Thursday, July 16, 2009

సగటు సాఫ్టువేరు బ్రతుకు


దైనందిన జీవితపు
నిష్టూరాల నేపధ్యంలో..
భాంధవ్యాలు క్లాజెట్టులోనుంచి
ఆర్తిగా పిలుస్తూ ఉంటాయి..

చూడగోరి బెంగపడ్డ
అమ్మ చెక్కిళ్ళ తడిని
ఫోను తంత్రులే
తుడుస్తుంటాయి..

జన్మ దినాలూ ఆనందాలూ..
ఈకార్డులు, కేకుముక్కల్లోనే..
పరవళ్ళు తొక్కుతుంటాయి..

చెల్లి పెళ్ళికో, తాత తల కొరివికో
వెళ్ళాలన్న తపనలు
ఎవరి సంతకం కోసమో
ఆబగా వేచి చూస్తుంటాయి.

వదిలొచ్చిన దేశం
గోడమీద పోస్టరులోనూ..
అమ్మ చేతి రుచి
అంగడి సీసాల్లోనూ..
నాన్న ఆశలు
పరుసు మడతల్లోనూ..

పాతికేళ్ళ అనుబంధం
పాశ్చాత్య మోజు వెనకో..
పరిస్థితుల వేడి వెనకో..
దాచుకున్న ప్రవాసీ బ్రతుకులివి..

చౌకధరల అడవుల్లో
తనవారిని వెతుక్కుంటున్న
ఓ ద్రిమ్మరి బ్రతుకిది..
సగటు సాఫ్టువేరు బ్రతుకిది.


తానా 2009 సావనీరులో ప్రచురించ బడిన కవిత. చిన్న మార్పుతో..

24 comments:

  1. Heart touching one.... Excellent

    ReplyDelete
  2. very true and very very touching one.well said sir.

    ReplyDelete
  3. ఈ బ్రతుకుల్లో కాలి తుదకు మనము మీ చిత్రంలో లా తయారవుతామేమో.. బాగుంది సారూ కవిత.

    ReplyDelete
  4. వికాసం గారు నా బ్లాగుకి స్వాగతమండీ. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    రాధిక గారు నెనరులు. మీ కవితల కోసం ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నామండి. ఏమన్నా రాయండి తొందరగా..

    భారారె గారూ.. ఆ చిత్రానికి వివరణ..
    జీవితం తెల్ల కాగితం.. దాంట్లోనుంచి వేరుచేయబడ్డ నిండు మనిషి, రక్త మాంసాలు, ఉనికి ఏమాత్రంలేక,కోల్పోయి, కత్తిరించెవేయబడ్డ తన గతాన్ని చాయా మాత్రంగా మిగిలిన తన రూట్సు (roots)ని నిస్సహాయంగా చూస్తున్నాడు... ఆలోచిస్తున్నాడు.

    ReplyDelete
  5. ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాదనలేని సత్యం.
    మరొకరికి అర్దమవ్వని జీవితం

    కవిత చాలా బాగుంది ఆత్రేయగారు.

    ReplyDelete
  6. జాహ్నవి గారు నాబ్లాగుకు స్వాగతమండీ.. ఇటుగా ఓ కన్నేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. కదిలించావ్ గురూ !

    ReplyDelete
  8. కృష్ణ గారు నా బ్లాగుకు స్వాగతమండీ.. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. మీరన్న మాటకి మనసు ఒప్పుకుంటుంది...
    కాని మైండ్ మిగతావారి సంగతి ఏమిటంటుంది...(
    (సాప్ట్ వేర్ వాళ్ళే కాదు ఇతరుల బ్రతుకులు కూడా ఇలాగే వున్నాయి అని నా అభిప్రాయం, అంతే కాని మీకు అడ్డు చెప్పాలని కాదు)

    ReplyDelete
  10. నిజమే పద్మార్పిత గారు. బాగా అన్నారు. అందుకె..

