Showing posts with label ఎదురు చూపు. Show all posts
Showing posts with label ఎదురు చూపు. Show all posts

Thursday, October 21, 2010

ఈ ఉదయం


బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
రంగుల ప్రపంచం
ఓ లోయ సరిహద్దుల్లో అంతమయింది

రెండు సూర్యుళ్ళ ఉదయంతో
సగం కాలిన రాత్రి
ముళ్ళ కంప మీద
అలానే కరుగిపోయింది.

చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి
జారిపోతున్న చీకట్లకు
తనువు చాలించిన తుంపర్లు
తెరలవుతున్నా..

చల్లగా వీచిన తెల్లపదాల తావి
పూల తోటలోకి ..దారి చూపింది.

Tuesday, August 24, 2010

మబ్బు



ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..

ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం

ఈ లోపే మరో అంకం..

పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం

ఈ మబ్బు విడవాలి

Tuesday, November 17, 2009

తోడు



గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..

మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..

జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..

తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..

ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..

బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.

నీతోడు పొందాలనుంది.

Wednesday, August 26, 2009

పిలుపు


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
శవం బ్రతికినట్టనిపించింది..
శిల కరిగినట్టనిపించింది.

Tuesday, August 25, 2009

కలవని చూపులు


చూపులు కలిసే లోపే
తెరలు దిగిపోతాయి..
వంతెనలు కరిగి పోతాయి..
ఊసులు వెనుతిరిగి వస్తాయి..

మరో ప్రయత్నం
మరింత బలంగా..
అసంకల్పితంగా..
మొదలవుతుంది..
తీరం చేరే అలల్లా..

ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?

తలలు తిప్పుకున్న ప్రతిసారీ
గుండెలు పిండే అనుభూతి..
నన్ను చూస్తున్నావన్న
అదో తృప్తి.

అదే ఇంధనంగా..
మళ్ళీ రెప్పలు లేస్తాయి
తిరుగుతున్న తలనాపడానికో ..
జారుతున్న రెప్పలనడగడానికో ..

జారిపోయిన అల..
మరో సారి తీరం వైపు ఎగురుతుంది.
తిరిగి మరలడానికి.

Monday, August 10, 2009

ఎదురు జల్లు...


అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-

చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-

కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-

ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-

ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-

ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-

చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.

Wednesday, July 29, 2009

మనగలను


ఆ కళ్ళలోకి చూసినప్పుడల్లా..
ఓ వింత అనుభూతి..
ఈ తరుణం జీవితాంతం
నిలిచి పోగలదన్న ఆశ

మరో అనుభవం ఏదీ
దీనికి సరిరాదు. అసలు
అటువంటిది మరొకటి
ఉండదేమో ...

నువ్వు నాకు తెలుసన్న
పరిధిలోనే.. ఈ ఆనందమంతా..
ఐనా అదిచాలు.. అంతకన్నా
అడిగేదేమీలేదు.. అడగలేను.

గుండెనోడిపోయిన మనిషిని
అందులో నువ్వు నిండి ఉన్నావని
ఎలా చెప్పేది ? మన గలనన్న
మాటనెలా ఇచ్చేది ?


(కనుషి బ్లాగు రచయిత వంశీ గారికి కృతజ్ఞతలతో )

Tuesday, July 28, 2009

కవితా శకలం


చూపులు కలిసిన ప్రతిసారీ
పెగలని పదాలు
పెదవుల మాటునే
కరిగిపోతున్నాయి..
పువ్వులు పూస్తున్నాయి..

జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి..

నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !

నిప్పును మ్రింగి
వెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...

నీక్కావల్సినదానిని
మరో సారి చెప్పనీ..
నేను నిన్ను మరచాను !!

నిజమే.. నిన్ను నేను మరచాను..
కానీ... నువ్వే !!.... ప్రతిక్షణం..
ప్రతిఒక్క క్షణం.. గుర్తొస్తున్నావు ..

కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో !!

Friday, July 24, 2009

నాకూ మరణం కావాలి !!


మెరిపించిన కనులను
పెదవి విరుపులు
మరుగుచేస్తున్నాయి..
ఐనా.. ఈ తావు వీడలేను


నేను..
నిశీధిలో కలిసిన
మూగ నవ్వును ..
తడి స్పర్శ తెలియని
తపన జీవిని ..
ఏ గంధమూ లేని
మనసుగంధాన్ని..

రాలిన ప్రతి పువ్వూ
విధి విదిల్చిన రంగువే
అంటూ దెప్పుతుంది.
చివుక్కుమన్న ప్రాణం
చిన్నబోతుంది.

మంచు ముత్యాలూ
తేనెటీగలూ
కొప్పు శిఖరాలూ
కోవెల మెట్లూ
అన్నీ నా కలల ప్రపంచంలో ..
కరగని కధలే..

