Friday, June 12, 2009

రాత్రి




విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని, ఎప్పటిలానే..
కలలు పరిచిన నిశీధిలో
విరిగి చెదిరిన ఆశ తునకలు
ఏరి తిరిగి కూర్చలేక ..
బంధాలు త్రుంచి,
బరువు తీర్చమన్నట్టు..
వేడి నిట్టూర్పుల బలానికి
విగత భావాల తోడుగా
అనంత వీధుల్లో..
ఈ రాత్రి...
గాలిపటంలా ఎగరుతుంది..

పండు వెన్నెల, పిల్ల గాలులూ..
ప్రకృతి అందం... ఏమాత్రం పట్టవు.
చుక్కాని విరిగిన పడవ సరంగులా
బ్రతుకు పోరాటంలో
తపన పడుతూ తిరుగుతుంది..
ఊపిరి ఉగ్గబట్టి ... పంటిబిగువున
బంధాలను లాగుతుంది..

రంగులు పులుముకుంటున్న
తూర్పు కొండల వెకిలి నవ్వు..
చెట్టు కొమ్మల్లో ప్రతిధ్వనిస్తుంది..

ఓడి కరిగిన రాత్రి అవశేషాలు
వెలుగు చూడని కోణాల్లోకి
విసిరేయబడతాయి !!

15 comments:

  1. ఊపిరి ఉగ్గబట్టి ... పంటిబిగువున
    బంధాలను లాగుతుంది..

    చాలా బావుంది
    అభినందనలు

    ReplyDelete
  2. రాత్రిని గాలిపటంలా ఎగరవేస్తుందన్నారా..!! లేదా విరగబూసిన జ్ఞాపకాలు ఎగురుతున్నాయన్నారా!! of course చదివే తీరు మార్చితే రెండూ బాగున్నాయి. అదరహో..!!
    అద్బుతం నిజంగా రాత్రి చేస్తున్నది మరియు ‘రాత్రి’లో మీరు చూపగలిగినది..రెండునూ..కవిబలగమెంతో వాడే పదాల్లొనే తెలుస్తున్నది అని అంటున్నాను. చెట్టుకొమ్మల్లో ప్రతిద్వనించడం నిజంగా ఏమి ఆలోచన..అబ్బా..

    ముగింపు ఇంతకన్నా గొప్పగనా...
    తల్లడిల్లే హృదయాన్నిపలకరించిన కవికళాహృదయం ఇలా కవితల్లో చూస్తుంటే.....చాలా బావుంది. దన్యవాదాలు.

    ReplyDelete
  3. హరేకృష్ణ గారు ధన్యవాదాలు.

    వర్మగారు.. మనం రైలులో ఉంటే చెట్లు వెనక్కి పోతున్నాట్టు కనబడుతుంది. అలానే.. ఈ పోలిక కూడా.. రాత్రి, తన మెడలో జ్నాపకాల మాలవేసుకుని.. గాలి పటంలా తిరుగుతుంది (అంటే ఊగిసలాడుతుంది) అని నా భావన. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. రంగులు పులుముకుంటున్న
    తూర్పు కొండల వెకిలి నవ్వు..
    చెట్టు కొమ్మల్లో ప్రతిధ్వనిస్తుంది..
    చాలా బావుంది.

    ReplyDelete
  5. చాలా బావుంది.

    ReplyDelete
  6. ""రంగులు పులుముకుంటున్న
    తూర్పు కొండల వెకిలి నవ్వు..""

    ""ఓడి కరిగిన రాత్రి అవశేషాలు..""

    చక్కని పద ప్రయోగాలు.
    బావుంది.

    ReplyDelete
  7. పద్మార్పిత గారు ధన్యవాదాలు.

    హమ్మయ్య రాధిక గారికి నచ్చిన ఓ కవిత చాలా కాలానికి రాయగలిగానన్న మాట. ధన్యవాదాలు రాధిక గారు.

    నాలోనేను గారు ధన్యవాదాలు

    ReplyDelete
  8. మీ కవిత ముందుగా బహుశా నేనే ముందు చదివివుంటానండి. ఎందుకో ఆ చిత్రం గగుర్పాటుని కలిగించింది. వ్యాఖ్య కూడా వ్రాసే సత్తువ లేక పారిపోయాను. ఆ పగలు నవ్వుల తూరుపుకొండలు, ఓడిపోవటానికి వచ్చే ప్రతి రేయీ ఆశా నిరాశల ప్రతినిధులుగా కూడా బానే ద్వనిస్తున్నాయి. విగత భావాలు అన్న పద ప్రయోగం నాకు నచ్చింది. ఎందుకంటే నావి కొన్ని అవే మరణిస్తాయి, కొన్ని నేనే చంపాల్సివస్తుంది, వెరసి వాటిని పూడ్చే శ్మశాన కాపరిని నేనే.

    ReplyDelete
  9. గతిస్తున్న ఒక భయంకరమయిన రాత్రిలోనుంచి మరో రాత్రి ఉద్భవిస్తుంది.. ఇదే కధ పునరావృతం అవుతుంది అన్న ఊహకు ఈ చిత్రాన్ని ఇక్కడ ఉంచాను.

    నిజమేనండీ.. మన భావాల కర్మస్థలం మనమే.. సరయిన అంత్యక్రియలు జరగని భావాలే చేదు జ్నాపకాలై జీవితన్ని చప్పరిస్తాయి. బ్రతుకు ప్రతి మలుపులోను దీపాల నార్పుతాయి.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  10. మీరు వివరించాక మరోసారి చూశానా చిత్రాన్ని !
    మీ ఊహకు సరిగ్గా సరిపోయిందని అర్ధమైంది .
    కవిత చాలా బావుంది ఎప్పటిలాగే ......

    ReplyDelete
  11. పరిమళం గారు ధన్యవాదాలండీ. చిత్రం కాస్త భయంకరంగా ఉన్న మాటనిజమే.. కానీ అంతే భయంకరమయిన రాత్రిని చూపడానికి అది తప్పనిసరి అయింది.

    ReplyDelete
  12. గొప్ప కవిత అంతే గొప్ప కామెంట్లు.
    మిస్స్ అయ్యాను.
    అందుకే ఇదిగో ఇలా.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  13. బాబా గారు ధన్యవాదాలండి. మీరెప్పుడొచ్చినా స్వాగతమే

    ReplyDelete
  14. aatreaya gaaruu naaku nachchina kavita ani kaadanDi,neanu anni kavitalu,andari kavitalu caduvutaanu.caalaa maTuku annii nachcheastaayi.kaamemTu peTTea anta tiirika vunnaroaju cadivina vaaTiki kaamemTlu peDataanu anthe.mii ii kavitakannaa bhayamkaram gaa nachcheasina kavitalu miivi caalaanea vunnaayi :)
    copy paste work avvatledu mii blog lo anduke ilaa.

    ReplyDelete