Showing posts with label తత్వం. Show all posts
Showing posts with label తత్వం. Show all posts

Wednesday, April 8, 2009

రాత్రి భయం


నిన్న పడమటి వేటగాడు చల్లిన
విశ్రాంతి గింజల కోసం వాలిన రాత్రి
జ్ఞాపకాల వలలో చిక్కి, బెదిరిన కళ్ళతో
చీకట్లో వణుకుతూ విలవిలలాడుతుంది.

తూర్పు కొండమీద అతనొస్తున్న అలికిడి
వెలుతురై ఆకాశాన్ని ఓ పక్క ఆవరిస్తుంటే...
పెల్లుబికిని బ్రతుకు భయం, తన కళ్ళనుండి
సింధూరమై తూర్పు నింగిని అలుముకుంటుంది

దాని నిట్టూర్పుల వేడి శ్వాసలు తగిలి
ఇళ్ళముందు కళ్ళాపులు ఆరుతున్నాయి
ఆతృత అధికమయి నుదుటి బిందువులు
దాని ఆశలా జారి పచ్చగడ్డి మీద జేరుకున్నయి

అంతవరకు తనకి ఊరట కల్గిస్తూ, స్నేహంగా ఊగి
ఊసులాడిన కలువా.. మూతి ముడిచింది.
తలవంచి దీనంగ శోకాన్ని గుప్పించి, పొద్దు
తిరిగేసరికి ముఖము తిప్పె మరికొన్ని పూలు.

వేటగాడటుగా రాకుండ పోడు ..
చీకటి రాత్రినతను మింగకా పోడు..ఇది
కుమ్మరి చక్రంలా..సాగుతూనే ఉంటుంది.
పునరావృతమవుతూనేఉంటుంది ....

Tuesday, April 7, 2009

ఆ వానకు అర్ధం ఉంది.




నా "వాన " కవితకు చాలా మంది స్పందించారు.. ధన్యవాదాలు.
ఆ కవితలోని మాటలు, ప్రకృతి అందాన్ని నా భావుకత జోడించి
రాసినట్లుగా మీరందరూ దాన్ని ఆస్వాదించారు.. అభినందించారు
ధన్యవాదాలు. కానీ...

మీరు గమనించారో లేదో.. ఆ కవిత లేబుళ్ళలో ఒకటి, తత్వం.
ఆ కోణంలోనుంచి ఈ కవితను ఎవరూ ఆస్వాదించలేదని నా అభిప్రాయం
ఎందుకంటే వచ్చిన వ్యాక్యలలో అది లేదు కాబట్టి. అదికూడా తెలిస్తే (కవితలోని
మాధుర్యం.. ఇంకా ఆనందింపజేస్తుందనిపించి)
ఈ వివరణ ఇస్తున్నాను...

ప్రధానంగా.. ఈ కవిత.. చాలా పోలికలతో నిండి ఉంది.. ఇదే కవితలోని కొన్ని
పదాలను మార్చి రాస్తున్నాను.. చూడండి... అవే పదాలు ఎందుకు వాడాను ?
వాటి తత్వం ఏమిటి ? వాటి నైజమేమిటి ? అన్న వి మీకే వదిలేస్తున్నాను.

అవధరించండి..


నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

కన్నీటి దారలతో,
వేదన గాలి పటాలు ఎగరేస్తూ ....... (అవి గాలి పటాలెందుకయ్యాయి ?)
బాధ చెక్కిళ్ళపై పరవళ్ళుతొక్కుతుండగా
వేడి నిశ్చ్వాసలు జగమంతా నింపుతుంది.. మనసు

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

నా ఒడిలో పడి (ఒడి అంటే ?)
మత్తుగా.. తావి లేని కన్నీరు (మరి రంగు రుచులున్నాయా ?)
పువ్వుల్లా చిందు తున్నాయి, బరువు కిరీటాలు దించుతున్నాయి (పువ్వుల్లా ఎందుకు ? కిరీటాలేమిటి ? )
ఒడిలో చేరి ఇంకి పోతున్నాయి.. మెల్లగ.. కన్నీళ్ళు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

జారే కన్నీటి ధారల్లో
దోబూచులాడుతూ.. బాహ్యరూపం లేదుగనక
నీటి ఆసరాతో వ్యక్త మవుతున్నాయి.. (మరి చిన్న పిల్లల్లా ఎందుకన్నాను ?)
తామెక్కడున్నాయో చాటుతున్నాయి.. మనో భావాలు.