అలంకారానికీ కొరగాక
ఆనందాలకూ పనికిరాక
చావుకీ దూరంగా
ఎందుకీ బ్రతుకు? ఎవరికోసం.

ఆ నవ్వు.. ఆ స్పర్శ..
ఆ మమత.. ఆ ఆనందం..
నాకూ కావాలి.

మరుజన్మ కైనా.. కానీ
ప్స్చ్‌ .. మరణమూ రాదుగా.
కాగితం పువ్వును నేను..
ఈ బ్రతుకింతే !!

త్రినాధ్ గారు తన బ్లాగులో ఆంగ్లంలో రాసిన కవిత నుండి స్పందన పొంది రాసిన కవిత ఇది. ఆకవితను ఇక్కడ http://musingsbytrinath.blogspot.com/2007/12/paper-flower-suggested-by-prashanth.html

Tuesday, June 9, 2009

మూగ ప్రేమ

(ఈ చిత్రము http://emsworth.wordpress.com/tag/willard-metcalf/ నుండి గ్రహించబడినది.)

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…


పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ .

Thursday, May 28, 2009

కళ్ళు


ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా బిగుసుకుంటాయి..

దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...

అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో స్థిమితాన్ని చెదర గొడతాయి..

అందుకే
గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే

ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ కవనం..
నా కళ్ళలోకి చూస్తావు కదూ.. ?

Friday, April 24, 2009

నీ సహజన్మి !


కవలలం ..నిజమే.. కలిసి
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
ఊహతెలిసే కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
నా మానాన నన్నొదిలేశావు..

స్థితిగతులు మారి, నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.

నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...

నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?

నీ రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?

విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. !

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
నీ సహజన్మి !

ఈ కవిత ఆవకాయ.కాం లో పంచుకున్నది.
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=1513&pageNo=౦

Wednesday, April 22, 2009

విలవిలలాడేం లాభం ?


విరిగిన బంధం విలువెరిగి
చెంపల గీతలెన్ని తుడిచినా
ముడులు బిగవవు.

పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.

వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.

జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయమారదు.

అందని కోర్కెల తీపెరిగి
ఎంతో కాలం ప్రాకులాడినా
అంత మగుపడదు.

అంతా వీడిన ఆవల
విలవిలలాడేం లాభం ?

Wednesday, April 15, 2009

కల(ల )త నిద్ర..


చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు

అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి

ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..

అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...

Wednesday, March 18, 2009

కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు





కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
ప్రక్కన నక్కిన పిశాచిమూకలు .

తేనెలు పూసిన నెత్తురు కత్తులు
జిత్తులు నిండిన అత్తరు మూటలు ..
నేతలు.. మన నేతలు ... .. 

దేశపు భవితను అడుసులొ తొక్కి
వేదన బ్రతుకులు మడుగులొ దించి
భూములు మింగి భోగాలందే ..! కుక్కలు .. నక్కలు.

ప్రణాలికలన్ని ప్రచురణ కొరకే
ప్రచారమంతా పరపతి కొరకే
ప్రజాపావులివి ప్రయోగపెలుకలు..! 

వాగ్దానాలకు హద్దుల్లేవు
వాగ్యుధ్ధాలకు అదుపుల్లేవు
అశ్లీలమశుధ్ధమసభ్య చేష్టల !  కుక్కలు .. నక్కలు.


నిజాయితీ అది తెలియని మాట
ప్రజాసేవ అది మరచిన మాట
జనాలు కొంటూ.. దేశాన్నమ్ముతూ..! కుక్కలు .. నక్కలు.

మగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై  పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..! 

తూర్పు కొండపై రుధిర జ్వాలలు
నింగిన చిందిన సింధూరాలు
పరుగులు తీసే చీకటి చేష్టలు..
సాక్ష్యాలివిగో.. సాక్ష్యాలివిగో.. ..! కుక్కలు .. నక్కలు.

ప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..! కుక్కలు .. నక్కలు.

Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...


Friday, February 27, 2009

ఆత్మీయతా నిరీక్షణలు..


స్నేహమిదని మభ్య పెట్టుకుంటూ
నువ్వు నేస్తమని .. సద్ది చెప్పుకుంటున్నా
గుండె గుడిలొ దాచుకుంటున్నా..

అందుకే..

నీకై వేచిన ఆ ప్రతి క్షణాలు..
నేచేసిన కాలక్షేపమనుకుంటున్నా ..
స్థంభించినా సమయంలో
రాలిని ఆరెండు చుక్కలు..
కాకతాళీయ మనుకుంటున్నా..

నువు కనపడనప్పుడు,
మెలికలు తిరిగిన మనసు మధనను
వెర్రి తనమని సమాధానపడుతూ..
బరువు పెరిగిన ఆ రెప్పల భారం
అనాలోచిత మనుకుంటున్నా..

