Tuesday, June 12, 2007

మారే ఎప్పుడు?

పేదవాడి కలల్ని, ఆశలని పెట్టుబడిగా
నేటి నేతలందరూ చేసే ఎన్నికల వాగ్దానాలు
గాలి మూటలని, అరచేతి స్వర్గాలని తెలిసీ
ఒక సంచి సార, బిరియాని మూటకి లోబడి
తెరచాప తెగిన నావలా దిశ మరచి,
గుడ్డిగా వోటేసి, గూండాలనెలా గెలిపించి
తమ కన్నులని తామే పొడుచుకునే పిచ్చి
జనాలకి ఏమని చెప్పాలి? వీరు మారే దెప్పుడు?

పెద్ద చదువులు చదివి, పట్టణాలలొ, ప్రైవేటు
వ్యవస్థలకు వెట్టిచాకిరీ చేస్తూ, హైటెక్కు
జాబులంటూ, గురివింద గొప్పలు పలుకుతూ, వోటు వేసే
బధ్యత మరచి, కార్పోరేటు చెంచాల
వూడిగానికి డప్పులసరి వత్తాసు పలుకుతున్న,
నేతి యువతకి ఏమని చెప్పాలి? వీరు మారే ఎప్పుడు?

జీవితం చదరంగమే

ప్రతి మొదటి అనుభూతి మన మదిలొ ఒక ముద్ర వేస్తుంది
మొదటి లాలి కల్యాణి రాగమై చిచ్చు కొడుతుంది
మొదటి పలుకు అమ్మ చెవిని చేరి ధన్య మవుతుంది
మొదటి గిలక్కై గురుతుకొచ్చి నవ్వు తెప్పిస్తుంది
మొదటి స్నేహం మనుగడలో భాగమై గురుతుంటుంది
మొదటి పరీక్ష జీవితానికి దారి వేస్తుంది
మొదటి ప్రేమ యెదలొ అనురాగమై లీన మవుతుంది
ఒక్కొక్క అనుభవం ఒక గడిగా
కూర్చ బడిన చదరంగమే మన జీవితం
ఏ ఒక్క గడి మరచినా చదరంగంలో గెలవలేము ...

సరసం


చక్కని పండు వెన్నల పచ్చని పల్లె తావు
మెల్లని పిల్ల గాలి చల్లని సెలయేటి జల్లు
తాతలనాటి కిర్రు మంచంపై మల్లెల పక్క
పారాణారని పల్లె పడుచు పెళ్ళామొకపక్క

చుట్టిన వేలి చిలకలను నోటికందించదు..
ఎరుపెక్కిన పాల బుగ్గలను చేతికందించదు..
జడ జాజుల గుబాళింపులను ఆస్వాదించనీయదూ..
తన సిగ్గు మొగ్గలను త్రుంచ వీలుకానీయదు...

తీయని అధరామృతములను ఒకింతొలికించక
ఈ సృంగార రసకేళి న తనది పైచేయి కాగా
రెచ్చిన తన తమకపు వేధింపులకు పొంగి
భార్యనక్కున చేర్చెను తనవోటమి ఒప్పి.


chakkani panDu vennala pachchani palle taavu
mellani pilla gaali challani selayETi jallu
taatalanaaTi kirru manchampai mallela pakka
paaraaNaarani palle paDuchu peLLaamokapakka

chuTTina vEli chilakalanu nOTikandinchadu..
erupekkina paala buggalanu chEtikandinchadu..
jaDa jaajula gubaaLimpulanu aaswaadinchaneeyaduu..
tana siggu moggalanu truncha veelukaaneeyadu...

teeyani adharaamRtamulanu okintolikinchaka
ee sRngaara rasakELi na tanadi paichEyi kaagaa
rechchina tana tamakapu vEdhimpulaku pongi
bhaaryanakkuna chErchenu tanavOTami oppi.