ఇప్పటికే మీతలలు వేడెక్కి ఉంటాయి. ఇక విరమిస్తాను..

Monday, April 6, 2009

వాన



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

Thursday, April 2, 2009

నువ్వంటే నాకు అసహ్యం !!


నువ్వు వెచ్చగా నా చెక్కిళ్ళు
నిమిరి నప్పుడు, పెదవుల మీద
తడి ముద్దులు గుప్పించి నపుడు..ఆప్యాయంగా
అక్కున చేర్చిన నెచ్చెలిని గుర్తు చేశావు !
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నా బాధల్లో పిలవకుండానే
ప్రత్యక్షమయి, గొంతు లోతుల్లో రాగాలు
రేపి, ఉపశమనమిచ్చి మనసు తేలికచేసినప్పుడు
అమ్మ అనురాగ లాలనను గుర్తు చేశావు
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

ఆనందంలోనూ ఆక్రోశంలోనూ..
చీకట్లో నను కౌగిలితించి నీలోకలిపేసి
వెలుగులో నా తోడుంటూ.. ఏకాంతంలోనూ
నాతోనే ఉంటూ.. నా నీడను గుర్తు చేశావు ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

గుండెలు పగిలి, మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలోనూ.. నా మూగ
బాధకు భాష్యం చెపుతూ..
తపించే నాకు ప్రత్యక్షమవుతావు
ఆ పరమాత్మను గుర్తు చేస్తావు..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

సముద్రమంత విశాల హృదయం,
పసిపాపలా నిర్మలమయిన స్థితి,
పుష్పమంత సున్నితమైన స్పర్శ,
అనురాగ మూర్తివి, అందాల రాసివి ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నువ్వు నాసొంతం. నాదానివి
నన్నెరిగిన దానివి. నా మనో నాదానివి
అంతర్నినాదానివి, భావోన్మాదానివి
నాలోని పూడనగాధానివి
పుష్పించని చెట్టువి,

నా కంటి బొట్టువి !!
నువ్వంటే నాకు అసహ్యం !!
అందుకే తుడిచి తరిమేస్తా..
మింగి మరిచేస్తా..
తిరిగిరావద్దని ప్రార్ధిస్తా..

Sunday, March 22, 2009

మర్మం




మృత్యువు అందరూ చేరే గమ్యం ..
దాని దూరమే తెలియని మర్మం !!

బ్రతుకు బండిలో అందరి పయనం..
దాని వేగమే తెలియని మర్మం !!

బాధ్యత బరువే అందరి వీపున..
దాని భారమే తెలియని మర్మం !!

బాధల ఊబులే అందరి బ్రతుకున..
వాటి లోతులే తెలియని మర్మం !!

ఆశల వైపునే అందరి చూపులు ..
వాటి ఎత్తులే తెలియని మర్మం. !!

సుఖాల ఒడిలో అందరి నవ్వులు ..
వాటి అంతమే తెలియని మర్మం !!

దేవుడు ఉన్నాడందరి మదిలో ..
స్పర్శకు తెలియడు అదిఒక మర్మం !!

మర్మాలెనకనే వెదుకుతు పోతే ..
దాని మార్గమూ తెలియని మర్మమే !!

తెలిసిన సత్యం నిజమని ఎరిగి
తెలియని దానిని వెనకొదిలేశై .. !!
నిన్నటి రోజును గతమని మరచి
రేపటి రోజును విధికొదిలేశై ..!!

