Monday, December 29, 2008

అడవితల్లి ఒడిలో

చింత చెట్టు ఊడలల్లో
పసిబిడ్డడి ఊయల - వ్యత్యాసాల ఊపుకి ఊగుతుంది
ఆకలి పుడకల కొంపలో
వేదన చితుకుల పొయ్యి - ఆకలి మంట మండుతుంది
వ్యతిరేకత మూకుడులో
బ్రతుకు అంబలి కాగుతుంది - ఎవరి ఆకలో తీరనుంది

గుప్పెట్లో దాచిన గుక్కెడు దాహంలా
కడుపు నిండని నిన్న, ఈరోజు మళ్ళీ
వాడి గుడిసెలోకి జారుతుంది - యముని పాశంలా

ఊదుగొట్టం లోకెళ్ళిన ఊపిరి
పొగలా గూడెం నిండుతుంది
వేగులా ఉనికిని తూటాలకిస్తుంది - ఎన్కౌంటరు పావురం ఎగురుతుంది

వాడి రేపు ఎర్రక్షరాల్లో పేపరెక్కుతుంది,
రంగు పీలికలై కాకీ చొక్కాకి అంటుతుంది
ఖద్దరు చొక్కా చేతులు కడుక్కుంది - ఎండిన డొక్క బావురంటుంది

పేదరికపు గీత పైకెగిరి జాతి పురోగతి చాటుతుంది
ఈ గాయం మానకముందే

అడవిలో చింత చెట్టుకింద
మరో ఊయల వేళాడుతుంది
మరో గాడిపొయ్యి మొదలవుతుంది
వాడి గద్గద స్వరం రేగుతుంది
అడవితల్లి ఒడిలో వేగు పొగ ఎగురుతుంది
గద్దరు స్వరం సాగుతుంది
తూటాల తప్పెటా సాగుతుంది

5 comments:

  1. ఇందులో ఏదో ఇది కాని అది కాని ఇది ఉంది కానీ....

    చిరునవ్వులు చెక్కుకున్న మొహాలు అర్ధనిమీలంగా ఆవిర్భవిస్తున్నాయా అని ప్రశ్నిస్తే ముసుగులు తీసి మూలతత్త్వం చూడమన్నాడట ఒకాయన...:)...ఇంతకీ ఎవరాయన?

    ReplyDelete
  2. వంశీ గారు మీ అభిప్రాయాలు నాకు ఎప్పుడూ ఓ పజిలే. ఎంత బుర్ర గోక్కున్నా దీని అర్ధం నాకు తెలియలేదు. ఇంతకీ పొగిడారా తిట్టారా ఏమన్నా అడిగారా ? :-)

    ReplyDelete
  3. హహ్హా... ఆయనను నేనెరుగుదును :)

    ReplyDelete
  4. అయ్యా యోగి గారు, జుట్టు పీక్కుని నా తల బట్టతల కాకముందే కాస్త నా తల మీద మీ(కని)కర ముంచి. అదెవరో చెప్పుదురూ. మీకు పుణ్యముంటుంది నాకు క్రాఫు మిగులుతుంది. :-)

    ReplyDelete
  5. ఆత్రేయగారు
    వంశీ గారు మంచి బ్లాగరి. మంచి సాహిత్యాభిమాని. చక్కటి టపాలను వ్రాసి ప్రస్తుతం తన బ్లాగుకు శలవలు ప్రకటించారు.

    వారో లేక వారి వారో మాగంటి ఆర్గ్. అని ఒక వెబ్ సైట్ నడుపుతూ, అనేక సాహిత్యపరమైన, సంగీతపరమైన విషయాలను అందిస్తున్నారు.
    లైవ్ రేడియో కూడా ఉన్నట్లుంది. ఒక సారి పాత పాటలు నేను విన్నాను.

    ఇక పోతే కామెంట్లు కు సంబందించి

    వారు అజ్ఞాతంగా ఉంటూ జనాలకు ఇలా పరీక్షలు పెడుతున్నారనిపిస్తుంది. బహుసా తమాషాకు ఇలా చేస్తున్నారనిపిస్తుంది.

    అందుకే ఇదివరలో ఓ రెండు సార్లు అడిగాను కూడా సమాధానమివ్వలేదు వారు.

    ఈ చిక్కు ముడులు వారే విప్పాలి.
    చూద్దాం ఎప్పటికి విప్పుతారో. :-)

    ReplyDelete