Showing posts with label ఉదయం. Show all posts
Showing posts with label ఉదయం. Show all posts

Monday, August 24, 2009

ఉదయం




నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !

రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.


published in poddu.net (http://poddu.net/?p=3220)

Thursday, April 9, 2009

ఆవిష్కరణ


పట్టె మంచము మీద తూర్పుగా తలపెట్టి
కాలి మట్టెల వరకు తనువంత దాచేస్తు
కటిక చీకటి గప్పి కునుకు తీసే పడతి ...

సవ్వడే లేకుండ సరసాలు ఆడంగ
చల్లగా దరికి జేరి విరహమందిన ప్రియుడు
మెల్లగా ఆఝాము తెర లాగుతున్నాడు ...

చిమ్మ చీకటి అడవి..మధ్య నడిచెడి దారి..
బాట చివరన ఎరుపు గగన తలము ..

ఆ క్రింద మెరిసేటి కొండ చరియల నడుమ
నిండుగా ముద్దొచ్చే భాను మందారం..

తమ సఖుడి రాకతో, ఆనంద ముప్పొంగి
వికసించి నవ్వేటి రెండు పద్మాలు..

పద్మాల పూ తావి చాలదనుకుందేమో
తనవంతు గంధాలు విరజల్లు సంపెంగ ..

పగడాల తమ కాంతి దశదిశలకూ జిమ్మి
పగటి వెలుగులు మింగి ముత్యాలు గా మార్చి
పలకరింపుగ చూచె ఆలుచిప్పల నవ్వు.

ఆనంద దుందుభులు ప్రాగ్దిశలో మ్రోగంగ
ఆ తాళానికనువుగా తపన తీరేలాగ
తనవంతు గాన్నాన్ని తోడు కలిపిన శంఖు..

ఇంత సుందర తరుణమూరికే జారేనా ?
కొంత తడవైనా దాన్ని కట్టేయవద్దూ.. ?
ఆమంగళావకాశాన్ని ముడులేసి బంధించి
గుండెలోతుల్లో దాచేటి బంగారు కలశాలు..

సురగంగ ఉప్పొంగి శివుని శిరమున చేరి
సుడులెన్నొ తిరిగేసి విసిగినట్టుంది ...
భువి పైకి జారంగ బలమైన తలమేదొ
తెగవెదికి ఆ స్థలము ఎంచినట్టుంది..
తనధారనోపంగ హరుని జడలోతునుబోలు
కూపాన్ని ఆ మధ్య తవ్వి నట్టుంది..

ఈజగతి మెచ్చంగ సురపతే నొచ్చంగ
వాడి ఏనుగు వాడి దంతాలు మాయమై
వడివడిగ పరుగెత్తి ఇటుదాగెనెందుకో ?

ఎర్ర కలువల మీద అందాల ఈ రాశి
ఎన్ని తావుల జనెనో ఎంతగా అలసెనో ...

తనువు మరిచి..
విభుని కొరకై తపియించు ఋషి లాగ ..
తపనలెరుగక..
అమ్మ ఒడిలోన శయనించు పాప లాగ..
నిద్ర ఒడిలో తాను ఒదిగి ఉంటే..

ఆశగా అటుచేరి ఆమె విభుడు నేడు
అందాన్ని ఆసాంతం ఆవిష్కరించాడు..
మమతతో ఆవిడ్ని ఓలలాడించాడు..
కవితలో తనువంత పూలు కురిపించాడు..

Wednesday, March 18, 2009

కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు





కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
ప్రక్కన నక్కిన పిశాచిమూకలు .

తేనెలు పూసిన నెత్తురు కత్తులు
జిత్తులు నిండిన అత్తరు మూటలు ..
నేతలు.. మన నేతలు ... .. 

దేశపు భవితను అడుసులొ తొక్కి
వేదన బ్రతుకులు మడుగులొ దించి
భూములు మింగి భోగాలందే ..! కుక్కలు .. నక్కలు.

ప్రణాలికలన్ని ప్రచురణ కొరకే
ప్రచారమంతా పరపతి కొరకే
ప్రజాపావులివి ప్రయోగపెలుకలు..! 

వాగ్దానాలకు హద్దుల్లేవు
వాగ్యుధ్ధాలకు అదుపుల్లేవు
అశ్లీలమశుధ్ధమసభ్య చేష్టల !  కుక్కలు .. నక్కలు.


నిజాయితీ అది తెలియని మాట
ప్రజాసేవ అది మరచిన మాట
జనాలు కొంటూ.. దేశాన్నమ్ముతూ..! కుక్కలు .. నక్కలు.

మగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై  పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..! 

తూర్పు కొండపై రుధిర జ్వాలలు
నింగిన చిందిన సింధూరాలు
పరుగులు తీసే చీకటి చేష్టలు..
సాక్ష్యాలివిగో.. సాక్ష్యాలివిగో.. ..! కుక్కలు .. నక్కలు.

ప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..! కుక్కలు .. నక్కలు.

