Showing posts with label ఆశ. Show all posts
Showing posts with label ఆశ. Show all posts

Thursday, October 21, 2010

ఈ ఉదయం


బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
రంగుల ప్రపంచం
ఓ లోయ సరిహద్దుల్లో అంతమయింది

రెండు సూర్యుళ్ళ ఉదయంతో
సగం కాలిన రాత్రి
ముళ్ళ కంప మీద
అలానే కరుగిపోయింది.

చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి
జారిపోతున్న చీకట్లకు
తనువు చాలించిన తుంపర్లు
తెరలవుతున్నా..

చల్లగా వీచిన తెల్లపదాల తావి
పూల తోటలోకి ..దారి చూపింది.

Tuesday, August 24, 2010

మబ్బు



ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..

ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం

ఈ లోపే మరో అంకం..

పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం

ఈ మబ్బు విడవాలి

Thursday, November 19, 2009

ఎవరికోసం .. ?


బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

ఎవరికోసం .. ?

Monday, September 7, 2009

దొరకని ప్రేమ..


చిరు దీపపు వెలుతురులు
అటు వైపూ .... ఇటు వైపూ.

తక్కెడలోని బరువులు , అవిశ్రాంతంగా..
ముల్లును కదుపుతూనే ఉన్నాయి..

రెండు విల్లులు విడిచిన
ఒకటే బాణము..
తపనలు తెలియకేమో ..
తగల కుండా .. దూసుకు పోయింది.

జారి పడ్డ ఈకలు ఏరుకుని
రంగులో ముంచి
రంగరించుకుంటున్న నాకు,

కరిగిన రాత్రి,
రెల్లు గడ్డి మీద...
చల్లగా తగిలి
మేల్కొలిపింది.

Wednesday, August 26, 2009

పిలుపు


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

ఆ గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

ఆ మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
ఓ శవం బ్రతికినట్టనిపించింది..
ఈ శిల కరిగినట్టనిపించింది.

Thursday, May 28, 2009

కళ్ళు


ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా బిగుసుకుంటాయి..

దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...

అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో స్థిమితాన్ని చెదర గొడతాయి..

అందుకే
గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే

ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ కవనం..
నా కళ్ళలోకి చూస్తావు కదూ.. ?

Thursday, April 16, 2009

అర్ధాంగివయ్యేదానివి.


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

Wednesday, April 15, 2009

కల(ల )త నిద్ర..


చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు

అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి

ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..

అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...

Friday, April 3, 2009

ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ...


ఏకాకి నా బ్రతుకు ఎదురు చూసే తోడు
ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ... !!

తడికళ్ళలో నువ్వు తాండవిస్తున్నావు
తపన తెలిసీ నువ్వు తళుకు మంటావా.. ?

ఆశలుడిగిన మనసు అట్టుడికి పోతుంటె
రగులు జ్వాలలు చూసి జారు కుంటావా .. ? ... ఏకాకి

చింత సమయాల్లోన చెక్కిళ్ళు తడిపేసి
చెంత నిలవక నువ్వు చేజారి పోతావా .. ?

నీదాన్ని నేనంటు నాలోనే దాగుండి
ఎద కోరు సమయాన ఎగిరెళ్ళి పోతావా .. ? ... ఏకాకి

ఎండిపోతూ మనసు బీటలై పోతుంటె
ఎదురుచూపుల్లోన అడ్డమై నిలిచేవా .. ?

రెక్కలిరిగిన మనసు రేగడై పోయాక
చెక్కిళ్ళ తలముపై చిందుల్ని వేస్తావా .. ? ... ఏకాకి

ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ...
కాసేపు నాతోటి ఊసాడి పోవూ..?
నా బాధ కాస్తన్న కరిగించి పోవూ..? ఏకాకి

Friday, March 20, 2009

సగం చెక్కిన శిల్పం



మూర్తిగ మలిచే అతనిని చేరి
తనకు తానుగా తనకర్పించి
ఉలి దెబ్బలను తనువున ఓర్చి
సగమే కరిగిన ఆ శిలలను చూస్తే

తొలిగిన ముక్కల గుట్టల మధ్యన
విరిగిన గుండె పెంకులు కనిపిస్తాయి
బండలయిన తన ఆశలు కనిపిస్తాయి
కరిగిపోయిన తన కఠినత అగుపడుతుంది
దయనీయమయిన ఓ స్థితి కనిపిస్తుంది.

తనుచేసిన తప్పిదం తనకే తెలియదు
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
బండగా తన బ్రతుకంతమవుతుందని,
ఆశగ చేరిన ఆ కొండ రాయి, ఇపుడు
బండా కాదు. శిల్పమూ కాదు.