నీ మాటకోసం పడె తపనను
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నా మాటల గారడీలో
నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పలు, రాలకుండా సంభాళిస్తున్నా..

ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని
ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదిస్తున్నా ..

గుండె గుడిలో వెలిసిన హితకు,
ఆహ్వాన సింహాసనాలు..
ఆడంబర ఆఘ్రాణలు..
ఆశ నివేదనలు..
ఆనంద నీరాజనాలు..
అశృ తర్పణాలు..
ఆకాంక్ష అంపకాలు ..
ఆత్మీయతా నిరీక్షణలు..




Friday, February 20, 2009

నిరీక్షణ


మగత నిద్ర సంధించిన
కలల అంప శయ్య మీద
ఆశ ములుకులు జవసత్వాలు జుర్రుతుంటే
జ్ఞాపక సహస్రాలను వల్లె వేస్తూ
ఆర్తిదాహం నాలుక ఎండగట్టుతుంటే
రేపటి మకరోదయం కోసం
ఓ బ్రతుకు భీష్ముడి నిరీక్షణ

కలల కంప ముద్దిడి నుదుటిన
సంధ్య సింధూరాలని పులుముతుంటే
ఆశ మేకుల ఆలింగనాలతో
చేతనలుడిగి తనువు నివ్వెరపోతే
శిలువ బంధాల ఉయ్యాలలో
రేపటి ప్రక్షాళితోదయం కోసం
ఓ బ్రతుకు జీససు నిరీక్షణ

Thursday, February 12, 2009

ఎన్నాళ్ళు ?

ఎన్నాళ్ళీ వెదుకులాట ఎన్నేళ్ళీ విరహ బాధ
ఆ మనిషిక దొరికేనా.. ఈ బ్రతుకిక పండేనా

మౌన వృక్షానికి పూసిన
భావ కుసుమ పరిమళాలు ఆఘ్రాణిస్తూ..
జ్ఞాపకాల గాలి వానలొ
కళ్ళ కిటికీ తుంపరలను ఆస్వాదిస్తూ... !! ఎన్నాళ్ళీ

కరిగే కాలం ఈ కళ్ళలో
దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..
మనసు కొలనులో ఇమడని
కలల నృత్యాల సోయగాలు తలుచుకుంటూ... !! ఎన్నాళ్ళీ

గుండె గోడల మధ్య
యదార్ధ అగాధాలను కొలుచుకుంటూ..
బ్రతుకు అంచుల మీద
ఆశ హంసల రధాన్ని నడుపుకుంటూ ... !! ఎన్నాళ్ళీ

====================================


ennaaLLii vedukulaaTa ennELLii viraha baadha
aa manishika dorikEnaa.. ii bratukika panDEnaa

mouna vRkshaaniki puusina
bhaava kusuma parimaLaalu aaghraaNistuu..
jnaapakaala gaali vaanalo
kaLLa kiTikii tumparalanu aasvaadistuu... !! ennaaLLii

karigE kaalam ii kaLLalO
daacina muLLa puulanErukunTuu..
manasu kolanulO imaDani
kalala nRtyaala sOyagaalu talucukunTuu... !! ennaaLLii

gunDe gODala madhya
yadaardha agaadhaalanu kolucukunTuu..
bratuku ancula miida
aaSa hamsala radhaanni naDupukunTuu ... !! ennaaLLii

Thursday, February 5, 2009

నా నిరీక్షణ -- నీకోసం

వెన్నెల పంచే వాడొస్తాడని, తన చాయలు వెదుకుతు దరికొస్తాడని,
మురుగు గుంటలో మెలికలు తిరిగిన
కలువ పువ్వులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

బీటలు వారిని నోటిని తెరిచీ, మోరని ఎత్తి నింగిని చూస్తూ
సుధలను నింపే మబ్బులకోసం, కంటి నీటినీ గాలికొదిలిన
బీడు భూమిలా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

తాదాత్మ్యత చెంది, తరుణము ఎరగక తలకిందులుగా తపస్సు చేస్తూ
తను ఎప్పటికీ జారనను కునే చూరు మీద చేరిన
వాన చినుకులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

vennela pancE vaaDostaaDani, tana chaayalu vedukutu darikostaaDani,
murugu gunTalO melikalu tirigina
kaluva puvvulaa undi naa niriikshaNa -- niikOsam

biiTalu vaarini nOTini tericii, mOrani etti ningini cuustuu
sudhalanu nimpE mabbulakOsam, kanTi niiTinii gaalikodilina
biiDu bhuumilaa undi naa niriikshaNa -- niikOsam

taadaatmyata cendi, taruNamu eragaka talakindulugaa tapassu cEstuu
tanu eppaTikii jaarananu kunE cuuru miida cErina
vaana cinukulaa undi naa niriikshaNa -- niikOsam