Sunday, March 22, 2009

మర్మం




మృత్యువు అందరూ చేరే గమ్యం ..
దాని దూరమే తెలియని మర్మం !!

బ్రతుకు బండిలో అందరి పయనం..
దాని వేగమే తెలియని మర్మం !!

బాధ్యత బరువే అందరి వీపున..
దాని భారమే తెలియని మర్మం !!

బాధల ఊబులే అందరి బ్రతుకున..
వాటి లోతులే తెలియని మర్మం !!

ఆశల వైపునే అందరి చూపులు ..
వాటి ఎత్తులే తెలియని మర్మం. !!

సుఖాల ఒడిలో అందరి నవ్వులు ..
వాటి అంతమే తెలియని మర్మం !!

దేవుడు ఉన్నాడందరి మదిలో ..
స్పర్శకు తెలియడు అదిఒక మర్మం !!

మర్మాలెనకనే వెదుకుతు పోతే ..
దాని మార్గమూ తెలియని మర్మమే !!

తెలిసిన సత్యం నిజమని ఎరిగి
తెలియని దానిని వెనకొదిలేశై .. !!
నిన్నటి రోజును గతమని మరచి
రేపటి రోజును విధికొదిలేశై ..!!

బ్రతికిన నేటిని శుచిగా గడిపితే
రాత్రికి పట్టిన ప్రశాంత నిద్రలో
కమ్మని కలలా ముడులను విప్పగ
ఉదయిస్తుందో మరో
ప్రపంచం !!

12 comments:

  1. ఆ మర్మమేదో తెలియకనే మనముందు తరం, వారి ముందు మరెన్నో, మనం, మన వెనుక తరం మనుగడ సాగిస్తాం. మానవత్వ ఉనికికి ఊపిరి పోస్తాం. శాంతం, సహనం కలబోసి, సత్యం, శోధన పెనవేసి జీవిత దారపుపోగులు ఒకరొకరివీ మెలివేసి పడుగు పేకల అనుభవం అనే వస్త్రాన్ని అల్లుతాం. మన మరణశయ్యపై అదే పక్కగా పరుచుకొని విరమిస్తాం. ఏమిటో చాలా బరువైన భావనలోకి తోసేసారు, ఆత్రేయ గారు. బహుశా ఇదే పొడిగించి మరవం మరో కొమ్మగా ఎదుగుతుందేమో?

    ReplyDelete
  2. మీ ప్రయత్నం బావుంది. చివరి రెండు స్టాంజాల్లో కవిత్వం పండింది. మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే మీలోంచి మంచి కవి బయటికి దూకగలడు. శుభాకాంక్షలతో..
    ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)

    ReplyDelete
  3. నాకవసరమైన కొన్ని పదాలు... ఈ కవితలో రాసారు.. చాల.. ధన్యవాదాలు.. ;)

    ReplyDelete
  4. ఉష గారు ధన్యవాదాలు బాగా వ్యాఖ్యానించారు. మర్మం మరువంలో కూడా ఉంటుందంటే అంతకంటేనా.. వేయి కళ్ళతో ఎదురు చూస్తాను.

    హనీ గారు.. నా ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు. నాఇతర రాతలను కూడా చూసి వ్యాఖ్యానించగలరు.

    శివ గారు మీకు కావలిసిన పదాలు దొరికినందుకు సంతోషంగా ఉంది. మీకేమన్నా కావాలంటే చెప్పండి నేను చేయగలిగింది చేస్తాను (నాకేదో పెద్ద తెలుసు అని కాదండి. ఏదో తోచిన సహాయంచేద్దామని )

    ReplyDelete
  5. తెలిసిన సత్యం నిజమని ఎరిగి
    తెలియని దానిని వెనకొదిలేశై .. !!

    అంటే ఇక్కడ మీ భావం..?

    చివరి లైన్లలో మీరు చెప్పిన దాన్ని బట్టి..
    " ఏదో తెలుసుకోవాలని ఆత్ర పడక, నేడు నీ ముందున్న బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ వెళ్లడమే నేవు తెలుసుకోవలసిన్ మర్మం".
    అనేనా..? అదే అనుకుంటున్నాను.

    మీ కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  6. విజయ్ గారు భావాన్ని సరిగానే పట్టుకున్నారు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  7. మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?
    http://maruvam.blogspot.com/2009/03/blog-post_24.html

    ఓసారి చదివి ఎలావుందో చెప్పండి మరి, ఆత్రేయ గారు.

    ReplyDelete
  8. ఉష గారు మీకవిత చాలా బాగుంది. కామెంటు అక్కడ కూడ పెడతాను.

    ReplyDelete
  9. ఆత్రేయ గారు,
    మర్మమెల్ల తెలుసుకొంటి మీ కవితలో
    సత్యమెరిగి మసలు కొనుట మావిధి...
    బావుందండీ .....

    ReplyDelete
  10. పరిమళం గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  11. ఆత్రేయగారికి, నమస్కారములు.

    "మర్మం" : చాలా,చాలా బాగుంది. మర్మరహస్యం కోసం, మర్మయోగి చేసే తపనలాగుందీ మర్మం.

    ReplyDelete
  12. మాధవ రావు గారు ధన్యవాదాలు.

    ReplyDelete