మంచిరోజులొస్తున్నాయ

పెత్తందార్లతో విధి ఆడుతున్న చదరంగంలో
పేద పావుల బలి పీఠ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!

స్వార్ధ నాయకుల పదవుల పోరాటంలో
చిందిన బిఖారి నెత్తుటి పధ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!

గెలుపు డప్పుల దడ దడ మధ్య
ఎగిరిన పువ్వుల దండల మధ్య
పేదవాడి ఆకలి రేపిన సోషలు
గెలిచిన నేతకు వైవిధ్యపు జయజ ఘోషలు !!

బానిస సృంఖలాలు తెంచిన నేతలేరి?
తెల్ల నేతల గుండెలు పేల్చిన ఫిరంగులేవి?
నేర చరితల నేతల తలలు తీసే బిడ్డలేరి?

వీర పుత్రులు గన్న అక్షయ గర్భమిది
వుడుకుతున్న రక్తపు సెగల మంటలివి
ఇంకెంతో కాలం లేదు.. మంచిరోజులొస్తున్నాయి!!


pettandaarlatO vidhi aaDutunna chadarangamlO
pEda paavula bali peeTha midi!.
nitya nagna jeevita satyamidi !!
swaardha naayakula padavula pOraaTamlO
chindina bikhaari nettuTi padha midi!.
nitya nagna jeevita satyamidi !!
gelupu Dappula daDa daDa madhya
egirina puvvula danDala madhya
pEdavaaDi aakali rEpina sOshalu
gelichina nEtaku vaividhyapu jayaja ghOshalu !!
baanisa sRnkhalaalu tenchina nEtalEri?
tella nEtala gunDelu pElchina phirangulEvi?
nEra charitala nEtala talalu teesE biDDalEri?
veera putrulu ganna akshaya garbhamidi
vuDukutunna raktapu segala manTalivi
inkentO kaalam lEdu.. manchirOjulostunnaayi!!

నా సరి జోడు

సాంప్రదాయపు బరువు భారాన్ని మోయలేక
వంచిన ఆదర్స యువతి తలను చూడు
ఆలు మగలు సమమన్న రోజులేప్పుడొ పోయాయి
మాచేయి భారమంటు వాలిన పిల్ల కను రెప్పలు చూడు
కట్నాలునేనీయ, లాంచనాలసలీయమని ఎలుగేత్తి చాటుతూ
కొంగులోన దాగున్న వయ్యరి చెయ్యి చూడు
సంసార జీవితాన తనకిది మొదటి మెట్టని తెలిసి తొణకరాదని
కాలు మడిచి జాగ్రత్త చేస్తున్న చినదాని సొగసు చూడు
పెళ్ళిచూపుల లోనే ప్రస్నలేయక ముందే
పిల్ల తేలివి చూడు నాకిచ్చే నిన్ని సంజ్ఞలు
లేదు బెరుకు అమ్మ ఈపిల్లే నాకు సరిజోడు!!

అమ్మ ఇవ్వాళ సంక్రాంతిట అంటె ఏమిటి?

అమ్మ ఇవ్వాళ సంక్రాంతిట అంటె ఏమిటి?
తిండి దొరుకుట మనకి - జాప్య మయ్యె రోజని!!

బొమ్మలకు కొలువులట, కోడి పందాలట
సరదాల సమయము మనకి - పరదాల లోనె కదరా!!

హరిదాసు చిడతలట, గంగి రెద్దు గంటలట
ఆకలి కేకలె మనకి - కన్నీటి తప్పెట్లు

సంక్రాంతి సరదాలట, పిల్లలకి సెలవలట
రోజు గడవదు మనకి - చావొకటె మన సెలవ

ముగ్గుల్లొ పిడకలు పెట్టేటి దినమిదిట
ఆ సమయమె మనకి - పొట్ట నిన్పేదిరా బిడ్డా

గారే బూరెలు వారు చేసేటి పండగట
నిన్న గంజే మనకి - పరమ భాగ్యమ్ము

కొత్త అల్లుడింట సంబరాలు తెచ్చాట్ట
కొంపకొస్తె నీ అయ్య - పదివేలు అది మనకి

భోగి మంట లవిగో చలి ఇంక పోవునట
చింకి పాతే మనకి - చలి ఆపేనిన్నాళ్ళు

పాడి పంటలింట వచ్చేటి సమయమిదట
పురుగు పట్టినా మనకి - పరమాణ్ణమే ఆ గింజ

అందరూ సంక్రంతి సంబరాలే చూస్తుంతే
సంబరాలు చేసుకోలేని వారి సంగతేంటి?

