Wednesday, April 8, 2009

రాత్రి భయం


నిన్న పడమటి వేటగాడు చల్లిన
విశ్రాంతి గింజల కోసం వాలిన రాత్రి
జ్ఞాపకాల వలలో చిక్కి, బెదిరిన కళ్ళతో
చీకట్లో వణుకుతూ విలవిలలాడుతుంది.

తూర్పు కొండమీద అతనొస్తున్న అలికిడి
వెలుతురై ఆకాశాన్ని ఓ పక్క ఆవరిస్తుంటే...
పెల్లుబికిని బ్రతుకు భయం, తన కళ్ళనుండి
సింధూరమై తూర్పు నింగిని అలుముకుంటుంది

దాని నిట్టూర్పుల వేడి శ్వాసలు తగిలి
ఇళ్ళముందు కళ్ళాపులు ఆరుతున్నాయి
ఆతృత అధికమయి నుదుటి బిందువులు
దాని ఆశలా జారి పచ్చగడ్డి మీద జేరుకున్నయి

అంతవరకు తనకి ఊరట కల్గిస్తూ, స్నేహంగా ఊగి
ఊసులాడిన కలువా.. మూతి ముడిచింది.
తలవంచి దీనంగ శోకాన్ని గుప్పించి, పొద్దు
తిరిగేసరికి ముఖము తిప్పె మరికొన్ని పూలు.

వేటగాడటుగా రాకుండ పోడు ..
చీకటి రాత్రినతను మింగకా పోడు..ఇది
కుమ్మరి చక్రంలా..సాగుతూనే ఉంటుంది.
పునరావృతమవుతూనేఉంటుంది ....

8 comments:

  1. అద్బుతంగా ఉంది
    ఎందుకో మీరిలాంటి భావచిత్రాలతో కూడిన కవితలు ఈ మధ్య వ్రాయటం తగ్గించేసారు.
    ఇలాంటి వాటి బరువు వాటినాస్వాదించేవారి గుండెల్లోకి చాలాలోతుగా జారుతాయి. ఇంకుతాయి

    ReplyDelete
  2. బాబా గారు ధన్యవాదాలు.

    నిజమే ఇటువంటి వాటి పాలు కాస్త తగ్గింది. ఇలాగే రాయాలి అని ప్రయత్నపూర్వకంగా రాయడం నాకు చేతకాదండి. ఏదో వచ్చిన భావాన్ని వచ్చినట్టు రాసేస్తానంతే. కానీ మీరన్నట్టు ఇటువంటి భావచిత్రాలు నిజంగానే చాలాలోతుగా గుండెల్లోకి దిగబడతాయి.

    నేను నిన్నరాసిన 'వాన ' కు మంచి స్పందన వచ్చినా.. దానిలోని ఆంతర్యాన్ని సరిగా వ్యక్తంచేయలేకపోయానన్న అసంతృప్తి నాకు కలిగింది. అందుకే మరో టపా దానికి ఉద్దేసించి రాశాను. ఇటువంటి కవితల్లో ఎంతో భావుకతని, తర్కాన్నీ ఆవిష్కరించ చూస్తాను కానీ అందరికీ దాన్ని అందించలేక పోతాను..

    ఇంకా కృషిచేయాలన్న మాట.. చేస్తున్నాను. మీవంటి వారి అభిమానమూ ప్రోత్సాహం ఎప్పుడూ అభిలషనీయమే. మీకు మరోసారి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఆఖరి వాక్యం ఇలాఉండాలి :-)
    ఇలాంటి వాటి బరువు వాటినాస్వాదించేవారి గుండెల్లోకి చాలాలోతుగా జారుతుంది. ఇంకుతుంది

    ReplyDelete
  4. wowh...!! excellent. నిజంగా బాబా గారు అన్నట్టు భావచిత్రం ఇంకిపోయింది.

    చీకటిమంత్రం చాలినట్లు, వెలుతురు అంచులు పిలిచినట్లు
    చిలుకలు, పిచుకలు ఫ్రాణాలు చూసుకున్నాయి
    నిశబ్దనీరసాలను విడిచిన చెట్లచిగురులు గాలికి తోడై
    భయంపారద్రోళి ఆశల రెక్కలను విరుచుకున్నాయి
    నలుపుతెలుపుల గుడ్డి జీవనం చీకట్టిచ్చిన విశ్త్రాంతి అస్త్రం ఏకమై
    ఉదయపుటంచులు సానబట్టి రంగురంగుల మెరుపుకలలుకన్నాయి..

    ReplyDelete
  5. ఆత్రేయ గారు..

    మీ కవిత నాలోని కవిని తట్టి లేపుతోంది.. నా ప్రయత్నం చూడండి http://blaagu.com/sateesh

    ReplyDelete
  6. సతీష్ గారు ధన్యవాదాలు. నాబ్లాగుకు స్వాగతం. మీ రెండు కవితలు చదివాను చాలా బాగున్నాయి. మళ్ళీ మీ బ్లాగుకు సమయం చూసుకుని తిరిగి వస్తాను.

    ReplyDelete
  7. ఆత్రేయ గారు,

    "పడమటి వేటగాడు" "తూర్పు కొండ మీద వస్తున్న అలికిడి" కొంచం అతకలేదని అనిపించింది...కాని అసలు "పడమటి వేటగాడు" ఎవరు, ఏమిటీ అన్నది అర్థం కాని మాట నిజం.

    "కళ్ళ నుండి సింధూరం..."? భయానికీ సిందూరానికీ స్వామ్యం ఎలాగో.....అదీ అర్థం కాలేదు.

    పడమటి వేటగాడు రాత్రిని ఎలా మింగుతాడు? అసలు దాని సృష్టికర్త అతనే కదా........ప్రాక్వేటగాడయితే మింగడానికి బావుండేదేమో :-)


    వేరొక వ్యాఖ్య లో చెప్పినట్టు....ఇది పైపైన చూసిన చూపుకానిన భావం మాత్రమె....తత్త్వం శోధన చేయలేదు.

    ReplyDelete
  8. వేటగాడు సూర్యుడి. నిన్న పడమటి కొండదిగుతూ.. విశ్రాంతి దొరుకుతుంది అన్న ఆశను గింజల్లా జల్లిఫోతే, రాత్రి వాటికి ఆశపడి వాలింది. ఇప్పుడు మళ్ళీ వాడే తూర్పు కొండల మీదగా తిరిగి వస్తున్నాడు.

    జ్నాపకాల వలలో చిక్కి భయపడ్డ రాత్రి, నిద్ర మరిచింది. కళ్ళుఎరుపెక్కాయి.. ఆఎరుపే రాత్రికంటి తూర్పు కొలకులకు చేరింది.

    నిన్న పడమటి వైపుకు వెళ్ళిన వేటగాడు ఈరోజు తూర్పు వైపునుంచి వస్తున్నాడు. ఆవైపునించి చీకటి మింగుతూ..

    ReplyDelete