బ్రతికిన నేటిని శుచిగా గడిపితే
రాత్రికి పట్టిన ప్రశాంత నిద్రలో
కమ్మని కలలా ముడులను విప్పగ
ఉదయిస్తుందో మరో
ప్రపంచం !!

Friday, March 20, 2009

సగం చెక్కిన శిల్పం



మూర్తిగ మలిచే అతనిని చేరి
తనకు తానుగా తనకర్పించి
ఉలి దెబ్బలను తనువున ఓర్చి
సగమే కరిగిన ఆ శిలలను చూస్తే

తొలిగిన ముక్కల గుట్టల మధ్యన
విరిగిన గుండె పెంకులు కనిపిస్తాయి
బండలయిన తన ఆశలు కనిపిస్తాయి
కరిగిపోయిన తన కఠినత అగుపడుతుంది
దయనీయమయిన ఓ స్థితి కనిపిస్తుంది.

తనుచేసిన తప్పిదం తనకే తెలియదు
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
బండగా తన బ్రతుకంతమవుతుందని,
ఆశగ చేరిన ఆ కొండ రాయి, ఇపుడు
బండా కాదు. శిల్పమూ కాదు.

అనుకున్నట్టుగ అంతా జరిగితే
అర్చనలందుతు హారతులందుతు
అభిషేకాల్లో మునిగి తేలుతూ
ఇలవేలుపుగా ఇడుములు దీర్చుతు
ఏగుడిలోనో కొలువుండేది.

ఏపాపమెరుగని ఆ శిల, అదిగో
దుమ్ము ధూళుల అభిషేకాల్తో
మండుటెండల హారతులందుతు
చూసే నాధుడు కరువై పోయి
రెంటికి చెడిన రేవడి నేడు.

భువిలో..
అసలా అర్హతలున్న శిలలు ఎన్నో
సగమే మలిచిన శిల్పాలెన్నో
బండగ మిగిలిన గుండెలొ ఎన్నో
పూజలు అందే మూర్తులు ఎన్నో

Monday, March 16, 2009

ఓదార్పు


చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయినా
అదిరే చుబుకమూ ఒలికిన కళ్ళూ
బృకుటి ముడి వంగిన అధరాలూ
వేడి నిట్టూర్పులు వాడి చూపులూ
గుండె గాధని చిత్రంగా గీస్తాయి ..
భావ కావ్యాలనావిష్కరిస్తాయి..
బాధనూ కనువిందు చేస్తాయి

గొంతు లోతుల్లో గీతాలకు
రాగాలను కూర్చుతాయి..
అవేదనకు అనువయిన
పదాలను వెదుకుతాయి ...

జారిన చినుకులది క్షణికమని..
అవిలేని బ్రతుకు అరుచికరమని..
బ్రతుకు పాఠాలు నేర్పుతాయి !

చూపులు కలిపి సముదాయిస్తూ...
తడిసిన చెక్కిలి చుంబన చేస్తూ..
అక్కున చేర్చి ఆలంబన ఇస్తూ...
తిరిగి చేయనని ఆశ్వాసిస్తూ..
రాలిన కవితను ఆస్వాదిస్తూ..
చేసిన తప్పును దిద్దుకుంటూ..

నేను..

Friday, February 20, 2009

నిరీక్షణ


మగత నిద్ర సంధించిన
కలల అంప శయ్య మీద
ఆశ ములుకులు జవసత్వాలు జుర్రుతుంటే
జ్ఞాపక సహస్రాలను వల్లె వేస్తూ
ఆర్తిదాహం నాలుక ఎండగట్టుతుంటే
రేపటి మకరోదయం కోసం
ఓ బ్రతుకు భీష్ముడి నిరీక్షణ

కలల కంప ముద్దిడి నుదుటిన
సంధ్య సింధూరాలని పులుముతుంటే
ఆశ మేకుల ఆలింగనాలతో
చేతనలుడిగి తనువు నివ్వెరపోతే
శిలువ బంధాల ఉయ్యాలలో
రేపటి ప్రక్షాళితోదయం కోసం
ఓ బ్రతుకు జీససు నిరీక్షణ

Wednesday, February 18, 2009

ఆ మనసే ..

