Wednesday, April 15, 2009

అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?


అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?

అర్ధరాత్రి ఆట ముగిసి, ఆగనన్న చిచ్చి తోనో,
ఆటపైన ధ్యాస తోనో, అమ్మ లేని బెంగ తోనో,
ఆకలన్న బొజ్జ తోనో, బూచిగాడి భయం తోనో,
తునిగి పోయె చిన్ననాడు అమ్మ పక్క అర్ధ నిద్ర.

అర్ధరాత్రి చదువు ముగిసి, పాల బండి జోరు తోనో,
నీళ్ళపంపు గురక తోనో, పరీక్షలన్న భయం తోనో,
అమ్మ పూజ గంట తోనో, పేపొరోడి కేక తోనో,
తేలిపోయె నిజం జెప్ప, బ్రహ్మచారి అర్ధ నిద్ర

అర్ధరాత్రి తగువు ముగిసి, అలారం మోతతోనో
చంటి వాడి కేక తోనో, దగ్గుతున్న అత్త తోనో,
కసురుతున్న ఆలి తోనో, ఆఫీసు ఫోను తోనో,
విరిగి పోవు సరిగ చూడ, సంసారి మగత నిద్ర

అర్ధరాత్రి దగ్గి అలిసి, చల్లగాలి తుమ్ము తోనో,
గాలికెగురు దుమ్ము తోనో, దోమ గొంతు మోత తోనో,
పండగన్న నెపం తోనో, కొడుకుగారి పిలుపు తోనో,
భగ్నమగును తేరి చూడ, ఆరుబయట ముసలి నిద్ర

అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?
పూర్తి నిద్ర అసలు రాదా ?
నిద్రతోనె సగం బ్రతుకు వ్యర్ధమవడం నిజమేనా ?
ఈప్రశ్నలకు విసుక్కుంటూ ..
సమాధాన శోధనలో సగం రాత్రి చేయిజారిపోగా..

పూర్తి నిద్ర ప్రతిమనిషిని .. చేరేది ఒక్కసారేనని.
అదివచ్చిన తరవాత ఏ మెలుకువా తిరిగి రాదని.. అర్ధమయి,
వచ్చిన సగం నిద్రా ఎంతో హాయినిచ్చింది..సేద తీర్చింది
మరో మెలుకువ తేలికగా ఆహ్వానించింది..



3 comments:

  1. ఆ నిద్ర కొరకే ఈ కలత నిద్రలు
    ఆ పరంధాముని చేరేవరకే ఈ పలవరింతలు
    ఆ రాత్రి ఆగమన్నా ఆగదు ఈ నిదుర సంపూర్తికాక
    ఆ తరుణం వరకు మనసాపు మిత్రమా సంధిగ్దపడకు...

    ReplyDelete
  2. అర్ధ నిద్రకు అంతమెప్పుడు ?
    పూర్తి నిద్ర అసలు రాదా ?

    ఇంకా చాలాటైముందనుకోవటంలోనే ఉంది అసలు మజా!
    కదూ బాస్?

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. తప్పకుండా ఉష గారు. ఆపుకున్నాను.అమ్మో అప్పుడే టపా కట్టడమే :-). ధన్యవాదాలు

    నిజమే బాబా గారు !! చాపకింద నీళ్ళలా ఎప్పుడొస్తుందో తెలియదు, వచ్చాక అసలేమీ తెలియదు. ఓరకంగా అదే బెటరేమో ! ఏమంటారు ? ధన్యవాదాలు బాబా గారు.

    ReplyDelete