Friday, April 17, 2009

పునరావృతం




ఎక్కడినించో...

అందాల్ని ఆనందాల్ని పోగుచేసుకొస్తుంది
కాలాన్ని తనతో తీసుకెళ్ళిపోతుంది..
గతితప్పుతాను

ఎన్నో ఊసులు రాగాలు నవ్వులు తెస్తుంది
భాష తనలో ఇముడ్చుకుంటుంది
మూగవోతాను

హొయలు, విరులు ఆశ్వాసనలు గుట్టలుపోస్తుంది
చేతన తనతో వెళ్ళిపోతుంది..
నిశ్చేష్టుడనవుతాను

కరకు ములుకులు మృదువుగాచేసి తెస్తుంది
మనసును తనతో తీసుకెళుతుంది
చిత్తరువవుతాను..

తను సాగుతూనే ఉంటుంది..
నన్ను చూస్తూనే ఉంటుంది..
అందాలు చిమ్ముతూనే ఉంటుంది..
కబుర్లు చెపుతూనే ఉంటుంది..
తన గమ్యాన్ని చేరుతూనే ఉంటుంది..

గతి తప్పి, మూగబోయి, నిశ్చేష్టుడనై
చిత్తరువులా.. నేనుండిపోతాను.

నేనూ... నా ఏకాంతమూ
ఒకరికి ఒకరై.. మరికొంచెంసేపు..
ఆ చిత్రంలో భాగమవుతాము
ప్రకృతి కన్ను మూస్తుంది..
చీకటి ఆవరిస్తుంది...

ఆ సెలయేటి గట్టున
కవిత పునరావృతమవుతుంది...

7 comments:

  1. ఆ సెలయేటి గట్టున
    కవిత పునరావృతమవుతుంది..
    ఆ కవిత చదివిన నా మనసు ఉవ్విళ్ళూరుతుంది!!

    ReplyDelete
  2. చాలా బావుంది ఆత్రేయ గారు.. మీ శైలిలో మార్పు (in a good way) కనిపిస్తోంది... keep it going..

    ReplyDelete
  3. పద్మార్పిత గారు. ధన్యవాదాలు.

    నిషిగంధ గారు. నిజమే ఏమిటో అప్రయత్నంగానే వచ్చింది ఈ మార్పు. ఇలానే కొనసాగుతుందేమో చూడాలి. ధన్యవాదాలు

    ReplyDelete
  4. Very nice poem Atreya garu! Simple and sensible.

    ReplyDelete
  5. బాబా గారు, ఆనంద్ గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. ఆ సెలయేటి గట్టున
    ముళ్ళకు కూడా
    కవితా పుష్పాలు
    పూయించగలరు
    మీరు ....మీరే ....

    ReplyDelete
  7. పరిమళం గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు మీరు కాదేంటి? మీరు మరీనూ... :-)

    ReplyDelete