బంధాలల్లిన బూజు గూటిలో
బరువెక్కిన మనసూగుతోంది

ఆశగాలి దాన్ని రాలుస్తుందో
ఆ గూడే ఆసాంతం పెనవేస్తుందో
బాధ సాలీడే పెకలిస్తుందో
ఆగని కాలం మాత్రం
ఆ ఆటని ఆత్రంగా చూస్తుంది

ఆటలో గెలుపోటములు ఎవరివైనా
ఆర్తిని ఆశ్రయించేది,
ఆర్తనాదాలు ఆలపించేది
అశృధారలు ఆహ్వానించేది,
అలుపుని ఆస్వాదించేది
చివరికోటమిని ఆనందించేది ఆ మనసే..
ఆ మనసే ..

Monday, February 16, 2009

చింకి పాత

పగ్గాలెరుగని మనసు మగ్గాలు
నేసిన ఆశ వస్త్రాలు..
వాటి మీద
ఊహల రంగులల్లు కున్నాను
కోర్కెల బొమ్మ లద్దుకున్నాను

ఓసారి,
చిరిగిన కలల మబ్బులు చిందించిన
చిరుజల్లులలో తడిసి వెలవెల బోతున్నాయి
నిట్టూర్పుల వేడికి ఆరిపోతున్నాయి ...

మరోసారి,
బ్రతుకు వేగానికి ఎగిరి
జ్ఞాపకాల కంపల్లో చిక్కి చిరుగుతున్నాయి
చింకి పాతల్లా చివరికి మిగిలి పోతున్నాయి..

ఐనా
పగ్గాలు బిగవవు, మగ్గాలు ఆగవు ..
చిరిగిన మబ్బులు ఆగవు
చింకి పాతలూ ఆగవు..


==========================================


paggaalerugani manasu maggalu
nEsina aaSa vastraalu..
vaaTi miida
uuhala rangulallu kunnaanu
kOrkela bomma laddukunnaanu

Osaari,
cirigina kalala mabbulu cindincina
cirujallulalO taDisi velavela bOtunnaayi
niTTuurpula vEDiki aaripOtunnaayi ...

marOsaari,
bratuku vEgaaniki egiri
jnaapakaala kampallO cikki cirugutunnaayi
cinki paatallaa civariki migili pOtunnaayi..

ainaa
paggaalu bigavavu, maggaalu aagavu ..
cirigina mabbulu aagavu
cinki paataluu aagavu..

Wednesday, February 11, 2009

ఉదయం

చంద్రుడు ఒంటినిండా వెన్నెల పూసుకుని
చుక్కల రెప్పల గాలికి ఆరబెట్టుకుంటున్నాడు ..

ఆ చుక్కల ఈర్ష్య వెలుగులో,
సమయం చిక్కింది కదా అనేమో.. ఈ రోజు..
తనకై విప్పారిన కలువలని లెఖ్ఖించు కుంటున్నాడు ..

ముఖం మీద మచ్చ దాచుకుని కులుక్కుంటున్నాడు...

ఆ మురిపెం ఎంతసేపు ? ఉదయం దాకానేగా..


===================================

candruDu onTininDaa vennela puusukuni
cukkala reppala gaaliki aarabeTTukunTunnaaDu ..

aa cukkala iirshya velugulO,
samayam cikkindi kadaa anEmO.. ii rOju..
tanakai vippaarina kaluvalani lekhkhincu kunTunnaaDu ..

mukham miida macca daacukuni kulukkunTunnaaDu...

aa muripem entasEpu ? udayam daakaanEgaa..

