Tuesday, August 25, 2009

ఏకాంతం




నీడనూ వదిలి
చీకట్లో.. ఒంటరిగా..
నిండిన దొప్పలతో..
నేనూ..

నిశ్శబ్దంలో..
మిణుగురులనేరుకుంటూ..
అలసి కీచురాళ్ళయిన
నా ఆలోచనలూ..

బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..
బందీలయ్యాము..

మెలకువొచ్చేసరికి
రంగులద్దుకున్న రాత్రి
నీడతోడిచ్చి ..
బండ మెడనగట్టి
దారి నడవమంది.

10 comments:

  1. నిజమే సుమా! ప్రతి ఉదయం ఓ కొత్త రూపం. బహుశా మనసులోని భావాలు ఈ కొత్త రూపాన్నిస్తాయేమో! సతోషంతో నిదుర లెస్తే అది ఆనందాల తోబుట్టువులా ఎదురొస్తుంది,బాధల సుడిగుండాలు నిదుర లేపిన క్షణంలో మీరన్నట్లు బండ మెడనగట్టినట్లుంటుంది.

    మ్చ్.. మీ ఆలోచనల రూపాలన్ని నన్ను నేను అర్దం చేసుకున్నాను అనిపిస్తాయి, అంతలోనే నాకు నేనే అర్దం కాలేదేమో అనిపించేస్తాయి.

    ReplyDelete
  2. చాలా బాగుంది. జీవితం అంటే అదే కదా?


    రంగులద్దుకున్న విశేషణం ఉచితంగా అనిపిస్తుందా? కవితా ఫ్లో కి ఇబ్బందిగా లేదూ?

    ReplyDelete
  3. బాబా గారూ ధన్యవాదాలు. మీరడిగిన ప్రశ్న నాకు అర్ధం కాలేదు. వివరించగలరు. తప్పులుంటే దిద్దుకుంటాను.

    ReplyDelete
  4. శ్రుతి గారు ధన్యవాదాలండీ. మనమందరం అదే బోటులో ఉన్నామండీ.. వెల్కంటు ది పార్టీ..

    ReplyDelete
  5. బాబా గారూ అర్ధం అయ్యింది మీరన్నది. ఆ విశేషణం అనుచితంగా ఉంది అన్నారా.. ? రంగులద్దుకున్న రాత్రి అని, రాత్రి (బాధ, పరిస్థితి) మారలేదు.. మరో ముసుగులో ముందుకొచ్చింది అనే భావంలో అలా రాశాను. మరోలా రాసుంటే ఇంకా బాగుండేదేమో.. మార్గదర్శన చేయగలరు. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. అవును.
    రంగులద్దుకొన్న అన్నమాటద్వారా ఉదయం అయ్యింది అనే అర్ధం ధ్వనిస్తుంది. కానీ కవిత ఆద్యంతం విషాదం పరుచుకొని ఉన్నట్లే అనిపిస్తుంది. ఆఖరు వాక్యాలుతో సహా. మరలాంటప్పుడు రంగులద్దుకొన్న అనే విశేషణం ఎందుకో పొసగలేదనిపిస్తుంది.
    మీరేమంటారు?

    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. అదే రాత్రి మరో వేషంలో వచ్చింది, ... బాధ తీరలేదు, బరువు వదలలేదు.. స్థితులు మారలేదు అని చెప్పదలిచాను. మీరన్నది నిజమే ఉదయం అయ్యింది అని ధ్వనిస్తుంది. కానీ అది పరిస్థితులుపైన కేవలం ముసుగే.. అని ముగించదలిచి అలా రాశాను. మీరైతే ఎలా రాసిఉండే వారు ? (అధికారమో అహంకారమో. వ్యంగ్యమయమయిన ప్రశ్న కాదు.. అర్ధం చేసుకోవాలనీ, నేర్చుకోవాలనీ.. అభ్యర్ధన నిండిన ప్రశ్న అది.. అన్యధా అనుకోకండి ! )

    ReplyDelete
  8. మొత్తం మీద బంతిని ..... ఒకె సరదాగా

    తారల రాత్రి
    చలి చీకట్ల రాత్రి
    నెలవంకకు వేలాడే రాత్రి (.?)
    ఆ/ఈ తుఫాను రాత్రి
    ఉదయాన్ని చేజార్చుకొన్న రాత్రి

    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. ఆత్రేయ గారు నేను ఈ బ్లొగ్ కి కొత్త గా వచ్చాను.
    ఈ కామెంట్స్ చదివాక అర్థం అయింది ఏమిటంటె బాబా గారు చెప్పినట్టు అక్కడ రంగులద్దుకున్న రాత్రి కంటే "ఉసూరు మనే ఉదయం" అంటే ఎలా ఉండెది అంటరు.

    నాకు కవిత్వం అంతగా తెలియదు గాని ఎదొ చెప్పలనిపించింది
    తప్పైతె క్షమించండి .
    కార్తీక్

    ReplyDelete
  10. బాబా గారు ధన్యవాదాలు. మీ సూచనలు బాగున్నాయి. ఇకపై ముద్రించేముందు బాగా ఆలోచించి మరీ చేస్తాను. ధన్యవాదాలు .

    కార్తీక్ గారు నాబ్లాగుకు సాదర ఆహ్వానం. మీ సూచనా బాగానే ఉందనిపిస్తుంది. ధన్యవాదాలు. అయ్యో దీనికే క్షమాపణలు ఎందుకండీ.. మీరనుకున్నది నిరభ్యంతరంగా చెప్పొచ్చు.

    ReplyDelete