Tuesday, August 24, 2010

మబ్బు



ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..

ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం

ఈ లోపే మరో అంకం..

పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం

ఈ మబ్బు విడవాలి

Tuesday, August 17, 2010

మరోప్రశ్న


తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య

నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకునే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..

వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపిస్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది.

ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.

అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ..

Monday, August 9, 2010

మైనపు రెక్కలు


గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,
పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..


సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..


వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..


ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..


ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.




ఈ చిత్రం www.thecreativecreative.com నుండి తీసుకొనబడినది.

http://poddu.net/?p=4942 లోకుఉడా కూడగలరు.

loosely based on http://musingsbytrinath.blogspot.com/2010/02/frivolity.html