Thursday, January 29, 2009

ప్రేమ

చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
మనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము

విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి

రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర

అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము

చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html కు నేను రాసిన స్పందన

Saturday, January 17, 2009

నువ్వంటే భయం

నువ్వంటే భయం
నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తావనో
నీ అస్థిత్వ రూపం అగుపడదనో
అసలున్నావో లేవనో. ఒకటే భయం
ఐనా నీకోసమే శోధన నిను కానని వేదన

నువ్వంటే భయం
నీ వికృత రూపం చూడలేమనో
నీ నీడల కరాళ నృత్యం చూసో
అసలేరూపం నీకు లేదనో. ఒకటే భయం
ఐనా నీకోసమే పోరాటం, తీరని ఆరాటం

నువ్వంటే భయం
అంది ఆత్మ సాక్షితో నిలవలేననో
తెలిసి నన్నే ద్వేషిస్తామనో
పొందక బంధం తెంపలేమనో, ఒకటే భయం
ఐనా నీకోసమే ఈ చూపులు, పడి గాపులు

నిజం నువ్వంటే భయం
అవును నిజం నువ్వంటే భయం .

Friday, January 16, 2009

కుండ

మడిలో మట్టి మలిచేందుకు సిద్ధమవుతుంది
కుమ్మరి చక్రం తిరుగుతుంది జన్మ దాని వరమవుతుంది
ముద్ద మారి కుండవుతుంది

కొలిమిలో మండుతూ కొన్ని మరలి మడి చేరుతూ మరికొన్ని
తడి ఆరేవి కొన్ని విరిగి మిగిలేవి ఇంకొన్ని
నిండి అందాన్నిచ్చేవి కొన్ని, నిండుకుని వెక్కిరించేవి కొన్ని
కాశీలో కాలం చేసేవి కొన్నైతే కల్లు పాకలో తూలి తొణికేవి మరికొన్ని
కుంభాలై స్వాగతించేవి కొన్ని దిష్టిబొమ్మగా బెదరగొట్టేవి కొన్ని
కలశమై శుభాలిచ్చేవి కొన్ని కాటిదాకా వచ్చి కన్ను మూసేవి కొన్ని

తనను చేసిన చేయీ ఒకటే ఆటను వాడిన మట్టీ ఒకటే
తనును మింగిన దాహమే, తాను లొంగిన భావమే
దాని బ్రతుకుకు బావుటా !!

Friday, January 9, 2009

వయసు

వయస్సెంత కఠినత కలది
బ్రతుకు గాధలొ బాధల్నేరి
మడతలు చేసి ముఖానికద్ది
మనిషిని ముదుసలి చేసేస్తుంది

చేతిని కాలిని ముఖాన్ని సైతం
వదలక వికృత ఆకృతులలికి
దరహాసాన్నీ వీడక మార్చినా
నిస్తేజులమై నిలబడి చూస్తాం

మొదటి మడత కధా అందంగానే
వెచ్చని ప్రేమలా, నెచ్చెలి ముద్దులా
గుండెగదులలో దాక్కుంటుంది
వీడక నీడగ కడపటి దాకా తోడిస్తుంది

గడిచేకాలం బ్రతుకు గాధలకు
మకిలిని చేర్చి ఇకిలిస్తున్నా
వయసు మాత్రమే అద్దంలాగా
గడిపిన బ్రతుకుకు సాక్షవుతుంది

http://musingsbytrinath.blogspot.com/2009/01/ag.html కి అనువాదము.

vayassenta kaThinata kaladi
bratuku gaadhalo baadhalnEri
maDatalu cEsi mukhaanikaddi
manishini mudusali cEsEstundi

cEtini kaalini mukhaanni saitam
vadalaka vikRta aakRtulaliki
darahaasaannii veeDaka maarcinaa
nistEjulamai nilabaDi cuustaam

modaTi maData kadhaa andamgaanE
veccani prEmalaa, necceli muddulaa
gunDegadulalO daakkunTundi
veeDaka neeDaga kaDapaTi daakaa tODistundi

gaDicEkaalam bratuku gaadhalaku
makilini cErci ikilistunnaa
vayasu maatramE addamlaagaa
gaDipina bratukuku saakshavutundi