వాడి కంటి నీరు నిచ్చె - భోగి మంటల సెగను నాకు
వాడి మాటల తీరు నిచ్చె - బసవ గంటల హోరు నాకు
వాడి ఆకలి కేక లిచ్చె - వేడి గారెల రుచులు నాకు
వాడి బాధల మూల్గు లిచ్చె - హరిదాసు గాధల గురుతు నాకు
వాడి జీవితం సాక్ష్య మిచ్చె - భావి పౌరుని ఘోష నాకు
వాడి గోడొక బావుటాగ
వాడి మాటొక స్ఫూర్తి కాగ
నా నోట రాలిన ఈ చిన్న నిప్పు
రగిలి కాంతులు ప్రజ్వరిల్లగ

తోటి వారికి సంబరాల్లో
పాలు పంచుతు చేయి నిస్తే
బిక్క చచ్చిన ఎన్నో మనసులు
సంబరాలకి ఎదురు చూచును!!!

బాల్యంలొ ఏముంద

బుద్ధి లేదు శక్తి లేదు,
తిరగ పడే సత్తా లేదు
మాట లేదు పలుకు లేదు
మంచి చేడు గ్నానం లేదు
తన డైపర్ చేంజె చేసే తీరు లేదు

ఆకలేస్తే ఏడుపు
పక్క తడిస్తే ఏడుపు
చీకటి చూస్తే ఏడుపు
అమ్మ కనిపించక పొతె ఏడుపు
చుట్టలొస్తే ఏడుపు,
చూట్టనికి వెళితే ఏడుపు

నేటి యువతకి కావలిసింది
మూగ చూపులు, బోసి నవ్వులు
బురద మడుగులొ పిచ్చి గంతులు
అందని అందలాలకి నిచ్చెనలు కాదు

చుట్టూ చూడు.. చెదలు పట్టి
సిధిలమవుతున్న స్వతంత్ర భరత దేశం
పురుగు పట్టి కుళ్ళి పొతున్న నేటి సమాజం
తండ్రి తాగ గంజి లేడు వీడి వీసా ఊసులు

మనమిక్కడే పుట్టం, పెరిగాం
ఈదేశపు గాలి పీలుస్తున్నం
భారతీయుడన్న వునికి నిచిన
తల్లి, మనమేమి చేస్తున్నం తనకి?

బాల్యం మాట పక్కనేట్టి
నడుం కట్టు, చీపురొకటి చేత పట్టు
పద నేను వస్తున్న నీతొనే
దేసాన్ని ప్రక్షళన చేద్దాం

అందుకు నీకు కావాలంటే దేవుణ్ణి శక్తి అడుగు
నాకు చీపురు చాలు !!

దేవుడూ.., నా బల్యం నాకు తిరిగి ఇవ్వూవూ?

చంటి వాడి గా అమ్మ యెదపై ఆటలాడానని
అందరు అంటే విన్నాను, ఆ తీపి క్షణాలు గుర్తులేవు!
ఆ వయసులొ నాకు గ్నాపకాన్ని ఎందుకివ్వలేదు?
అందుకే దేవుడూ.., నా బల్యం నాకు తిరిగి ఇవ్వు!!

వానలొ తడుస్తూ, వంటి నిండా బురద చేసుకున్న
మధుర సంఘటనలు, నాకు గుర్తులేవు!