    "పాతికేళ్ళ అనుబంధం
    పాశ్చాత్య మోజు వెనకో..
    పరిస్థితుల వేడి వెనకో..
    దాచుకున్న ప్రవాసీ బ్రతుకులివి.."

    అని కూడా అన్నాను... మీరు అడ్డుచెప్పినా నేనేమీ అనుకోనండి. మీరేమీ అలోచించకుండా మాటాడరు కదండీ.. ఇది టార్గెటెడ్ ఆడియన్సు కోసం రాసినది. తానా వారు ఈ సంవత్సరం ప్రవాసీ బ్రతుకు టెక్నాలజికల్ ఆస్పెక్ట్ (సుమారు అటువంటి టాపిక్ ) మీద కవితలు వ్యాసాలు తీసుకున్నారు. నేను పంపిన ఈ కవితను వారు ఈ సంవత్సరం సావనీర్లో ప్రచురించారు. అలా రాయడం వల్ల మిగిలిన వారిని అంతగా హైలైట్ చెయ్యలేదు. మీరన్నది ముమ్మాటికీ నిజం.

    ReplyDelete
  11. చాలా చాలా బగా వ్రాసారు. నాకు నచ్చి bookmark చేసుకొన్న కొన్ని లింక్ లు గుర్తుకు తెచ్చారు. వాటిలో కొన్ని.

    http://telugudanam.co.in/saahityam/kavita.htm#dUratIrAlu

    http://www.telugupeople.com/content/Content.asp?ContentID=13159&uid=20090716211932

    ReplyDelete
  12. అమ్మకానికి పెట్టిన గాజు
    బొమ్మ లాంటి జీవితం

    అవసరాల గెలుపులో
    నలిగిన ఆత్మ కథలివి

    అనుభూతులన్ని గుండె
    గదిలో నిక్షిప్తమై

    పరాయి స్వాధీనంలో
    వెలుగుతున్న మేధో దీపాలివి

    అమ్మ చేతి కమ్మదనం
    నాన్న చేతి ఆసరా

    చిట్టి తల్లి నవ్వుల పూవులు
    తట్టిలేపిన వేళలో

    ట్రింగుమని మోగిన
    బాసు ఫోనుతో మళ్ళీ

    గుండెగదిలో దాక్కుని ఓదార్పు
    నిస్తాయి కంటి చివరల చెమర్చి

    ఇంతే గురువుగారు నేటి సగటు మనిషి జీవితం.

    ReplyDelete
  13. అనానిమస్ గారు ఎన్నాళ్ళకొచ్చారూ.. ధన్యవాదాలు. మంచి లింకులు చూపించారు.. ఆ కవితలు బాగున్నాయి. మీ పేరు తెలిసిఉంటే.. నోరారా పేరుపలికి ధన్యవాదాలు చెప్పేవాడిని.

    శ్రుతిగారు.. అద్భుతమ్ గా ఉంది మీ కవిత. నా నోట నిజంగా మాటల్లేవు. నన్ను గురువుగారూ అంటూ.. ఇంత బాగా రాసేస్తే.. చదివేవాళ్ళకి నామీద ఎక్స్పెక్టేషన్సు పెరిగి పోవూ.. మీతోట పంటంతా.. నాకిచ్చినంత ఆనందంగా ఉంది.. నిజం చెప్పొద్దూ.. మీకవిత ముందు నాకవిత చిగురాకులా ఉంది (మిమ్మల్ని ఏచెట్టూ ఎక్కించడంలేదు... మనస్పూర్తిగా చెపుతున్నాను. ) అభినందనలు.

    ReplyDelete
  14. శ్రుతిగారు మరో విషయం చెప్పడం మరిచాను.. చిన్న సవరణ.. మీకవితలోని ఈ క్రింది వాక్యాల వరుస మారిస్తే ఇంకా బాగుంటుంది.