అనుకున్నట్టుగ అంతా జరిగితే
అర్చనలందుతు హారతులందుతు
అభిషేకాల్లో మునిగి తేలుతూ
ఇలవేలుపుగా ఇడుములు దీర్చుతు
ఏగుడిలోనో కొలువుండేది.

ఏపాపమెరుగని ఆ శిల, అదిగో
దుమ్ము ధూళుల అభిషేకాల్తో
మండుటెండల హారతులందుతు
చూసే నాధుడు కరువై పోయి
రెంటికి చెడిన రేవడి నేడు.

భువిలో..
అసలా అర్హతలున్న శిలలు ఎన్నో
సగమే మలిచిన శిల్పాలెన్నో
బండగ మిగిలిన గుండెలొ ఎన్నో
పూజలు అందే మూర్తులు ఎన్నో

Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...


Friday, February 27, 2009

ఆత్మీయతా నిరీక్షణలు..


స్నేహమిదని మభ్య పెట్టుకుంటూ
నువ్వు నేస్తమని .. సద్ది చెప్పుకుంటున్నా
గుండె గుడిలొ దాచుకుంటున్నా..

అందుకే..

నీకై వేచిన ఆ ప్రతి క్షణాలు..
నేచేసిన కాలక్షేపమనుకుంటున్నా ..
స్థంభించినా సమయంలో
రాలిని ఆరెండు చుక్కలు..
కాకతాళీయ మనుకుంటున్నా..

నువు కనపడనప్పుడు,
మెలికలు తిరిగిన మనసు మధనను
వెర్రి తనమని సమాధానపడుతూ..
బరువు పెరిగిన ఆ రెప్పల భారం
అనాలోచిత మనుకుంటున్నా..

నీ మాటకోసం పడె తపనను
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నా మాటల గారడీలో
నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పలు, రాలకుండా సంభాళిస్తున్నా..

ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని
ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదిస్తున్నా ..

గుండె గుడిలో వెలిసిన హితకు,
ఆహ్వాన సింహాసనాలు..
ఆడంబర ఆఘ్రాణలు..
ఆశ నివేదనలు..
ఆనంద నీరాజనాలు..
అశృ తర్పణాలు..
ఆకాంక్ష అంపకాలు ..
ఆత్మీయతా నిరీక్షణలు..




Thursday, February 26, 2009

అందనంత ఎత్తులో...


నువు నన్ను తేరిపార చూసి
మనసారా మాటలాడి
పలకరింపుగా నైనా ఒ నవ్వు విసిరి
ఎన్నాళ్ళయ్యింది ?

remember those days ?
మనం hours together మాట్లాడుకున్నప్పుడు
time ఎలా పరుగెడుతుందని
నివ్వెర పోయిన రోజులు..

ఇవాళ best day నా జీవితంలో
అని మురిసిపోతూ.. ఆ evening
ఇళ్ళకు పోతూ.. bye bye
చెపుతూ చూసిన చూపుల లోతులు...

lunch timeలో ఎందెచ్చావు
అంకుంటూ.. ఎలా చేశావనుకుంటూ
ఇద్దరం share చేసుని తింటూ
హాయిగా గడిపిన dayసూ ...

నువ్వెక్కడున్నావ్‌ ?
office కెన్నింటికి వస్తావంటూ
ఓ చేత్తో drive చేస్తూ
మరో చేత్తో phone చేసిన రోజులు ..

ఏమయ్యాయి అవన్నీ..
ఆ friendshipకేమయ్యింది ?
what happened to that ఆత్మీయత ..

తప్పు నాదేలే
మనసు విప్పకుండా ఉండాల్సింది
మాట గుండెల్లో బంధించాల్సింది
కానీ అప్పుడది cheeting కాదూ ?

అందుకే అనుకున్న వన్నీ చెప్పేశ
ఆశల గాలిపటం ఎగరేశా
నిన్ను బాధ పెట్టనన్న బాధౌన్నా
మభ్య పెట్టలేదన్న తృప్తుంది
అర్ధం చేసుకోగలవన్న నమ్మకముంది


చివరగా ఒక్క మాట
..
..
ఏమీ లేదులే..
..
..
ఉన్న దూరాన్ని పెంచుకోలేను.
ఆశ కాగడా ఆర్పుకోలేను.

నా గుండెలో నీ స్నేహానికి
స్థానం అలానే ఉంది.. ఉంటుంది
అందనంత ఎత్తులో...
ఆరాధ్య ప్రాయంగా .

