Saturday, July 11, 2009

రోదించు..


రెప్పక్రింద కాష్టమై మిగిలిన ప్రేమ..,
కనపడని విధి కాలడ్డంపెట్టిన కలయిక..,
జ్నాపకాలు శ్వాశిస్తూ ప్రస్తుతానికిచ్చే తర్పణలు..,

త్యాగాల కొమ్మకి వ్రేలాడే
నిరాశ తల అది.. కనబడటంలేదా ?!
ఓడి తెగిన కంఠం నుంచి
కారే ఆశ మడుగులు..కనబడటంలేదా ?!

బుకాఇంచకు..
ఇది ఓటమి కాదంటావా..?
నీ కళ్ళ తడి రాదంటావా... ?


గుండెలో దిగిన బాకు..
పిడి నగిషీల వర్ణన ఎంతకాలం..?
కాళ్ళక్రింద రేగిన నేలతడుపు...
గంధాల వర్ణన ఎంతకాలం..?

నిరాశకు.. గెలుపు పులిమి..
ఇప్పుడు నువ్వు మింగే నీరు...
గతం నుండి కాల నాగై నీ మెడదిగుతుంది
కంటి కొలనులో జీవనదై జీవితాంతం పారుతుంది...

ఓ ఏడుపుతో పోయే తరుణాన్ని..
ఉదారత పులిమి బ్రతుకంతా నింపకు..
నేచూసిన ఆ బ్రతుకు నీకొద్దు..

భూనభోంతరాళాలు బ్రద్దలయ్యేలా..
రోదించు..
ఉపశమించు....
జీవించు....

http://anu-parimalam.blogspot.com/2009/07/blog-post_10.html కు నా స్పందన

8 comments:

  1. గుండెలో దిగిన బాకు.. పిడి నగిషీల వర్ణన ఎంతకాలం..
    కాళ్ళక్రింద రేగిన నేలతడుపు గంధాల వర్ణన ఎంతకాలం

    మీ ప్రతిస్పందన బాగుందండి.

    ReplyDelete
  2. 'భూనభోంతరాళాలు బ్రద్దలయ్యేలే రోదించు.. ఉపశమించు..
    జీవించు'..అద్భుతంగా వ్రాసారు.

    ReplyDelete
  3. ఓ ఏడుపుతో పోయే తరుణం కాదు,
    ఓ నలిగిన మది పడే ఆరాటం ఇది.

    చేసింది త్యాగమనుకోను,
    నాకై నేను నివేదించిన నైవేద్యం.

    ఇది ఓటమి కానే కాదు,
    ఎందుకంటే తనతో నాకిది పోరాటం కాదు కనుక.

    బుకాయింపు కాదిది, తడిలేని కనులు కావివి,
    కనురెప్పలు దాటాలేని హిమశకలాలివి.

    ప్రియ నేస్తపు ఓదార్పులు,
    మది తాకినప్పుడు, కరిగి దాటుతుంది చెలియలి కట్టను

    అప్పుడు,
    భూనభోంతరాళాలు బ్రద్దలయ్యేలా రోదించి..
    చల్లని ఒడిలో ఉపశమించి..
    మళ్ళీ జీవిస్తుంది, చిగురించిన మోడు


    అంతవరకూ కూసింత ఓపిక కావాలి మరి. ఏమంటారు గురువు గారు.
    కోపగించినా బుజ్జగించినా మీకు మీరే సాటి గురువు గారూ!!!

    ReplyDelete
  4. భారారె గారు, పద్మార్పిత గారు, సృజన గారు ధన్యవాదాలండి. శృతి గారు.. చాలా బాగుంది మీ స్పందన. నిజమె..

    ప్రతి సంతోషాన్నీ నవ్వుతో/ఆనందంతో నెట్టేస్తాం.
    ఆ ఘటనను నెమరేసుకుని మళ్ళీ మళ్ళీ నవ్వుతామా .. ?
    కానీ.. నచ్చని, నొచ్చుకున్న తరుణాలు ఎప్పుడూ కళ్ళను తడుపుతాయి. రెంటినీ ఒకటిగా చూడమని నా ఉద్దేశ్యం. నైవేద్యం, ఆత్మసమర్పణ వంటివి.. వేరే ఏమీచేయలేక, నిరాశనింపుకుని సమాధాన పడొద్దని నా సందేశం. కంటి వెనక హిమశకలాలను దాచుకోవద్దని, వీలైతే బద్దలు చేసి ముందుకు నడవమని నా అభ్యర్ధన. ఓదార్పులు ప్రశంశలకు అతీతంగా ఉండమని ఓ సూచన. బ్రతుకుమను మోడవనీయకని నేనిచ్చిన పిలుపది. అప్పుడు ఆ సమయానికోసం మనం వేచి ఉండక్కరలేదు. అది మనని విడచిపోదు అన్న అభిప్రాయమది... మీ స్పందన చాలా చాలా బాగుంది. అభినందనలు. మళ్ళి కలుద్దాం.

    ReplyDelete
  5. ధన్యవాదాలు గురువుగారూ !మీ ప్రతిస్పందనతో నా కవిత ధన్యం !

    ReplyDelete
  6. mee kavita pada prayogam adbhutamgaa vumdi. ikkada telugulo lekhinilO raasi copy kaaledu.

    ReplyDelete
  7. పరిమళం గారు ధన్యవాదాలు.
    వర్మ గారు. మీరు నిప్పునక్క (firefox) వాడుతున్నట్టయితే.. indic input extension 1.1 అన్న ఎక్స్ టెన్షన్ ను దిగుమతి చేసుకోండి. కట్ పేస్టు చెయ్యక్కరలేదు. తెలుగులోనే టైపచ్చు..

    ReplyDelete