Wednesday, March 18, 2009

కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు





కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
ప్రక్కన నక్కిన పిశాచిమూకలు .

తేనెలు పూసిన నెత్తురు కత్తులు
జిత్తులు నిండిన అత్తరు మూటలు ..
నేతలు.. మన నేతలు ... .. 

దేశపు భవితను అడుసులొ తొక్కి
వేదన బ్రతుకులు మడుగులొ దించి
భూములు మింగి భోగాలందే ..! కుక్కలు .. నక్కలు.

ప్రణాలికలన్ని ప్రచురణ కొరకే
ప్రచారమంతా పరపతి కొరకే
ప్రజాపావులివి ప్రయోగపెలుకలు..! 

వాగ్దానాలకు హద్దుల్లేవు
వాగ్యుధ్ధాలకు అదుపుల్లేవు
అశ్లీలమశుధ్ధమసభ్య చేష్టల !  కుక్కలు .. నక్కలు.


నిజాయితీ అది తెలియని మాట
ప్రజాసేవ అది మరచిన మాట
జనాలు కొంటూ.. దేశాన్నమ్ముతూ..! కుక్కలు .. నక్కలు.

మగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై  పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..! 

తూర్పు కొండపై రుధిర జ్వాలలు
నింగిన చిందిన సింధూరాలు
పరుగులు తీసే చీకటి చేష్టలు..
సాక్ష్యాలివిగో.. సాక్ష్యాలివిగో.. ..! కుక్కలు .. నక్కలు.

ప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..! కుక్కలు .. నక్కలు.