Thursday, January 8, 2009

చావు

స్థబ్దతెరగని వ్యర్ధ బ్రతుకిది
సుద్ద దండగ బ్రతుకు కూడలి
ఉద్దరించగ వచ్చెనదిగో
సిద్దమెక్కర చావురైలుని

దీనికెంతో శక్తి ఉన్నది
పాపమంతా కడగ గలదు
చచ్చినోళ్ళకు మెప్పుతెచ్చే
మంచి గుణమే దీనికున్నది

ఊర్ధ్వ నీచములంటు లేవు
మధ్య రకమగు చావులేదు
హెచ్చు తగ్గుల బ్రతుక విసిగిన
మనిషికంత సమము ఇక్కడ

వేరు గతులతొ విలువలుడిగే
అన్ని చావున సమములే
కోరి నడుపును నిన్నుచూడు
దిక్కు తెలియని పధములొ

చలి గుప్పెట చిక్కి మిగిలిన
పొగమంచుర మన జీవితం
ఆ గుప్పెట సడలక మానదు
మన బ్రతుకిక కరగక ఆగదు


sthabdateragani vyardha bratukidi
sudda danDaga bratuku kuuDali
uddarincaga vaccenadigO
siddamekkara caavurailuni

deenikentO Sakti unnadi
paapamantaa kaDaga galadu
caccinOLLaku mepputeccE
manci guNamE deenikunnadi

uurdhva niicamulanTu lEvu
madhya rakamagu caavulEdu
heccu taggula bratuka visigina
manishikanta samamu ikkaDa

vEru gatulato viluvaluDigE
anni caavuna samamulE
kOri naDupunu ninnucuuDu
dikku teliyani padhamulo

cali guppeTa cikki migilina
pogamancura mana jeevitam
aa guppeTa saDalaka maanadu
mana bratukika karagaka ఆగాడు

ఇది ఇక్కడ పోస్ట్ చీసిna దానికి అనువాదం.
http://musingsbytrinath.blogspot.com/2008/12/death.html

Tuesday, January 6, 2009

అద్దం

అద్దమీరోజు నన్ను గుర్తించలేనంది
గురుతులేవో తనకి చెప్పుకోమంది
ఆనన్ను నాలోనే తవ్వుకోమంది
ననుచూసి నన్నే నవ్వుకోమంది

అనుభవాల జముళ్ళు రాసుకుని
కన్నీట దాహాలు తీర్చుకుని
బీడుల్లో నా బ్రతుకునీడ్చుకుని
గతపు అద్దంలోకి ఆశగా చూస్తే!! అద్దమీరోజు ..

జారిన బంధాలనల్లుకుంటూ
కాలపు చిట్టాలనేరుకుంటూ
వయసు ముఖానికద్దుకుంటూ
గతపు అద్దంలోకి ఆబగా చూస్తే... !! అద్దమీరోజు ..

కన్నీటి సీసాలు ఖాళీలుచేస్తూ
నషాలొ గమ్యాన్ని ప్రక్కనకుతోస్తూ
సుఖాన్ని ఎక్కడో కోలిపోయానంటూ
గతపు అద్దంలోకి బాధగా చూస్తే... !! అద్దమీరోజు ..

గుడిభూమి, ఇలవేల్పు, వేడి వయసులకూడి
అమ్మ కడుపే కాదు ప్రేగు బంధము నేడు
అరువుకైనా వచ్చు కొనితెచ్చుకోనగవచ్చు కానీ
అమ్మకానికి నన్నుకానక మోకరిల్లన నన్ను చూసి ...!! అద్దమీరోజు ...

