్నారు. భలే...

  ReplyDelete
 6. ఆత్రేయగారు చాలా బాగా రాసారు ..కాదేది కవిత కనర్హం అన్నట్లు గడప మీద రాయడం చాలా బాగుంది..వేమన గారు,ఉష గారు కూడా మీ కవితకు తోడు ని ఇచ్చారు :)

  ReplyDelete
 7. ఆత్రేయ గారు, నా గురించి మీ మాట భలే! :) తథాస్తు దేవతలారా మీ పని మీరు కానిచ్చేయండి. "ఆశ మొగ్గలు" విరిసి ఆనందాలని వెదజల్లుతాయనే నా యాత్ర వెంబడి సాధన విత్తులు జల్లిపోతుంటాను. వూహల సారం నింపుతుంటాను. ;)
  నేస్తం, మీ అభినందనకి, అభిమానానికి నా ధన్యవాదాలు.

  ReplyDelete
 8. రాధిక గారు నెనరులు.

  భారారె గారు.. కవిత పంచిన పలుభావాలను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.

  నిజమే నేస్తం.. నాకవితలు ఇలా పాఠకులలో స్పందనలు రేపడం అందులోనూ వారు వాటిని అద్భుతమయిన పదాలతో అలంకరించి ఇలా వ్యాఖ్యగా చేయించడం నిజంగా నా అదృష్టం. ఉష గారు, భారారె గారు, వేమన గారు, సృతిగారు, పరిమళం గారూ.. ఇలా ఒకరేమిటి అందరూ నాకవితలకు స్పందించి కవితలు రాసినవారే.. ఇంతటి అదృష్టాన్ని నాకు కలగచేసిన వారందరికీ నేనెప్పుడూ రుణపడే ఉంటాను. ధన్యవాదాలు.

  ఉషగారూ.. తధాస్తుదేవతల దీవెనలు మాఅందరికీ డిటియస్ సరౌండ్ సౌండ్ లో వినబడ్డాయి చాలా సంతోషం. ధన్యవాదాలు.

  ReplyDelete
 9. శ్రీ ఆత్రేయగారికి, నమస్కారములు.

  మీ కవిత అత్యంత సున్నితంగా వున్నది. అయితే, నీ ముఖాన పసుపుమరకలు,
  నాకు నీటి చారలు !! ఈ పదాలలో, " నాకు నీటి చారలు " అనె పదం ఎందుకు వాడారో నాకు అర్ధం కాలేదు. వివరించగలరు.

  భవదీయుడు,
  మాధవరావు.

  ReplyDelete
 10. మాధవరావు గారు నమస్కారములు... కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  ఒక కుటుంబంలో అణగదొక్కబడిన ఒక మహిళయొక్క వేదన ఇది. వేధింపులతో విసిగి వేసారి .. చావుకీ దూరమయ్యానన్న బాధతో .. దానికోసం వేచి చూస్తూ.. (గడప దగ్గరన్న మాట ) ఆమె ఆ గడపతో చేస్తున్న సంభాషణ ఇది. ఆ గడపని తనతో పోల్చుకుంటూ.. బాధ పడుతూ.. దానిమీద ఎండి అంట కట్టుకుపోయిన పసుపు మరకల పోలికను తన చెక్కిళ్ళపై ఎండిన కన్నీటి ధారలతో చేస్తూ ఆమె విలపించిన విధానమది.

  అటువంటి ఓ మహిళలో కి పరకాయ ప్రవేశం చేసి ఆమె మనో భావాలని ఇలా వ్యక్త పరిచాను.

  కవిత నచ్చినందుకు మరో సారి ధన్యవాదాలు. నేరాసిన పద్ధతి వల్ల కొంతమందికి గడప కనిపించింది మరికొంత మందికి బాధ పడుతున్న ఆమే కనిపించింది. కేవలం పోలిక మీదనే ఆధారపడిన కవిత కావడతో నేను పూర్తిగా చెప్పాలనుకున్న దానికి వ్యక్త పరచలేకపోవడం వల్లనే మీ కూ ఇలా సందేహం వచ్చింది. సాధనమున సమకూరు ధరలోన.. అదే చేస్తున్నాను... ఆపైన అంబ దయ.

  ReplyDelete
 11. ఆత్రేయగారు,

  వివరణకి నెనర్లు.
  మొదట చూసి నేను కవి ఆవేదన మాత్రమే అనుకున్నాను :)
  నేనింకా పదాల హోరులో పడి కొట్టుకుపోతున్న వాణ్ణే కదా !
  మీ కవితల్లో sensitivity చాలా బావుంటుంది .

  ReplyDelete
 12. శ్రీ ఆత్రేయ గారికి, నమస్కారములు.

  మీ మనోభావనను చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఒక స్త్రీ, గడపను కూడా ఒక స్త్రీగా భావించి పలుకుతున్నట్లుగా నేను అర్ధం చేసుకున్నానుగానీ, "ఆ స్త్రీ తన కన్నీటి గాధలను తలుచుకుంటూ కార్చినవే ఈ కన్నీటి చారలు" అనే కోణంలో మాత్రం నేను అలోచించలేదు. ఏదిఏమైనా, మీ వివరణకు, మీ సున్నిత భావాలకు మరొకసారి నా అభినందనలు.

  జీవంలేని ఒక చెట్టు మొద్దు మాత్రమే ఈ "గడప" అని అందరూ అనుకుంటూ వుంటాం. కానీ, మీరు ఆ మొద్దు కూడా ఒకప్పుడు జీవంవున్నదే అని గుర్తుచేస్తూ, ఆ గడపకు ఒక స్త్రీ రూపం ఇచ్చి, మరొక స్త్రీ ద్వారా మీలోని భావనలను "గడప దాటించి" మాకు చక్కటి కవితను ఇచ్చారు.

  భవదీయుడు,
  మాధవరావు.

  ReplyDelete