Showing posts with label కల. Show all posts
Showing posts with label కల. Show all posts

Saturday, May 30, 2009

తనెళ్ళిపోయింది..

తనెళ్ళిపోయింది..

ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..

కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..

అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..

Wednesday, April 15, 2009

కల(ల )త నిద్ర..


చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు

అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి

ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..

అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...

Monday, February 9, 2009

పాల మనసు

కలల సాగరాలన్నీ కలియ తిరిగి,
కంటి పల్లకీలో - రెప్పల రెక్కలార్చుకుంటూ,
చెక్కిళ్ళపై వాలిన ఆశ విహంగాలు,
అలిసి, పెదవి తెరల వెనక విశ్రమిస్తున్నాయి
ఒంటి కంటిన ఉప్పులు కడుక్కుంటున్నాయి
ఆ ఉప్పు తగిలిన పాల మనసు విరిగింది
ఆ శబ్దానికి అవి, తిరిగి పయన మయ్యాయి.. కవితలా !!

=======================


kalala saagaraalannii kaliya tirigi,
kanTi pallakiilO - reppala rekkalaarcukunTuu,
cekkiLLapai vaalina aaSa vihangaalu,
alisi, pedavi terala venaka viSramistunnaayi
onTi kanTina uppulu kaDukkunTunnaayi
aa uppu tagilina paala manasu virigindi
aa Sabdaaniki avi, tirigi payana mayyaayi kavitalaa

Wednesday, January 21, 2009

జ్ఞాపకం

నా గారాల పట్టి ఈరోజు ఎందుకో
గతంలో నుండి దోబూచు లాడుతుంది
కలల బంధనాలు తెంచుకుని
కవ్విస్తూ వాస్తవంలో తిరుగాడుతుంది
పట్టి బంధించలేని నిస్సహాయత
తన వెనకనే తిరుగుతూ వెక్కిరిస్తుంది

తను అందంగా ఆనందంగా తిరిగుతూ నవ్వించినా కవ్వించినా
అది నిజం కాదన్న నిజం ఆశ దీపాన్ని ఆర్పేందుకు చూసే చిరుగాలిలా
చెంపలని తడుతుంది చెమ్మ ముసుగు తనని తిరిగి దాచేస్తుంది

రంగుల అబద్ధాల గదుల్లో నేను కొట్టిన కేరింతలు
నిజం తెరలు తగిలి కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి,
గుండె గోడల్లో లయలుగా ఇరుక్కుపోతున్నాయి

ఎందుకో ఈరోజు నా చిన్నారి గతం తలుపులు తీసి
మనసు ముంగిట్లో కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది

తిరిగి తెరలవెనక ఆమె మాయమవుతుంది
అబద్దంగానైనా ఆశ ఆనందంగా ఆవులిస్తుంది
ఆదమరుస్తుంది

Friday, November 28, 2008

గతం ఒడ్డు

గతం ఒడ్డున
ఏకాంతం తో నా నడక

ఏకాంతం ఎంత భారమో
అడుగుల గుర్తులు
లోతుగా కనిపిస్తున్నాయి

గతం నుండి కలలు
అలలై కాళ్ళు తడుపుతున్నాయి
ఆ గుర్తుల్ని తనలో
ఆబగా కలుపుకుంటున్నాయి

ప్రస్తుతం కాళ్ళ క్రిందినించి
కరిగి జారిపోతుంది
ఒక్క క్షణం ఆగుతాను
కాలం వేడికి కాళ్ళు ఆరిపోతాయి
కల కనుమరుగవుతుంది
కాళ్ళక్రింద మరో ప్రస్తుతం

నా అస్థిత్వపు గురుతులు
వెనక ఒదులుకుంటూ
ఆరే కాళ్ళను చూసుకుంటూ
ఏకాంతం తో నా నడక
తిరిగి మొదలవుతుంది

కలలు ఆగవు
కాలం ఆగదు
కాళ్ళూఅగవు
ఏది ఆగినా
రుణం తీరినట్లే


gatam oDDuna
Ekaantam tO naa naDaka

Ekaantam enta bhaaramO
aDugula gurtulu
lOtugaa kanipistunnaayi

gatam nunDi kalalu
alalai kaaLLu taDuputunnaayi
aa gurtulni tanalO
aabagaa kalupukunTunnaayi

prastutam kaaLLa krindininci
karigi jaaripOtundi
okka kshaNam aagutaanu
kaalam vEDiki kaaLLu aaripOtaayi
kala kanumarugavutundi
kaaLLakrinda marO prastutam

naa asthitvapu gurutulu
venaka odulukunTuu
aarE kaaLLanu cuusukunTuu
Ekaantam tO naa naDaka
tirigi modalavutundi

kalalu aagavu
kaalam aagadu
kaaLLuaagavu
Edi aaginaa
ruNam teerinaTlE

Monday, November 24, 2008

ఈ కలలు ఎవడు కనిపెట్టాడండీ బాబూ !!!!!!

కలలు కళ్ళ గూళ్ళను వదిలి,
చెదిరి చెంపలు చెమర్చే కంటే
విరిగి వేదన సమకూర్చే కంటే
విసిగి వేకువనే ఉడాయించే కంటే

చెప్పినట్టు వింటూ
మన చెంతనే వుంటూ

అందుబాటు ధరల్లో అంగట్లోనో
ఇంటి పెరటి చెట్టు కొమ్మల్లోనో
ఒదిగి ఓ మూల బోనుల్లోనో
జారి ముంజేతి గుప్పెట్లోనో

దొరికితే ఎంత బాగుండు

కావలిసిన కల కంటికద్దుకోవచ్చు
ఎప్పుడూ సంతోషంగా ఉండిపోవచ్చు
అందమైన దాన్ని ఆత్రంగా దాచుకోవచ్చు
మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు

ఒద్దంటే విరిచి పారేయొచ్చు
ఎవరికైనా అరువిచూకోవచ్చు
బహుమతిగా ప్రకటించుకోవచ్చు
బూజు పడితే దులిపి వాడుకోవచ్చు

వెధవ కలలు
రాకుండా పోవు
కావలిసినవి
వచ్చి ఉండిపోవు

ఈ కలలు ఎవడు కనిపెట్టాడండీ బాబూ !!!!!!!!!!



kalalu kaLLa guuLLanu vadili,
cediri cempalu cemarcE kanTE
virigi vEdana samakuurcE kanTE
visigi vEkuvanE uDaayincE kanTE

ceppinaTTu vinTuu
mana centanE vunTuu

andubaaTu dharallO angaTlOnO
inTi peraTi ceTTu kommallOnO
odigi O muula bOnullOnO
jaari munjEti guppeTlOnO

dorikitE enta baagunDu

kaavalisina kala kanTikaddukOvaccu
eppuDuu santOshamgaa unDipOvaccu
andamaina daanni aatramgaa daacukOvaccu
maLLee maLLee tirigi vaaDukOvaccu

oddanTE virici paarEyoccu
evarikainaa aruvicuukOvaccu
bahumatigaa prakaTincukOvaccu
buuju paDitE dulipi vaaDukOvaccu

vedhava kalalu
raakunDaa pOvu
kaavalisinavi
vacci unDipOvu

ee kalalu evaDu kanipeTTaaDanDii baabuu !!!!!!!!!!