Showing posts with label అలక. Show all posts
Showing posts with label అలక. Show all posts

Monday, March 16, 2009

ఓదార్పు


చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయినా
అదిరే చుబుకమూ ఒలికిన కళ్ళూ
బృకుటి ముడి వంగిన అధరాలూ
వేడి నిట్టూర్పులు వాడి చూపులూ
గుండె గాధని చిత్రంగా గీస్తాయి ..
భావ కావ్యాలనావిష్కరిస్తాయి..
బాధనూ కనువిందు చేస్తాయి

గొంతు లోతుల్లో గీతాలకు
రాగాలను కూర్చుతాయి..
అవేదనకు అనువయిన
పదాలను వెదుకుతాయి ...

జారిన చినుకులది క్షణికమని..
అవిలేని బ్రతుకు అరుచికరమని..
బ్రతుకు పాఠాలు నేర్పుతాయి !

చూపులు కలిపి సముదాయిస్తూ...
తడిసిన చెక్కిలి చుంబన చేస్తూ..
అక్కున చేర్చి ఆలంబన ఇస్తూ...
తిరిగి చేయనని ఆశ్వాసిస్తూ..
రాలిన కవితను ఆస్వాదిస్తూ..
చేసిన తప్పును దిద్దుకుంటూ..

నేను..

Monday, January 5, 2009

దారి చూపు

అలిగిన చెలి కన్నుల మంటలోర్చగ వచ్చు
విరిగిన తన పల్కుల ముత్యాలేరగ వచ్చు
బిగిసిన నులి పెదవులు తంటాలు తెచ్చిపెట్టె
ఇరువురు సతులతో నెగ్గిన ఈశా దారి చూపు?

Thursday, November 13, 2008

అన్నట్టు తిరిగి రాకెపుడో ?

దగ్గరున్నా గుండె తెరిచి
ప్రేమ చూపింది లేదు గానీ
కొన్నాళ్ళకైనా నిను చూడలేనంటే
తెగిన పటం గాలికూగినట్టుంది

చెంతనున్నా గొంతు విప్పి
ఊసు చెప్పింది లేదు గానీ
కొంతకాలమైనా మాటకుదరదంటే
వీణ నుండి రాగ మూడినట్టుంది

వేరు తీరాలమని చెప్పి
నన్ను ఒప్పించుకున్నా
కొన్నిరోజులైనా ఇక కలవలేమంటే
కాలమెందుకో అసలు కదల నట్టుంది

ప్రకృతి నామీద ఈరోజు అలిగినట్టుంది


daggarunnaa gunDe terici
prEma cuupindi lEdu gaanee
konnaaLLakainaa ninu cuuDalEnanTE
tegina paTam gaalikuuginaTTundi

centanunnaa gontu vippi
uusu ceppindi lEdu gaanee
kontakaalamainaa maaTakudaradanTE
veeNa nunDi raaga muuDinaTTundi

vEru teeraalamani ceppi
nannu oppincukunnaa
konnirOjulainaa ika kalavalEmanTE
kaalamendukO asalu kadala naTTundi

prakRti naameeda eerOju aliginaTTundi
annaTTu #when r u coming back ? #

Tuesday, June 12, 2007

నీ సొగసు చూడ తరమా ... నీ అలక తీరు సుఖమా?


బిగివడిన నీ నోటి పెదవులు
ముడివడిన నీ భృకుటి గీతలు
ఎరుపెక్కిన నీ బుగ్గ కాంతులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

బుస కొట్టెడి నీ శ్వాసలు
కసి రేగిన నీ మాటలు
పదునెక్కిన నీ చేస్టలు
నీ సొగసు చూడ తరమ
నీ అలక తీరు సుఖమా?

పరుగెట్టెది నీ నడకలు
సుడి రేపెడి నీ చేతలు
మాటాడని నీ ఊసులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

చిరునవ్వును తొణకనీవు
అలక హద్దు దాటనీవు
దరికి నన్ను రానీవు
ఒక్క పలుకు మాటాడవు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?