Thursday, April 2, 2009

నువ్వంటే నాకు అసహ్యం !!


నువ్వు వెచ్చగా నా చెక్కిళ్ళు
నిమిరి నప్పుడు, పెదవుల మీద
తడి ముద్దులు గుప్పించి నపుడు..ఆప్యాయంగా
అక్కున చేర్చిన నెచ్చెలిని గుర్తు చేశావు !
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నా బాధల్లో పిలవకుండానే
ప్రత్యక్షమయి, గొంతు లోతుల్లో రాగాలు
రేపి, ఉపశమనమిచ్చి మనసు తేలికచేసినప్పుడు
అమ్మ అనురాగ లాలనను గుర్తు చేశావు
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

ఆనందంలోనూ ఆక్రోశంలోనూ..
చీకట్లో నను కౌగిలితించి నీలోకలిపేసి
వెలుగులో నా తోడుంటూ.. ఏకాంతంలోనూ
నాతోనే ఉంటూ.. నా నీడను గుర్తు చేశావు ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

గుండెలు పగిలి, మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలోనూ.. నా మూగ
బాధకు భాష్యం చెపుతూ..
తపించే నాకు ప్రత్యక్షమవుతావు
ఆ పరమాత్మను గుర్తు చేస్తావు..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

సముద్రమంత విశాల హృదయం,
పసిపాపలా నిర్మలమయిన స్థితి,
పుష్పమంత సున్నితమైన స్పర్శ,
అనురాగ మూర్తివి, అందాల రాసివి ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నువ్వు నాసొంతం. నాదానివి
నన్నెరిగిన దానివి. నా మనో నాదానివి
అంతర్నినాదానివి, భావోన్మాదానివి
నాలోని పూడనగాధానివి
పుష్పించని చెట్టువి,

నా కంటి బొట్టువి !!
నువ్వంటే నాకు అసహ్యం !!
అందుకే తుడిచి తరిమేస్తా..
మింగి మరిచేస్తా..
తిరిగిరావద్దని ప్రార్ధిస్తా..