Tuesday, July 20, 2010

కవిత



తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే..

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ.. కరిగిపోతూ ..
అలజడిచేస్తూ..
అక్షరాల జల్లు

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో..

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.


picture by Jean-Sébastien Monzan
పొద్దు లో ప్రచురించబడినది http://poddu.net/?p=4829

Tuesday, July 13, 2010

ప్రకృతి


ఆకు నీడన చేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు...
నింపుకున్న గుంటలు..
నవ్వులు చిందిస్తూ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా..
గరిక కొనలమీదుగా
ఉదయిస్తూ..

ప్రతికిరణమూ
రంగులద్దుతూ..
మనసునద్దం పడుతూ..
ప్రకృతి.

పొద్దులో చూడండి http://poddu.net/?p=4833

Wednesday, July 7, 2010

నోటు





నగ్నంగా నిలబడ్డా..
నిలువెత్తు సత్యాన్ని,
కనుమరుగు చేస్తుంది.
కనబడ్డా కాదేమోనన్న
సందేహన్ని కొనిపెడుతుంది.

ఎంత పెద్ద నిజాన్నయినా..
గొంతులోతుల్లోనే సమాధి చేస్తుంది.

నోటు,
ఓ చిత్రానికి తగిలించిన పటంలాంటిది
నిజాన్ని, గోడకు బంధించి
అందనంత ఎత్తులో..
అందంగా చూపిస్తుంది

ఏ వేలిముద్రలు అంటకుండా
ఆదుకుంటుంది.

త్రినాధ్ గారి కవిత నుండి ప్రేరణతో
http://musingsbytrinath.blogspot.com/2010/07/seeing.html