Thursday, April 16, 2009

అర్ధాంగివయ్యేదానివి.


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

9 comments:

  1. మధుర వాణి గారు ధన్యవాదాలు

    ReplyDelete
  2. simply superb....aatreya gaaru.

    ReplyDelete
  3. ఆత్రేయ గారు,
    మొదటి చరణాలు చదువుతుంటే ఏదో సినిమాలో " ప్రకాష్ రాజు " కవిత గుర్తొచ్చింది. ;) .. అంటే బాగలేదని కాదు..

    ReplyDelete
  4. ప్రణు చాలా రోజులకు కనిపించావు మళ్ళీ.. ధన్యవాదాలు.
    భారారె గారు.. ఆకవిత ఏదో నాకు అర్ధంకాలేదండీ.. మీకు వీలు కుదిరినప్పుడు చెప్పగలరు. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మీ పదాల కూర్పు వదలక వెంటాడే భావతరాంగాలు
    నన్ను మీ బ్లాగుకి కట్టిపడేసాయి
    నాకూ నేర్పరూ మీ పదాల కూర్పు లోని నేర్పు

    ReplyDelete
  6. అద్దాన్ని అందంగా ...అర్ధాంగిగా ఊహించడం బావుందండీ !అంటే అర్ధాంగి లక్షణాల్ని అద్దానికి ఆపాదించడం . నేను సరిగా చెప్పలేక పోయాననుకుంటా !

    ReplyDelete
  7. మీలో మీరు గారు (సరదాకి అలా సంబోధించాను ఏమనుకోకండి) ఉష గారు బ్లాగులో ఓసారి 'భావం భాషని తీసుకొస్తుందని' బాబా గారు చెప్పారు.. అది నాకు నిజమనిపిస్తుంది. కానీ ఆ ఒరవడిని క్రమబద్దం చేయడానికి కొంచెం అనుభవం కావాలి. అది నాకూ లేదు లేండి. రాస్తూ ఉంటే వస్తుంది. నిరాశపడకండి. రాస్తూ ఉండండి. మీ బ్లాగు చూశాను చాలా బాగా రాస్తున్నారు. అభినందనలు. కొనసాగించండి. ఇటు వచ్చినందుకు, కట్టేయబడినందుకు ధన్యవాదాలు. మరోసారి కలుద్దాము.

    ReplyDelete
  8. పరిమళంగారు నిజమే.. అటువంటి భావాలు తోడున్న మనిషికి ఉంటే అంతకంటే కావలసింది ఏముంటుంది చెప్పండి.
    'మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో' అన్నారుగా మహాకవి గారు. అదే భావాన్ని నేనూ వ్యక్తం చేశాను. ఆవ్యక్తిని అద్దంలో చూశాను (నన్ను నేను చూశానా !!!? కాదండోయ్.. అద్దాన్నే వ్యక్తిగా చూశానన్న మాట) ధన్యవాదాలు.

    ReplyDelete