ఆ క్షణాలు మళ్ళీ ఎందుకు ఇవ్వవు?
అందుకే దేవుడూ.., నా బల్యం నాకు తిరిగి ఇవ్వు!!

పోటీ చదువుల, రణరంగంలొ గెలవాలని
రత్రి పగలు మర్చి పోఇ, బడి చుట్టూ తిరిగ !

చదివాంగ? ఆట లాడని మనసు చివుక్కంతుంది
అందుకే, దేవుడూ.., నా బల్యం నాకు తిరిగి ఇవ్వు!!

గంతించిన కాలం మళ్ళ రాదని తెలుసు
ఆటలాదే వయసు కాదని తెలుసు,
చదువు కున్నాగా! నాకన్ని తెలుసు,
కానీ ఈ ఒక్క సారికి, నాకు ఒక్కడికే,

దేవుడూ.., నా బల్యం నాకు తిరిగి ఇవ్వూవూ?

స్వర్గానికి దారి చెప్పెద కాస్త పరికించి వినండి

లేత తొటకూర తుంచి కొంచెం వుప్పు తగిలించి,
దోర మగ్గిన రామమునగ లేద టమటాను కోసి
మంచి మునగకాయలు మృదువుగా చేర్చి
పెద్దవుల్లి తగినంత కొసి, వుడికిన కందిపప్పు కలిపి
కాస్త చిన్న వుల్లి మిర్చి రుబ్బి ఫ్రై చేసి కలిపి
చింత పులుసు లోన మరగ కాచి వద్దిస్తే!!
స్వర్గానికి రెందు అడుగుల దూరంలో ఆగినట్లే
ఇది కాక, ఎర్ర వుల్లి పొరలు విడదీసి, ప్రతి పొరకు
కాసింత శనగ పిండి అద్ది వేఇంచి, కరకర మంటూ
నంజుకు వడ్డిస్తే, అబ్బ మనకిక స్వర్గమక్కర లేదు!!

భొగి మంట

మాది మధ్య తరగతి కుటుంబం
first తారీకు కోసం ఎదురు చూపులు
gasవాడు షావుకారు
పనిపిల్లా పాల వాడు
తమ్ముడి పరీక్ష ఫీసు
తాత కాళ్ళ జోళ్ళు
అమ్మ దగ్గు మందు
ఇలా పెద్ద list నాన్న ముందు
ఇవి చాల వన్నట్లు
వచ్చె సంక్రాంతి పండగ
అల్లుడొచ్చె నట్టింట
అది నాన్న గుండెల్లో భొగి మంట

పల్లకిలో పెళ్ళి కూతురు

అమ్మ నొదిలి పోలేక
ఏడ్చి అమ్మను నొప్పించ లేక
దుఃఖ భారాన్ని మోయ లేక ...
చిన్న గ అదిరే అధరాలవిగొ!!...

అమ్మ నొదిలి పోలేక
తనదైన జీవితం ప్రారంభించ
పరిగెడు పారాణి ఆరని పాదాలను
కట్టి పడవేసిన ఆమె బాహు బంధమదిగొ!!...

అమ్మ ముఖము చూడలేక
తన దుఖము చూపలేక
కన్నులరమోడ్చి ఉప్పొంగుతున్న
కన్నీళ్ళకానకట్ట వేసినా కాటుక కన్నులవిగొ!!..

అలంకరించిన బంగారు పల్లకీను
బోయలు మోస్తున్న తరుణమాఇది లేక
కదిలించిన కట్టలు తెగి ప్రవహించ
సిధ్ధమైన దుఃఖ సాగరమా ఇది!!

