Tuesday, February 24, 2009
వాన వెలిసిన ఉదయం
నల్ల మబ్బుల చిత్తడి ముసుగులోనుంచి
ఈ ' రోజు ', ఉదయాన్నే బద్ధకంగా నిద్ర లేచి
కిటికీలోనుంచి బయటికెళ్ళింది. చూస్తే...
చిరుగాలులు చల్లని వేళ్ళతో తడిసి చెదిరిన
చెట్ల రెమ్మల ముంగురలను సున్నితంగా సద్దుతున్నయి
రాత్రి కొమ్మల మీద పేలిన రంగు గుబ్బలు ఇంకా
తమ గుండెల్లో నీళ్ళు తోడి పోస్తున్నాయి
సొగసు తుంపరలు తమనిండా నింపుకుంటున్నాయి.
చినుకులు పెట్టిన ముద్దులకు ఇంకా సిగ్గులు చిమడక
ప్రకృతి సిగ్గులొలుకుతూ తల దించుకునే
తన సుందర సోయగాల్ని ఆరవేస్తుంది.
తడి రెక్కలు టపటప కొడుతూ నీరెండలో
పక్షులు తమను తామే ఆరేసుకుంటున్నాయి
ముక్కుతో తమ పమిటలు సద్దు కుంటున్నాయి.
రోడ్డు మీద విరిగి పడ్డ ఆకాశం పెంకుల్లో
రెండుకాళ్ళ జింక పిల్లలు గంతులేస్తున్నాయి
నేల గంధాన్ని తమపైన చల్లుకుంటున్నాయి.
పడక్కుర్చీలో తాత ముఖం మడతల్లో దాగిన
తన బాల్యం, బయట పిల్లల్లో పరకాయ ప్రవేశం
చేసి తనని మురిపిస్తోంది. ముసి ముసి నవ్వులు తెప్పిస్తొంది.
నెమళ్ళు పురివిప్పి విసిరిన వలలో అందరి చూపులు
చిక్కి జగతి మరిపిస్తున్నాయి, అవి విసిరిన రంగుల్లో
ప్రకృతి పులకిస్తోంది, గర్వంలో నెమలి ఓళ్ళు జలదరిస్తొంది.
గూటిలోనుంచి బయటపడి రంగులద్దు కున్న
సీతాకోక చిలుకల్లా.. గుండె నిండిన ఆనందం
కాళ్ళు తడుపుతుంది, చిందిన ఆనందపు చిందులు
పరిసరాలని ప్రక్షాళితం చేస్తున్నాయి
చూపరుల ఊహలకు అనుగుణంగా వాటి రూపాన్ని
అవే మార్చుకుంటూ.. మరో చోట అందాలు పండించేందుకు
మబ్బులు వలస వెళుతూ. వీడ్కోలు చెపుతున్నాయి.
దిగులు నిండిన 'రోజు ' మండుతూ లోకాన్ని ఎండగట్టింది.
మళ్ళీ ఎప్పుడన్నట్టు ఎదురు చూస్తూ నిలిచింది.
Subscribe to:
Post Comments (Atom)
"గూటిలోనుంచి బయటపడి రంగులద్దు కున్న
ReplyDeleteసీతాకోక చిలుకల్లా.. గుండె నిండిన ఆనందం"
మనసు నిండిపోయింది ....మాటలు కరువైపోయాయి .
విశ్రాంతి కావాలన్నారుకదా
ReplyDeleteనిజమే అనుకున్నాను
సడి చేయకుండా గుండె
గది చేరి చూశాను
మూసిన రెప్పల చాటున కదిలే
కనుపాప నవ్వింది
మదిలో నాట్యం చేస్తున్న
మీ కవితా సుందరి
తను హామీ ఇస్తున్నానంది
ఇదిగో ఇలా ఉదయాన్నే మీరొస్తారని
తెలిసే ప్రకృతి కాంతను
సాయం కోరాను సరేనంటూ
భలే గమ్మత్తుగా స్వాగతించింది
వలదన్నకానీ నిను వీడని
నెచ్చెలి తానంటూ
యేదలోన కొలువైన
భావాల ఝరిని కాదని
మరి నిదురించ గలరా?
హమ్మయ్య మళ్ళీ వచ్చేశారోచ్! కొత్త కవిత తెచ్చాశారోచ్!
గురువు గారూ, ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా? సరే నోటిమిద వేలు పెట్టేసుకుని బుద్దిగా కూర్చుంటానే. మరి మీరు మళ్ళీ విశ్రాంతి కావాలని వెళ్ళిపోకూడదు. సరేనా?
ఇలాంటి అందాలను మనిషిలో చూడగలిగాను ఒకప్పుడు నేను, మళ్ళీ కవితల్లో చూస్తున్నాను. మొదలుపెట్టగానే మనసు ఊరుకుంటున్నది. వ్యాఖ్యాతల అభిప్రాయాలు కూడా బావున్నాయి.
ReplyDeleteవాన వెలిసిన వేళ వాతావరణపు వర్ణన ప్రకృతమ్మవింటే పరవశించిపోవడం ఖాయం. అన్నింటినీ అందంగా కవితల్లో బందీచేసేస్తున్నారు..అభినందనలు.