    "అమ్మ చేతి కమ్మదనం, నాన్న చేతి ఆసరా, చిట్టి తల్లి నవ్వుల పూవులు, తట్టిలేపిన వేళలో.. ట్రింగుమని మోగిన, బాసు ఫోనుతో మళ్ళీ.. గుండెగదిలో దాక్కుని ఓదార్పు, నిస్తాయి కంటి చివరల చెమర్చి "

    అమ్మచేతి కమ్మదనం,
    నాన్న చేతి ఆసరా,
    చిట్టితల్లి నవ్వుల పూవులు,...

    ట్రింగుమని మళ్ళీ మ్రోగిన
    బాసు ఫోనుతో...

    గుండెగదిలో నుండి,
    కంటి చివరలకి చేరి ఓదార్పునిస్తాయి..

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. చాలా బాగా రాశారు.
    భాధను పలికించడానికి మీరు ఎన్నుకొన్న పదాలు అద్భుతం.
    మనసు పడే క్షోభ కళ్ళముందుంచారు.

    ReplyDelete
  17. గురువు గారు నమస్కారం. ఇది సగటు సాఫ్టువేరు బ్రతుకన్నారు, ప్రాపంచికవిషయాల్లో తగులుకుని అనుష్టానం మరిచిన ప్రతివారు అంతటా నేటి ప్రపంచవాతావరణంలో బ్రతుకుని ఈరీతిలోనే సాగించప్రయత్నం తెలియకుండానే చేసేస్తున్నారని నా అభిప్రాయం.

    ఏమైనా సందేశాత్మక కవితలనందిస్తున్నారు, చాలా బావుంది..
    నిజంగా ఈ తెలుగు బ్లాగ్ లోక కవితాప్రపంచంలో మీరొక మార్గదర్శకం.

    ReplyDelete
  18. బాగుంది.
    ఒక విషయాన్ని చెప్పటం కోసం దానివెనుక ఉండే విషాదాన్ని గ్లోరిఫై చెయ్యకa తప్పదేమో.


    చెల్లి పెళ్ళికో, తాత తల కొరివికో
    వెళ్ళాలన్న తపనలు
    ఎవరి సంతకం కోసమో
    ఆబగా వేచి చూస్తుంటాయి.

    చాలా బాగుంది.
    చిన్న డౌటు. మీ పదప్రయోగాలపట్ల నాకు అవిశ్వాసమేమీ లేదు కానీ
    ఆబగా అన్న మాట బదులు ఆశగా, ఆర్తిగా, దీనంగా అన్న మాటనెందుకు వాడలేదు? తెలుసుకోవాలని ఉంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  19. వర్మ గారు ధన్యవాదాలు. నిజమే మనందరి బ్రతుకులు అలానే ఉన్నాయి. ఇదే అభిప్రాయాన్ని పద్మార్పితగారు కూడా వ్యక్త పరిచారు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    బాబా గారూ

    ఆబ అన్న పదం కోసం బ్రౌణ్యంలో వెదికాను కనపడలేదు. అసలు ఆ పదమే తప్పేమో.. తెలియదు. మీరైతే ఆ పదాన్ని ఎటువంటి సందర్భాలలో వాడతారో చెప్పనేలేదు. ఆ పదాన్ని ఎందుకు వాడానో చెప్పే ముందు మిగిలిన మదాలను నేనెటువంటి సందర్భాలలో వాడతానో చెపుతాను. తెలుగు భాష మీద నాకు అంత పట్టులేదు. నాకవితలు చూస్తే మీకు తెలుస్తుంది.. నాకు తెలిసిన పదాలు చాలా తక్కువ అవే పదాలను అటుతిప్పి ఇటుతిప్పి వాడేస్తూ ఉంటాను. ఎప్పుడో గానీ కొత్త పదాలు కనపడవు. ఒకటే అర్ధాన్ని సూచించే మాటలు, మీరు చెప్పినవాటితో కలిపి ఇవి (నాకు తెలిసినంత వరకు)
    ఆశ, ఆర్తి, దీనం, ఆతృత, ఆర్ధ్రత, ఆత్రము, ఆకాంక్ష, ఆబ