Thursday, January 29, 2009

ప్రేమ

చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
మనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము

విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి

రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర

అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము

చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html కు నేను రాసిన స్పందన

Saturday, January 24, 2009

అపరిచితులు

ఒకే దారిన పోతున్నాం
బ్రతుకు మూట భుజానేసుకుని
ఆశ వెలుగులో దార్లు వెతుకుతూ
అడియాశ మలుపులు వెనక వదులుతూ
తిరిగిన దారులు గుర్తు చేసుకుంటూ

ఒకే కాలాన్ని గడుపుతున్నాం
మన గతపు గంపల గాధలు పంచుకుంటూ
కొత్త కధలను అల్లుకుంటూ
తడబడు నడకలు సవిరించికుంటూ
ఒకరికి ఒకరు ఆధార మవుతూ

ఈ బంధానికి పేర్లు వెదికి
ఓడిన వారెందరో,
అలిసి ఆగిన వారెందరో
పేరు పెట్టి విరిగిన వారెందరో
పిలిచి దాని విరవటమెందుకు ?

మన బంధానికి పేరులొద్దు
ఒకరికి ఒకరు తోడుగా
ఎవరి గమ్యం వారు చేరుకుందామా ?
ఇలా కలిసి తిరిగిన అపరిచితులుగానే సాగి పోదామా ?
చివరికి మన గతాల్లోనే మిగిలి పోదామా ?
సమసి పోదామా ?


Tuesday, January 6, 2009

ఆశ

ఈ రాత్రి బ్రతుకు పండినట్లుంది
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది

ఇటు చూడు వేదన బల్లమీద
ఓ ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది

తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది

పండి రాలిన కలలు ఏరుకుంటూ
ఆశమంటకు చితుకులుగా వాడుకుంటూ
ఆరకుండా దాన్ని చూసు కుంటుంది

తెల్లవారే లోపు
ఆ కలలు సమసే లోపు
ఆ ఆశ ఆరేలోపు
ఆ నెగడు అణిగేలోపు
ఆ ఆశ పండేనో అడియాసై మండేనో

ee raatri bratuku panDinaTlundi
tana candruni gunDeku hattukuni
taanodigi tamakamlO niddarOtundi

iTu cuuDu vEdana ballameeda
O aaSa onTarai mukham daacukuni
EDci alisi bElagaa odigi kuurcundi

tODu dorakani aaSaku eeDu jaarindi
nee jaaDa kaanaka taanu gOla cEsindi
neeDatOnE tana gODu ceppukunTundi

panDi raalina kalalu ErukunTuu
aaSamanTaku citukulugaa vaaDukunTuu
aarakunDaa daanni cuusu kunTundi

tellavaarE lOpu
aa kalalu samasE lOpu
aa aaSa aarElOpu
aa negaDu aNigElOpu

aa aaSa panDEnO aDiyaasai manDEnO

Monday, December 1, 2008

మౌనం

మాటలు పెదవులు దాటకపోతే
తలపులు మదిలో లేవని కాదు
ఆశను ముఖతా తెలుపకపోతే
యెదలో అలజడి లేదని కాదు
భావము బయటకు పెగలకపోతే
భారము హృదిలో లేదని కాదు

రగిలిన గాయం మానేటందుకు
కాలం నదిలో అడ్డమీదుతూ
మౌనం మందును మనసుకు పులిమి
ముందుకు సాగే పయనం నాది

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

మౌనం మందును మనసుకు పులిమి
ఆగక సాగే పయనం నాది


maaTalu pedavulu daaTakapOtE
talapulu madilO lEvani kaadu
aaSanu mukhataa telupakapOtE
yedalO alajaDi lEdani kaadu
bhaavamu bayaTaku pegalakapOtE
bhaaramu hRdilO lEdani kaadu

ragilina gaayam maanETanduku
kaalam nadilO aDDameedutuu
mounam mandunu manasuku pulimi
munduku saagE payanam naadi

Opika paTTE samayam lEdu
aavali teeram darilO lEdu
ukkiri bikkiri cEsE alalaku
bhayapaDi aagE taruNam kaadu

mounam mandunu manasuku pulimi
aagaka saagE payanam naadi

Thursday, October 23, 2008

నువ్వు

కక్షల కదన రంగాల్లో
ఎగిరొచ్చిన శ్వేత పత్రం
నిర్జీవ జనుల శోకాల్లో
ఎదురొచ్చిన ఆశా శిల్పం
నిస్తేజ నిశీధి వీధుల్లో
వెలుగిచ్చిన కాంతి కిరణం
కలవరింతల అసంపూర్ణ నిద్రల్లో
ఒడినిచ్చిన మాత్రు రూపం
వేడెక్కిన విధాత రాతల్లో
తరలొచ్చిన చల్లని పవనం
కబళించే కష్టాల ఊబుల్లో
చెయ్యిచ్చిన అమృత కలశం
నువ్వు !!


kakshala kadana rangaallO
egiroccina SvEta patram
nirjeeva janula SOkaallO
eduroccina aaSaa Silpam
nistEja niSeedhi veedhullO
velugiccina kaanti kiraNam
kalavarintala asampuurNa nidrallO
oDiniccina maatru ruupam
vEDekkina vidhaata raatallO
taraloccina callani pavanam
kabaLincE kashTaala uubullO
ceyyiccina amRta kalaSam
nuvvu !!

అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

కటిక ఉప్పుల తీరాల్లోనే హృద్యంగా ఉదయం
కరుడుగట్టిన గుండెల్లోనే ప్రజ్వాలిత కధనం
కసిపెరిగిన క్రోధాల్లోనే పసిఛాయల గమనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

వెనుదిరిగిన కెరటాల్లోనే తడియారిన తరళం
కునుకెరగని రాత్రుల్లోనే ఆలక్ష్యపు జననం
ఆక్రోశపు అరుపుల్లోనే గురుతుండె కవనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

కారడవుల గుప్పెట్లోనే చైతన్యపు సమరం
నిరసించిన హృదయాల్లోనే తొలిప్రేమాగమనం
నిశిరాతిరి సమయాల్లోనే స్వాతంత్ర్యపు కదనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం

పడిపోయిన శిధిలాల్లోనే గతవైభవ శిఖరం
చేజారిన తరుణాల్లోనే మరుపెరుగని సకలం
చితిమంటల చిటపటలోనే మరుజన్మకు పయనం
అంతం కాదిది ఆరంభం చీకటి కావల తొలికిరణం



kaTika uppula teeraallOnE hRdyamgaa udayam
karuDugaTTina gunDellOnE prajvaalita kadhanam
kasiperigina krOdhaallOnE pasiChaayala gamanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

venudirigina keraTaallOnE taDiyaarina taraLam
kunukeragani raatrullOnE aalakshyapu jananam
aakrOSapu arupullOnE gurutunDe kavanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

kaaraDavula guppeTlOnE caitanyapu samaram
nirasincina hRdayaallOnE toliprEmaagamanam
niSiraatiri samayaallOnE swaatantryapu kadanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

paDipOyina SidhilaallOnE gatavaibhava Sikharam
cEjaarina taruNaallOnE maruperugani sakalam
citimanTala ciTapaTalOnE marujanmaku payanam
antam kaadidi aarambham ceekaTi kaavala tolikiraNam

Tuesday, October 21, 2008

మా ఇంట్లో చెట్లు

నునులేత ఆకులతొ తొలివాన చినుక్కుల్లో
తడిసి ఆరిన తనువులతో స్వచ్చమయ్యేవి
ఆకు పచ్చని రంగు ఆసాంతము తొడిగేసి
పడుచు ప్రేయసి లాగ పలకరించేవి

బోసి నవ్వులలాగ పూలెన్నొ విరబూసి
మనసుల్ని హాయిలో ఊపివేసేవి
సంధ్య రంగులు ఎన్నొ అరువడిగి తెచ్చేసి
పెద్ద ముత్తయిదువల్లె ఎదురు వచ్చేవి

రెక్కలొచ్చిన గుడ్డు తనదారిగొన్నాట్టు
పెళ్ళిచేసిన బిడ్డ అత్తిల్లు జనినట్లు
ఎండినాకులు నేడు రాలుతున్నాయి
వివశులై ఆ చెట్లు మానులౌతున్నాయి

నగ్నంగ నిలుచుండి తపియించె మునిలాగ
వసంతమెపుడని నేడు ఎదురుచూస్తున్నాయి
తమ బాధ నాతోటి చెప్పుకుంటున్నాయి
నా గుండె మెత్తగా కోత కోస్తున్నాయి !!

nunulEta aakulato tolivaana cinukkullO
taDisi aarina tanuvulatO swaccamayyEvi
aaku paccani rangu aasaantamu toDigEsi
paDucu prEyasi laaga palakarincEvi

bOsi navvulalaaga poolenno virabuusi
manasulni haayilO uupivEsEvi
sandhya rangulu enno aruvaDigi teccEsi
pedda muttayiduvalle eduru vaccEvi

rekkaloccina guDDu tanadaarigonnaaTTu
peLLicEsina biDDa attillu janinaTlu
enDinaakulu nEDu raalutunnaayi
vivaSulai aa ceTlu maanuloutunnaayi

nagnamga nilucunDi tapiyince munilaaga
vasantamepuDani nEDu edurucuustunnayi
tama baadha naatOTi ceppukunTunnaayi
naa gunDe mettagaa kOta kOstunnaayi