Friday, January 16, 2009

కుండ

మడిలో మట్టి మలిచేందుకు సిద్ధమవుతుంది
కుమ్మరి చక్రం తిరుగుతుంది జన్మ దాని వరమవుతుంది
ముద్ద మారి కుండవుతుంది

కొలిమిలో మండుతూ కొన్ని మరలి మడి చేరుతూ మరికొన్ని
తడి ఆరేవి కొన్ని విరిగి మిగిలేవి ఇంకొన్ని
నిండి అందాన్నిచ్చేవి కొన్ని, నిండుకుని వెక్కిరించేవి కొన్ని
కాశీలో కాలం చేసేవి కొన్నైతే కల్లు పాకలో తూలి తొణికేవి మరికొన్ని
కుంభాలై స్వాగతించేవి కొన్ని దిష్టిబొమ్మగా బెదరగొట్టేవి కొన్ని
కలశమై శుభాలిచ్చేవి కొన్ని కాటిదాకా వచ్చి కన్ను మూసేవి కొన్ని

తనను చేసిన చేయీ ఒకటే ఆటను వాడిన మట్టీ ఒకటే
తనును మింగిన దాహమే, తాను లొంగిన భావమే
దాని బ్రతుకుకు బావుటా !!

5 comments:

  1. అంతే కాదు, నల్ల కుండైనా, ఎర్ర కుండైనా సరే, అది...

    "కుమ్మరి చేయిచెక్కిన శిల్పం
    చల్లని నీటికి అదేగా ఆధారం
    ఇసుకతిన్నె మీద కూర్చుని వయ్యారి
    విసుగు చెందక దాహం తీర్చే పొన్నారి!"

    జీవిత సత్యాన్ని చక్కగా విప్పిచెప్పే గీతావాణి, సుమీ!

    ReplyDelete
  2. దుత్త లోని పాల రుచిని
    తెలుపలేద గోపాలుడు
    అమ్మలాగ సేదదీర్చు
    కుండలోని చల్ల కాదె

    నిండు కుండ మంచి మనసు
    తొణకదంట ఎప్పుడు,
    నన్ను నిన్ను పొల్చెటందుకు
    కుండ మంచి పోలికంట

    ReplyDelete
  3. కొలిమిలో మండుతూ కొన్ని మరలి మడి చేరుతూ మరికొన్ని
    తడి ఆరేవి కొన్ని విరిగి మిగిలేవి ఇంకొన్ని
    నిండి అందాన్నిచ్చేవి కొన్ని, నిండుకుని వెక్కిరించేవి కొన్ని
    కాశీలో కాలం చేసేవి కొన్నైతే కల్లు పాకలో తూలి తొణికేవి మరికొన్ని
    కుంభాలై స్వాగతించేవి కొన్ని దిష్టిబొమ్మగా బెదరగొట్టేవి కొన్ని
    కలశమై శుభాలిచ్చేవి కొన్ని కాటిదాకా వచ్చి కన్ను మూసేవి కొన్ని


    ఆత్రేయ గారూ చాలాబాగుంది. ఇదే పద్ధతిలో మనుషుల్లో రకాల గురించి ఒక కవిత రాయరూ.....

    ReplyDelete
  4. కాలచక్రంలో మనుజులందరూ మట్టి పాత్రలే-
    మలువబడే మట్టికిలేని మర్మం తెలుసుకున్నది మనుజులే-
    మట్టిలో దైవ రూపాన్నిచూసి స్వరూపాన్ని మార్చుకున్నది మనుషుడే
    నిండినా నిండుకున్నా ‘కుండ’ను చేసిన ‘మట్టి’ యేగదా ఆధారం
    ఉండినా ఊడినా మనిషికి పరమాత్మేయేగదా ఆధారం., లేకుంటే అంతా ఖాళీయే!
    కుండవయసు ఏమని చెప్పాలి? పుట్టిన రోజే రోదిస్తున్నది చంటి బిడ్డలా, తను మట్టిని చేరాలని, ఈ మిద్యజగత్తులో బ్రతకలేనని,తన నిజరూపందాల్చాలని !
    మరి మనిషికెందుకు ఆరాటం మాయచేసే ముసుగులో మట్టిపాత్రకావాలని?
    మట్టికుండనుచూసి నేర్చుకోలేడా? మనసులోని మాలిన్యం మసిచేసుకోలేడా?

    ReplyDelete
  5. ఉష శృతి వర్మ గార్లకు ధన్యవదాలు. మీ వ్యాఖ్యానాలు నా కవితలకి మరింత అందాన్ని అందిస్తాయి నా రాతలని తరింప చేస్తాయి. ధన్యవాదాలు

    శ్రీ పిచ్చబ్బాయి గారు. నేను చెప్పింది అంతా మనుషుల గురించేనండి అక్కడ కుండలెలా కనబడ్డాయి మీకు ? ఏమయినా మీ కోరిక ఏదోరోజు తీరుతుందని ఆశిస్తాను. మీరు దయచేసి పేరు మార్చుకోండి. మీకు ధన్యవాదాలు చెప్పినా తిట్టినట్టు ఉంటుంది. ఎలా చెప్పాలో తెలియక జుట్టిపీక్కుని ఉన్నబట్టతల గుండయింది. మా ఆవిడకి మొహం ఎలా చూపాలో తెలియటంలేదు. మళ్ళీ నాకు జుట్టువచ్చే లోపు పేరుమార్చండి స్వామీ.

    ReplyDelete