    ఆశ -- అన్ని సందర్భాలలో మన అర్హతను సూచించదు. మన అవసరాలనూ సూచించదు.
    ఆర్తి -- అర్హత ఉండి, దానికి తోడు పరిశ్రమించిన పిదప అది తీరనప్పుడు, మనలో కలిగే అలజడి రేపిన నిస్సహాయత, నిస్సత్తువలలోనుండి వచ్చేది ఆర్తి. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ స్థితి అన్నమాట. సాధారణంగా ఆర్తిని నేను పలుకులకు, పిలుపులకు వాడతాను.
    దీనం -- ఓటమినీ, నిరాశను, నిస్సత్తువనూ, ఇక ఏమీ చేయలేక ఎవరినీ అడిగేది లేక మనలోకి మనము కుంచించుకుపోయేటప్పుడు ప్రదర్సించే భావమిది.
    ఆతృత -- సస్పెన్సు అన్న మాట. ఒకటి ఏదో జరుగుతుందని తెలుసు ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అన్న మీమాంసనూ తర్కాన్ని ఈ పదం చెపుతుంది..
    ఆర్ధ్రత -- ఇది విసేషణం.. ఒక క్రియ గా వాడలేదెప్పుడూ.. ఇది మనకున్న ఆకాంక్షకి మానసిమయిన అనుభూతిని తోడు చేయ్యడానికి ఉపయోగపడుతుంది. ఆర్ధ్రత నిండిన చూపులు, మాటలు లాగా..
    ఆత్రము -- జరుగుతుందని తెలుసు, ఏమి జరుగుతుందో తెలుసు.. దానిమీద ఉండే ఆపేక్ష వల్ల అది తొందరగా జరిగితే బాగుండు అన్న ఆదుర్దాని చెప్పే పదం ఇది.
    ఆకాంక్ష -- ఆశ లాంటిదే కానీ దానికంటే కాస్త ఎక్కువ.

    చివరగా... ఆబ.

    ఆకలేస్తుంది. (అవసరం ). అమ్మ అన్నం కలుపుతుంది. అదీ నాకు ఇష్టమయిన పదార్ధం. చూస్తుండగానే .. ఆకలి రెట్టిపు అవుతుంది.. నోట్లో నీరూరుతుంది.. తినేది నేనొక్కడినే అని తెలుసు కానీ.. అవసరం తో కలిసిన ఆత్రం ... ఆబగా మారుతుంది.. హడావిడిగా... నోట్లో పట్టినంత కుక్కుకుని తినడం.. వంటి భావం ఆబ.

    ఏంటో చాలా రాశ్సినట్టున్నాను. లేనిపోని సందేహాలను సృష్టించలేదుకదా.. ? నా పరిధిలో ఈ పదాలకు నాకు తెలిసిన అర్ధాన్ని చెప్పాను. తప్పులుంటే దిద్దగలరు.

    కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. "వదిలొచ్చిన దేశం
    గోడమీద పోస్టరులోనూ..
    అమ్మ చేతి రుచి
    అంగడి సీసాల్లోనూ.."
    చదువుతుంటే మనసంతా చేదు అనుభూతి !

    ReplyDelete
  21. ధన్యవాదాలు పరిమళం గారు. జీవితంలో చేదు కానిదేది చెప్పండి ? ఆ రుచి అనుభవించనివారెవ్వరు ? అందరం అదే బాటలో ప్రయాణించే వాళ్ళమే !!.

    ReplyDelete
  22. మీసమాధానం సుదీర్ఘమైనదైనా బాగుంది.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  23. ii kavita pankaj udaas "chitti aayi hai, bade dinoen ke baad hum bevatanoen ke yaad,vatan ki mitti aayi hai..." anna paata gurtu cheastoendi. Almost aa paata loeni bhaavaaluu ikkada mimmalni kalachi veasina bhaavaaluu okeala vunnaayi. kavita baagundi!

    ReplyDelete
  24. అశ్వినిశ్రీ గారు ధన్యవాదాలు.

    ReplyDelete