వద్దు

గుండెలోని బావాలను గొంతులోనే నొక్కద్దు
మనసు పిండిన శోకాలను కంటిలోనె ఆపొద్దు
విరిసి వచ్చిన చిరునవ్వుని పెదవి నుంచి చెరపొద్దు
చిన్న నాటి స్నేహాలను నీ చివరి వరకు మరువద్దు

కలసి రాని కాలమిదని చేయు పనిని మానొద్దు
సాయము చేసిన చేతిని షేక్* హండుతో వదలొద్దు
కరుకు మాటకు తండ్రిని మనసు లోంచి తుడువద్దు
చదువు నేర్పిన గురువుని దణ్ణంతో మరువద్దు

ప్రశాంతత

మనసు పడిన కష్టాల వేడికి
గుండె కరిగి కన్నీరై పారిన వేళ

కను రెప్పల కట్టలు తెగి అశృవులు
చెక్కిళ్ళపై చిందులు తొక్కిన వేళ

శోకము గొంతుకు అడ్డము పడగా
నోట మాటలు తడబడి తప్పిన వేళ

ఉబికిన దుఃఖము నోటిని నొక్కగ
మూలుగు మాటకు ప్రతీక ఐన వేళ

దిక్కులు తోచక తిరిగెడి మనసుతొ
తడిసిన కళ్ళకు చీకటి కమ్మిన వేళ

లోకంబులు లోకేశులు లోకస్థులు
తెగిన తుది నలోకంబగు పెంజీకటి
కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని
నే భజియింతునన్న మెరుపు మదిన మెరవ

నిట్టూర్పుల వేడికి శుద్ధి అయి
కన్నీటి ధారలకు ప్రక్షాళనై
సక్రమ ఉచ్చ్వాస నిచ్చ్వాసలకు ఆరినదై
అరవిరిసిన ప్రశాంతత కన్నులెదుట తాండవమాడె!!!

నే ప్రేమించే తాత



ఆ బీటలు పడిన నుదుటి వెనక
--అనుభూతుల లోతు సాగరాలెన్నో

ఆ పన్ను లూడిన బోసి నోటి వెనక
--చెప్ప గలిగిన అనుభవ గాధలెన్నో

ఆ కండ కరిగిన తోలు చేతి వెనక
--కడతేర్చిన కటువు కార్యాలెన్నో

ఆ వంగి పోయిన వీపు నడక వెనక
--గెలిచొచ్చిన జీవిత పరుగులెన్నో

ఆ చికిలించిన లోతు కన్నుల వెనక
--చూసొచ్చిన తరతరాల గాధలెన్నో

ఆ తడబడుతున్న మాటల వెనక
--తీరని తన కోరికలెన్నో

డబ్బుతో ఏమి కొనగలం?

పుట్టినరోజుకొక కార్డుముక్క
వారానికొక ఆర్ధ్రత లేని ఈమైలు ముక్క
పెళ్ళిరోజుకొక కేకు ముక్క
సాగుతున్న ఊసులెన్నో -- అర్ధమిచ్చే భాషలేదు

కష్టమొస్తే అమ్మ మాట కరువు
ఇల్లు కొంటే నాన్న నవ్వు కరువు
బిడ్డపుడితే చూడ మామ కరువు
జరుగుతున్న ఘడియలెన్నో -- ఆపగలిగే శక్తిలేదు

తాత పోతే చూడ సెలవు లేదు
చెల్లి పెళ్ళికి వెళ్ళ వీలు కాదు
తడిసెడి నా కళ్ళు రెండే కానీ
ఆగుతున్న గుండెలెన్నో -- కన్నీటి ధారకు అడ్డులేదు

అమ్మ నాన్నను బాగ చూసుకోవాలని
వారి కంటినీరును తుడవాలని
వారి తలను గర్వంతో నిలపాలని
ఎగురుతున్న ఆశలెన్నో -- తీర్చగలిగే మరో దారి లేక

పరులు చెప్పిన మాటవిన్న
దబ్బు ఒక్కటే సత్య మన్న
దేశమొదిలి ఇక్కడొచ్చా
చేతికొచ్చిన డబ్బు తోటి
నే కొన్నదేమిటి? సాధించినదేమిటి?

నీ సొగసు చూడ తరమా ... నీ అలక తీరు సుఖమా?


