Tuesday, March 17, 2009

వాన


నిండు చూలాళ్ళల నల్ల మబ్బులు 
మెల్లగా.. మండుటెండలో ..
చల్ల గాలి చేయినందుకుని.. 
సిగ్గు మెరుపుల సాన్నిధ్యంలో,
మూల్గు ఉరుముల నేపధ్యంలో..
మగ్గిన పండు సూరీడ్ని చంకనెత్తుకుని 
నింగి నిండా అల్లుకుంటూ..
మా ఊరొచ్చాయి.

పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడై
చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు.

చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
తలలనూపుతూ పూల రెమ్మలూ
గంధాలొలికే మెల్ల గాలులూ
కిలకిలలాడుతు పక్షి గుంపులు..
తాకాలంటూ తహతహలాడే నేల కణాలూ..
అలలను రేపిన పంట పొలాలు..
పిలవక వచ్చిన తూనీగ బంధువులు..

మబ్బుల ప్రసవం కోసం 
ప్రకృతి రంగం సిద్ధం చేసింది.

ఆహ్వానించే పిల్లల నోళ్ళు..
ఆహ్లాదంగా ఎగిరే తువ్వాయి
వింజామరలతొ నెమళ్ళ నాట్యం..
శుభాన్ని పలుకుతు గిత్తల గంటలు..
చల్లగ జారే  బిడ్డల కోసం
మా ఊరూ రంగం సిద్దం చేసింది.

అందరు సిద్ధం అవడం చూసి..
నింగిన రంగుల జెండా ఎగిరే సరికి..

తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మబ్బుల లాస్యం
ఫెళ ఫెళ లాడుతు ఉరుముల జోస్యం
తకధిమి తకధిమి ప్రకృతి నాట్యం..

5 comments:

  1. Amazing! I felt all the feelings just through your words. I was drenched in the rain.
    చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
    తలలనూపుతూ పూల రెమ్మలూ
    గంధాలొలికే మెల్ల గాలులూ
    కిలకిలలాడుతు పక్షి గుంపులు
    I really felt everything only through your words. Rain is always my love, and now your poem on it!

    ReplyDelete
  2. జనించిన చినుకుల
    ఆనందంలో తేలే
    చిన్నారుల కాగితంపడవలూ
    తడిసి తెచ్చుకున్న
    జలుబు తుమ్ములూ
    అమ్మ ఇచ్చిన
    మిరియాల పాలూ
    గుర్తు చేసిన
    మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఆత్రేయగారూ ! ఎంత వయసొచ్చినా వెన్నెలనూ ,వర్షాన్నీ చూస్తే మైమరచిపోతాను .ఇప్పటికీ కాగితపు పడవలు చేసి వదులుతాను .వర్షమంతా ఆగిపోయాక ....చెట్లకింద నడుస్తూ కొమ్మలు కదుపుతూ ఆ చినుకుల్ని ఆస్వాదించడం మరో మధురానుభవం .వేసవిలో వర్షపు జల్లు కురిపించారు ....ధన్యవాదాలు .

    ReplyDelete
  4. చాలా మధురమైన భావం.లయబధంగా వ్రాశారు.శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. ఆనంద్ గారు.. తలతుడుచుకున్నారా.. జలుబుచేయ గలదు... తడిసినందుకు ధన్యవాదాలు. కోల్డరిన్ దగ్గర పెట్టుకోండి. :-)

    శృతి గారు.. మిరియాల పాలు... ఆనంద్ గారికి మరో చిట్కా అన్న మాట. ధన్యవాదాలు. మాకన్నీ డబ్బా మందులు.. ఇండీషన్లే . చిన్నప్పుడు. బడి ఎగకొట్టడానికి కడుపునొప్పి అనడానికి కూడా భయపడి చచ్చేవాళ్ళం.. దెబ్బకి జ్వరమొచ్చేది.

    పరిమళం గారూ.. బాగా చెప్పారు.. వయసుకీ వానకీ మధ్య అదేదో బంధం. వానలో తడిసిన వయసు.. చాలా భాగం కరిగిపోతుందనుకుంటా.. నాకూ అంతే.


    జయచంద్ర గారూ అందరూ భావాన్నే చూశారు.. మీరు లయ పట్టేశారే ! పడే చినుకుల్లో లయలేదూ.. అదే నా పదాల్లోకీ జాలువారింది.


    ఈ సాయంత్రం .. జయచంద్రుడ్ని చూసిన వాన పరిమళం.. ప్రకృతితో శృతి కలిపి ఆనందాతిశయాలు కురిపించింది.. :-)

    ReplyDelete