Wednesday, March 25, 2009

నెనరులు.


కనుల కొలను కొలుకుల్లో పూసిన
ముత్యాల కలువలు, చెక్కిళ్ళు కూర్చిన
ధారల దారాల్లో ఇమడక, జారి, పెదవి
ద్వారాల్లో కరిగి మాయమవుతున్నాయి

విధి విసిరిన వేగానికి రెక్కలిరిగిన
మనసును, బంధాల లతల చేతులు
అడ్డుకోలేక, అధారమవలేక, అలసి
చేజార్చి తామిరిగి పూలవానలయ్యాయి

నారుపోసినోడు నీరు పోయడూ ...
నిజమే అదే కన్నీరు !! నెనరులు.

6 comments:

  1. "నారుపోసినోడు నీరు పోయడూ ...
    నిజమే అదే కన్నీరు !! నెనరులు"
    పాత సామెతకు కొత్తర్ధం చెప్పారు .అదీ ఇంతందంగా .....

    ReplyDelete
  2. మీరు తప్ప ఇంకెవరూ ఈ పోస్టు చూసినట్లు లేదు. పండగ హడావిడిలో ఉన్నారందరూ.. ధన్యవాదాలండి.

    ReplyDelete
  3. ఆత్రేయగారికి, నమస్కారములు.

    "నెనరులు" : భావుకత గొప్పగా వున్నది. అయితే, నాదొక సందేహం. తీర్చండి. "నెనరుల్" అంటే ప్రేమ అని, కృతజ్ఞతలు అని అర్ధాలు వున్నాయి. నెనరులు--కృతజ్ఞతా భావంతో తీసుకుంటే, మీరు ఏ సందర్భంలో, ఎవరికి చెపుతున్నారు? మనసును, లతలు, తమ చేతులతో అడ్డుకోలేక, చేజార్చి, పూలవానలయ్యాయి అన్నారు. పూలవానలు అంటే, సంతోషానికి సంకేతం కదా? మనసును చేజార్చినప్పుడు, లతలు జాలి పడాలి కదా? "రెక్కలిరిగిన మనసుకు" మిగిలిన కవితా భాగానికి గల సంబంధాన్ని విడమర్చి చెప్పగలరా? నాకు అంతగా మీ భావం అర్ధం కాలేదు.

    ReplyDelete
  4. మాధవరావు గారు.. నా బ్లాగుకు స్వాగతం. సమయం వెచ్చించి ఇక్కడ మీ సందేహాన్ని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.

    మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం నా బాధ్యత. ఇక నా వివరణ. మీరన్నది నిజమే ' నెనరులు ' అంటే కృతజ్ఞతా, ప్రేమ అనే భావమే.. అవి నారుపోసిన వాడిని ఉద్దేసించినవి.

    ఈ కవితలో నాయకుడు అనుభవిస్తున్న ఉద్వేగాన్ని, నిస్సత్తువని, నిరుత్సాహాన్ని, నిర్వేదాన్ని, వైరాగ్యాన్ని, బ్రతుకుపైని విరక్తిని అధిగమించి, భగవంతుడి పైన తనకున్న భక్తిని, అభిమానాన్ని వెటకారంగా వ్యక్త పరుస్తున్నాడు.

    తన కన్నీటితో ఆయన పాదాలను కడుగు తున్నాడు. అందుకే... కన్నీళ్ళను, కొలనులోని కలువల తోనూ.. ముత్యాల తోనూ పోల్చి, అవి అతని చెక్కిళ్ళపై ఇమడక (ఇమడ్చడం, కూర్చడం వంటి క్రియలు, కర్తగా తన చేతిలోని పనులు కనుక, అతని నిర్లిప్తత చేతనలుడిగేటట్టు చేసింది కనుక ), పెదవి ద్వారాల నుండి, అతని అంతరాత్మ లోకి మమైకం అవుతున్నాయి అని చెప్పాను.

    అతని రెక్కలు విరిగిన మనసు అంటే, మనో వైకల్యము కల్మషము (వీటిని రెక్కలన్నాను - అవేగా మనసుని పెడదారులు పట్టించేవి, ఆకాశంలోకి ఎగిరించేవి - అందుకని) తెగిన అతని మనసు లేక అతని మానసిక పరిస్థితికి, " బంధాల లతలు. చేతులు అడ్డుకోలేక, ఆధారమవలేక, అలచి, తామిరిగి పూలవానలయ్యాయి " అంటే. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.. అన్న భావన కలిగి, అతనికి వేరే దిక్కు తోచక వచ్చిన భావాలు. పూల వానలయ్యాయి.. అతనిప్పుడు సంపూర్ణ శరణాగతి బాటలోకి నడుస్తున్నాడు.

    అందుకోసమే అతని ఈ నెనరులు.. అదేసమయంలో తనకున్న బాధని, తానధిగమించిన బాటను భగవంతుడికి చెప్పాలిగా.. ఆయనకు తెలియదని కాదు, మానవ నైజం, అందుకే ఆ దెప్పిపొడుపు. (అతనిప్పుడే అధ్యాత్మిక పధం వైపు సాగుతున్నాడు, అందుకని, తన 'నా' అన్న అహం ఇంకా అణగలేదు ) నారు పోసిన వాడు కన్నీరు పోశాడని.

    అర్ధం అయ్యింది అనుకుంటాను. మీకు మరో సారి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. Sri Atreyagaaru, thank you very much for the narration given by you.
    P.Madhava Rao.

    ReplyDelete