బిగివడిన నీ నోటి పెదవులు
ముడివడిన నీ భృకుటి గీతలు
ఎరుపెక్కిన నీ బుగ్గ కాంతులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

బుస కొట్టెడి నీ శ్వాసలు
కసి రేగిన నీ మాటలు
పదునెక్కిన నీ చేస్టలు
నీ సొగసు చూడ తరమ
నీ అలక తీరు సుఖమా?

పరుగెట్టెది నీ నడకలు
సుడి రేపెడి నీ చేతలు
మాటాడని నీ ఊసులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

చిరునవ్వును తొణకనీవు
అలక హద్దు దాటనీవు
దరికి నన్ను రానీవు
ఒక్క పలుకు మాటాడవు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

ఏమిటి కారణం?

గడిచిన చీకటి రాత్రుల్లో
ఒంటరి జీవిత గాధలెన్నో

అస్థిత్వపు ఆరాట పోటీల్లో
ఒరిగిన క్షతగాత్రులెందరో

ఆశా సౌధపు మార్గము మరచి
దిక్కులు చూసే కన్నులుఎన్నో

తీరని కోర్కెల సమాధుల్లో
ఆరాటము చావని ఆత్మలుఎన్నో

ఈ నిరాశ నిస్పృహలకు కారణమేమిటి?

అందని అందలాలకి నిచ్చెన వేయటమా
అవకాశాలను దోచుకునే సమాజమా

ఆశే తప్ప ఆచరణలేని బాధితుడా!!


నీ భావుకత్వం సున్నితత్వం

తొలిపొద్దు సమయాన
మంచు పడ్డ గరికపువ్వును
గోడమీద పరుగెట్టే
గడియారం తొక్కింది !!

మురిపించే ఇంటి ముగ్గు
తొలిజాము గడబిడలొ
పిల్లవాని లంచ్* బాక్సు
లోన కెళ్ళి దాగింది !!

చిరువాన జల్లుల్లొ ఆడి
అలసిన మన మనసులు
ఈ జీవిత పరుగు పందాల్లో
చెమటలోన తడిసి సొలశై !!

జారి పోయే బ్రతుకు క్షణాలను
ఏరుకుంటూ సమసిపోయే ఈ బ్రతుకులకు
రాలిపోయే పూలు చూస్తూ
కన్నీరు కార్చే తరుణమేదీ ?

కరుడు కట్టిన గుండె తొడుగులు
చీల్చి లోపల తొంగి చూడు
భావుకత్వం, నీ సున్నితత్వం
కవిత లల్లుతూ బయటకొస్తాయి !!

తండ్రి

భూమి పైన అడుగిడి నప్పుడు
నింగికెగసిన మనసు తనది
అడుగులు తడబడు వసున
అందొచ్చిన వేలు తనది
మొదటి మాట పలుకు నప్పుడు
తోడయ్యిన మాట తనది
ఆరోగ్యపు గడబిడ లలొ
అదిరిపడిన గుండె తనది
గుండు సున్న మార్కులొస్తె
తపన పడిన తలపు తనది (మధన పడిన మది తనది)
మంచి మార్కులొచ్చి నప్పుడు
చాటిచెప్పిన నోరు తనది
బాధ అన్నది రాకుండగ
చెమటోడ్చిన తనువు తనది

చిన్న మాట అన్నాడని
ముఖము చాటు చేయబోకు
వయసు మళ్ళిన ముసలి వాడని
చీడ పురుగుల చూడబోకు
పనులు చేసే పటువులేదని
ఈసడించుచు కసురుకోకు

నీకు భారము అయ్యినందుకు
కుమిలిపోయే కనులు చూడు
నీకు సాయము చేయలేక
కృంగిపోయిన ఆ మనసు చూడు

కడుపు మంటను దాచుకుంటు
కంటి నీటిని మింగుకుంటు
గుండెపిండి తిండి పెట్టిన
తండ్రి కాలికి వందనం !!