Friday, December 26, 2008

శాంతం

తర్కం వేదం మోక్షం శాంతం
యాగం యజ్ఞం మరణం శాంతం
విరహం తమకం స్వేదం శాంతం
ఆరాటం ఆధారం నిర్వేదం శాంతం
కాంక్ష ఆంక్ష శిక్ష శాంతం
ఆరంభం నిర్మాణం నిర్మూలం శాంతం
జన్మం పోరాటం నిర్మోహం శాంతం

Friday, November 28, 2008

గతం ఒడ్డు

గతం ఒడ్డున
ఏకాంతం తో నా నడక

ఏకాంతం ఎంత భారమో
అడుగుల గుర్తులు
లోతుగా కనిపిస్తున్నాయి

గతం నుండి కలలు
అలలై కాళ్ళు తడుపుతున్నాయి
ఆ గుర్తుల్ని తనలో
ఆబగా కలుపుకుంటున్నాయి

ప్రస్తుతం కాళ్ళ క్రిందినించి
కరిగి జారిపోతుంది
ఒక్క క్షణం ఆగుతాను
కాలం వేడికి కాళ్ళు ఆరిపోతాయి
కల కనుమరుగవుతుంది
కాళ్ళక్రింద మరో ప్రస్తుతం

నా అస్థిత్వపు గురుతులు
వెనక ఒదులుకుంటూ
ఆరే కాళ్ళను చూసుకుంటూ
ఏకాంతం తో నా నడక
తిరిగి మొదలవుతుంది

కలలు ఆగవు
కాలం ఆగదు
కాళ్ళూఅగవు
ఏది ఆగినా
రుణం తీరినట్లే


gatam oDDuna
Ekaantam tO naa naDaka

Ekaantam enta bhaaramO
aDugula gurtulu
lOtugaa kanipistunnaayi

gatam nunDi kalalu
alalai kaaLLu taDuputunnaayi
aa gurtulni tanalO
aabagaa kalupukunTunnaayi

prastutam kaaLLa krindininci
karigi jaaripOtundi
okka kshaNam aagutaanu
kaalam vEDiki kaaLLu aaripOtaayi
kala kanumarugavutundi
kaaLLakrinda marO prastutam

naa asthitvapu gurutulu
venaka odulukunTuu
aarE kaaLLanu cuusukunTuu
Ekaantam tO naa naDaka
tirigi modalavutundi

kalalu aagavu
kaalam aagadu
kaaLLuaagavu
Edi aaginaa
ruNam teerinaTlE

Wednesday, November 26, 2008

పదహారేళ్ళ ముసలోడు

రంగుల భవిత రాత్రి నిద్దర్లో కరిగిపోగా
సంధ్య రంగులను కనుల్లో నింపుతూ
మండే సూరీడి దెప్పిపొడుపులు
వాస్తవంలోకి బలవంతంగా తోస్తాయి

ప్రతి రోజూ నిన్నటి బ్రతుకుకు
ఓ కొత్త కార్బన్‌ కాపీనే
బ్రతుకు కేలెండర్లో చిరిగే మరో పేజీ
అదే పగలు అదే రాత్రి

ఒకటే రోజును పదే పదే
పాతికేళ్ళగా బ్రతికినందుకు
ప్రాణికి ఎప్పటికీ పదహారేళ్ళే
శరీరమే విసిగి ముసలిదౌతుంది


rangula bhavita raatri niddarlO karigipOgaa
sandhya rangulanu kanullO nimputuu
manDE suureeDi deppipoDupulu
vaastavamlOki balavantamgaa tOstaayi

prati rOjuu ninnaTi bratukuku
O kotta kaarban kaapeenE
bratuku kElenDarlO cirigE marO pEjee
adE pagalu adE raatri

okaTE rOjunu padE padE
paatikELLagaa bratikinanduku
praaNiki eppaTikee padahaarELLE
SareeramE visigi musalidoutundi