Thursday, April 9, 2009

ఆవిష్కరణ


పట్టె మంచము మీద తూర్పుగా తలపెట్టి
కాలి మట్టెల వరకు తనువంత దాచేస్తు
కటిక చీకటి గప్పి కునుకు తీసే పడతి ...

సవ్వడే లేకుండ సరసాలు ఆడంగ
చల్లగా దరికి జేరి విరహమందిన ప్రియుడు
మెల్లగా ఆఝాము తెర లాగుతున్నాడు ...

చిమ్మ చీకటి అడవి..మధ్య నడిచెడి దారి..
బాట చివరన ఎరుపు గగన తలము ..

ఆ క్రింద మెరిసేటి కొండ చరియల నడుమ
నిండుగా ముద్దొచ్చే భాను మందారం..

తమ సఖుడి రాకతో, ఆనంద ముప్పొంగి
వికసించి నవ్వేటి రెండు పద్మాలు..

పద్మాల పూ తావి చాలదనుకుందేమో
తనవంతు గంధాలు విరజల్లు సంపెంగ ..

పగడాల తమ కాంతి దశదిశలకూ జిమ్మి
పగటి వెలుగులు మింగి ముత్యాలు గా మార్చి
పలకరింపుగ చూచె ఆలుచిప్పల నవ్వు.

ఆనంద దుందుభులు ప్రాగ్దిశలో మ్రోగంగ
ఆ తాళానికనువుగా తపన తీరేలాగ
తనవంతు గాన్నాన్ని తోడు కలిపిన శంఖు..

ఇంత సుందర తరుణమూరికే జారేనా ?
కొంత తడవైనా దాన్ని కట్టేయవద్దూ.. ?
ఆమంగళావకాశాన్ని ముడులేసి బంధించి
గుండెలోతుల్లో దాచేటి బంగారు కలశాలు..

సురగంగ ఉప్పొంగి శివుని శిరమున చేరి
సుడులెన్నొ తిరిగేసి విసిగినట్టుంది ...
భువి పైకి జారంగ బలమైన తలమేదొ
తెగవెదికి ఆ స్థలము ఎంచినట్టుంది..
తనధారనోపంగ హరుని జడలోతునుబోలు
కూపాన్ని ఆ మధ్య తవ్వి నట్టుంది..

ఈజగతి మెచ్చంగ సురపతే నొచ్చంగ
వాడి ఏనుగు వాడి దంతాలు మాయమై
వడివడిగ పరుగెత్తి ఇటుదాగెనెందుకో ?

ఎర్ర కలువల మీద అందాల ఈ రాశి
ఎన్ని తావుల జనెనో ఎంతగా అలసెనో ...

తనువు మరిచి..
విభుని కొరకై తపియించు ఋషి లాగ ..
తపనలెరుగక..
అమ్మ ఒడిలోన శయనించు పాప లాగ..
నిద్ర ఒడిలో తాను ఒదిగి ఉంటే..

ఆశగా అటుచేరి ఆమె విభుడు నేడు
అందాన్ని ఆసాంతం ఆవిష్కరించాడు..
మమతతో ఆవిడ్ని ఓలలాడించాడు..
కవితలో తనువంత పూలు కురిపించాడు..

7 comments:

  1. యాండోయ్

    ఓ రకంగా బాందండీ. ఇంకో రకంగా బాలేదండే. అయినా మీలాటోల్లు కూడా ఇల్లా డబల్ మీనింగు కైతలేత్తే ఎట్టా మారాజా ?

    ReplyDelete
  2. దిన్నెల వారూ, ధన్యవాదాలు. సౌందర్యము శృంగారాలకి, అశ్లీలతకీ చాలా చేడాఉందండి. పవిత్రమయిన శుద్ధమయిన ఆలోచనలనే నేను వ్యక్తం చేశాను. నేనెక్కడా గీతదాటలేదని నా భావన. సోదరీమణులేమంటారో చూడాలి.

    ReplyDelete
  3. శ్రీదేవి చిగురుటధరములు, జగడపు చనముల జాజర అ౦టూ వర్ణిస్తే
    అది అన్నమయ్య ఏమొకో అనే శృ౦గారస౦కీర్తనమయ్యి౦ది.
    ఈ రోజు మీ ఊహలోని ప్రేమికుల ప్రేమరసామృతమును వర్ణిస్తే
    అది మీరు రాసుకున్న ఆవిష్కరణ అనే ప్రణయకావ్యమయ్యి౦ది.

    మ౦దారమ౦టి మోమునీ, పాపిడిగల కురులనీ, పద్మాలవ౦టి కనులనీ, స౦పె౦గ వ౦టి ముక్కునీ, నవ్వు ఆలుచిప్పల్లోని ముత్యమనీ, శ౦ఖమ౦టి క౦ఠమనీ, మొత్తానికి పూవ్వ౦టి తనువనీ మహాద్భుత వర్ణన కేవల౦ ప్రియుడి కన్నులను ఉలిగా మార్చి చేసిన ప్రియురాలి మనోహర శిల్పమీ కవిత. ఆత్రేయ గారూ, మీ కవన చతురతకూ, మీరు వినిపి౦చిన ప్రణయయుధ్ధ శ౦ఖారావమునకూ పాదాభివ౦దనము. ఇప్పటివరకూ మీరు రాసిన వాటిలో నాకు నచ్చిన రసమూ, భావనమూ ఈ ఆవిష్కరణ. ఈ కవితకీ మీరిచ్చిన పేరు మరో మాటక౦దని బ౦గారు కల్పన. దీనిని మ౦గళావకాశమని పల్కిన మీలోని కవికి నమస్సుమాలతొ ని౦పన. నాకె౦త నచ్చి౦దో నా వ్యాఖ్య మనసార నిజము పలికేనా?

    ReplyDelete
  4. ఓ స్త్రీ సౌందర్య ఆవిష్కరణ కాదు ఇది, విచలిత మనోహృదయంతో వికసించిన కవి కళావిష్కరణ, ఓ పవిత్ర ప్రేమికుడి ఆలోచనాశృంఖలం..
    ఏదిరాసినా మీ వర్ణన ఆమోఘం. విచిత్రం. అద్భుతం.

    ReplyDelete
  5. "కవి వాక్యేన రమ్యమ్ కావ్యమ్"

    పృధ్వి గారితోనూ ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  6. కవులూ , కళాకారులూ ...స్పందన చూశాక మాటలు కరువయ్యాయి . మీ కవిత ఎంత అధ్బుతం గా ఉందో వారి వివరణా అంటే అందం గా ఉంది .

    ReplyDelete
  7. aanand gaaru varma gaaru, parimaLam gaaru mii abhimaanaaniki sadaa kRtjnuDanu. mii abhinandanalu nEnu ekkaDaa giita daaTalEdanna naa nammakaanni balaparicaayi. marOsaari dhanyavaadaalu.

    ReplyDelete