Friday, February 20, 2009

నిరీక్షణ


మగత నిద్ర సంధించిన
కలల అంప శయ్య మీద
ఆశ ములుకులు జవసత్వాలు జుర్రుతుంటే
జ్ఞాపక సహస్రాలను వల్లె వేస్తూ
ఆర్తిదాహం నాలుక ఎండగట్టుతుంటే
రేపటి మకరోదయం కోసం
ఓ బ్రతుకు భీష్ముడి నిరీక్షణ

కలల కంప ముద్దిడి నుదుటిన
సంధ్య సింధూరాలని పులుముతుంటే
ఆశ మేకుల ఆలింగనాలతో
చేతనలుడిగి తనువు నివ్వెరపోతే
శిలువ బంధాల ఉయ్యాలలో
రేపటి ప్రక్షాళితోదయం కోసం
ఓ బ్రతుకు జీససు నిరీక్షణ

Tuesday, February 3, 2009

ప్రతిదిన భాగోతం

తెల్లారిన తొందరలో
తూర్పు కొండల మీద చంద్రుడు,
అలసిన కళ్ళతో తన్నిన సింధూరం !

రేరాజు వీడిన విరహంలో, ప్రకృతి
జార్చిన చీకటి వలువలు -
కనుల ముందు పరిచిన అందం !

తనని కాపాడే గడబిడలో,
నేల కప్పిన పొగమంచు తెరలు
హరితాంకురాలపై రాలి పడిన
స్వేద ముత్యపు బిందువులు ..

చెలికాడి వత్తాసుగా కన్ను గీటిన తారలు.

వీరి శృంగారం పగలై గుప్పుమంది
అందుకే సూర్యుడు మండిపడుతున్నాడు

చంద్రుడు కనబడకుండా
తారలతో కలిపి ఖైదు చేశాడు
పొగమంచు తెరలు దాచేశాడు
ఒలికిన సింధూరం తుడిచేశాడు
దొరికిన సాక్ష్యాలు సర్దుకుంటున్నాడు

ఎవరికి విన్నవిద్దామనో
ఈ తోడుదొంగల ప్రతిదిన భాగోతం

tellaarina tondaralO
tuurpu konDala miida candruDu,
alasina kaLLatO tannina sindhuuram !

rEraaju viiDina virahamlO, prakRti
jaarcina ciikaTi valuvalu -
kanula mundu paricina andam !

tanani kaapaaDE gaDabiDalO,
nEla kappina pogamancu teralu
haritaankuraalapai raali paDina
svEda mutyapu binduvulu ..

celikaaDi vattaasugaa kannu giiTina taaralu.

viiri SRngaaram pagalai guppumandi
andukE suuryuDu manDipaDutunnaaDu

candruDu kanabaDakunDaa
taaralatO kalipi khaidu cESaaDu
pogamancu teralu daacESaaDu
olikina sindhuuram tuDicESaaDu
dorikina saakshyaalu sardukunTunnaaDu

evariki vinnaviddaamanO
ii tODudongala pratidina bhaagOtam

Monday, January 26, 2009

ఉదయం

తూర్పు కొండల మీదనించి కాంతి తీగల గాలమేసి
నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి
తన కోపము నింగి నిండా పరిచినట్టున్నాడు
భయపడ్డ పొద్దుతిరుగుడు చేలు నిక్కబొడుచుకున్నాయి
గువ్వ పిట్టలు గూళ్ళనొదిలి తుర్రు మన్నాయి
అది చూసి తోటలో పూలన్ని గొల్లు మన్నాయి

ఉదయం

Saturday, December 6, 2008

ఉదయం

నల్ల బుడగ గుత్తుల్లా కలలు
అలరిస్తున్నాయి, మత్తునిస్తున్నాయి

భళ్ళని పగిలిన శబ్దానికి
ఉలిక్కిపడి సూర్యుడు ఉదయించాడు

నిద్ర కన్నుల ఎరుపు తూర్పంతా పరిచాడు
భయమేసిన కోడి కేక పెట్టింది

బుజ్జాయి మెడగంట, గోపురం మీద సుప్రభాతం
ఎదురింట్లో సంగీత పాఠాలు

అలిగిన రాతిరి, నిశ్శబ్దాన్ని చీకటి సంచీలో
దాచి దాంతో ఉడాయించింది . బద్ధకం ఇక్కడొదిలేసింది

నిద్ర నాకిక రానని మొరాయించింది.

అబ్బా !! ....... అప్పుడే రాత్రెళ్ళిందా ?

nalla buDaga guttullaa kalalu
alaristunnaayi, mattunistunnaayi

bhaLLani pagilina Sabdaaniki
ulikkipaDi suuryuDu udayincaaDu

nidra kannula erupu tuurpantaa paricaaDu
bhayamEsina kODi kEka peTTindi

bujjaayi meDaganTa, gOpuramekkina
em es subbalakshmi, edurinTlO sangeeta paaThaalu

aligina raatiri niSSabdaanni ciikaTi sanciilO
daaci uDaayincindi. baddhakam ikkaDodilEsindi

nidra naakika raanani moraayincindi.

abbaa appuDE raatreLLindaa ?