Showing posts with label ప్రకృతి. Show all posts
Showing posts with label ప్రకృతి. Show all posts

Wednesday, February 17, 2010

తృప్తి


తడి మెరుపులుల్లో
కరిగిన చూపులు ..
ఉరుము ధ్వనుల్లో
మమైకమైన మౌనం ..

జడివాన జల్లుల్లో..
జోరు గాలుల్లో..
వాడిన రెక్కమందారాలు

ఎర్రబారిన చందమామను
ఎదలోతుల్లో గుచ్చేసరికి
ఏడడుగులు నడిచిన తృప్తి
వెచ్చగా తాకింది.

గుండెలపైన మరో రాత్రి
బద్ధకంగా అస్తమించింది.

Tuesday, April 28, 2009

చెరువు గట్టు


కొమ్మలొదిలిన అల్లిబిల్లి ఊసులు
తనని చేరేలోపు ఒలికిన వయ్యారాలు,

చల్లని చెంపమీద, ఊరించి ఊరించి
తుమ్మెద, చటుక్కున ముద్దెడుతుంది
దొర్లిన సిగ్గు దొంతరలు..

మర్రి చేతుల కితకితలకు అలలు అలలుగ
రేగిన పులకింతలు..

ఎందరి ప్రేమ గెలుచుకుందో
నింగి కప్పుకుని నిండుగా.. నిలిచింది..

నన్ను చూస్తూ.. కరుగుతున్న
నా కాలాన్నీ కలుపుకుంటూ..

Saturday, April 25, 2009

తొలి ఝాము


నిన్న దాచిన రంగుల చిత్రాన్ని
రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది

మబ్బుల మగ్గాన్ని దూరాన ..
మిణుగురు దండు తరుముతోంది

పక్షి గుంపులు ఆకాశంలో
అక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి

పొగమంచు తెరలు తీసి ఉదయం
చెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది

జోడెద్దులు గంటల శబ్దంతో
వాటి అడుగులు కలుపుతున్నాయి

కొమ్మ సందుల్లోనుంచి కిరణాలు
గడ్డిమీద పచ్చరంగు పులుముతున్నాయి

Friday, April 17, 2009

పునరావృతం




ఎక్కడినించో...

అందాల్ని ఆనందాల్ని పోగుచేసుకొస్తుంది
కాలాన్ని తనతో తీసుకెళ్ళిపోతుంది..
గతితప్పుతాను

ఎన్నో ఊసులు రాగాలు నవ్వులు తెస్తుంది
భాష తనలో ఇముడ్చుకుంటుంది
మూగవోతాను

హొయలు, విరులు ఆశ్వాసనలు గుట్టలుపోస్తుంది
చేతన తనతో వెళ్ళిపోతుంది..
నిశ్చేష్టుడనవుతాను

కరకు ములుకులు మృదువుగాచేసి తెస్తుంది
మనసును తనతో తీసుకెళుతుంది
చిత్తరువవుతాను..

తను సాగుతూనే ఉంటుంది..
నన్ను చూస్తూనే ఉంటుంది..
అందాలు చిమ్ముతూనే ఉంటుంది..
కబుర్లు చెపుతూనే ఉంటుంది..
తన గమ్యాన్ని చేరుతూనే ఉంటుంది..

గతి తప్పి, మూగబోయి, నిశ్చేష్టుడనై
చిత్తరువులా.. నేనుండిపోతాను.

నేనూ... నా ఏకాంతమూ
ఒకరికి ఒకరై.. మరికొంచెంసేపు..
ఆ చిత్రంలో భాగమవుతాము
ప్రకృతి కన్ను మూస్తుంది..
చీకటి ఆవరిస్తుంది...

ఆ సెలయేటి గట్టున
కవిత పునరావృతమవుతుంది...

Monday, April 13, 2009

మూస బ్రతుకులు



దిక్కు దిమ్మెల మధ్య
జెట్టు విమానాలు కట్టిన
తెల్లాని వెలుగు తంతృల మీద
రంగు చీరలు ఆరేసిన చాకిరేవులాగా
కనబడుతున్నదా ఆకాశం ...

రేవులో ఎన్ని చీరలు వెలిశాయో
కారి కిందున్న కొలనూ రంగుల మయమయ్యింది

ప్రకృతి పగలంతా శ్రమపడి ఆరేసిన
రంగుల్ని, ఓ దొంగ, చెట్టుపుట్టలు , ఆకాశంతో సహా,
కాజేసి అటువైపు కుప్పలు పోస్తున్నాడు ..

వూరి జనం వీధి దీపాల కాంతిలో,
చమురు లాంతర్ల వెలుగులో,
పోయిన రంగుల్ని వెదుక్కుంటున్నారు..

నిరసనగా చెట్లపైన గువ్వపిట్టలన్నీ
కలిసికట్టుగా నినాదాలు చేస్తున్నాయి..

ఇవేవి పట్టనట్టు రంగు చీరల మూటగాడు
పడమటి కొండల వేనక్కి జారుకున్నాడు.

తెలిసిన దొంగ అనో, రేపొస్తాడులే అనో
అందరూ పట్టనట్టే.. ముసుగులు తన్నేందుకు
సిద్ధమవుతున్నారు.. మూస బ్రతుకుల్లో ఒదిగిపోతున్నారు

Thursday, April 9, 2009

పున్నమి రాత్రి


చల్లని ఈ పున్నమి రాత్రిన
ఆకాశంలో వెలిసిన తెల్ల జల్లెడ...
ఆవలి ప్రపంచపు సూర్యకాంతిని
వడగట్టి, మెరిసే రాళ్ళను పైనే ఉంచి
తెల్ల పిండిగా నేలపైకి కురిపిస్తుంది ..

తాళరాని తన వేడితనాన్ని
చల్లదనంగా మార్చి తపనతీర జల్లుతుంది..

చూడలేని తన వాడితన్నాని
నీడగా మార్చి నింగి నింపుతుంది ..

ఉడుకులెత్తే తన ఉసురుగాలుల్ని
నిద్దరొచ్చే లాగ చల్లగా ముంచుతుంది ..

పగ్గాలిరిగిన పగటి బ్రతుకుల్ని
పాపలా జేసి నిద్రలోకి దించుతుంది ..

హాయిగా..అమ్మ ఒడిలా..
చెలి ముద్దు తడిలా ..మరుమల్లె జడిలా..
సడి చేయక సాగే తెల్ల జల్లెడ,
మది నుండి మధుర సుధల్ని వంపుతూ..
అనంత దూరలకు.. సాగుతుంది...

Tuesday, April 7, 2009

ఆ వానకు అర్ధం ఉంది.




నా "వాన " కవితకు చాలా మంది స్పందించారు.. ధన్యవాదాలు.
ఆ కవితలోని మాటలు, ప్రకృతి అందాన్ని నా భావుకత జోడించి
రాసినట్లుగా మీరందరూ దాన్ని ఆస్వాదించారు.. అభినందించారు
ధన్యవాదాలు. కానీ...

మీరు గమనించారో లేదో.. ఆ కవిత లేబుళ్ళలో ఒకటి, తత్వం.
ఆ కోణంలోనుంచి ఈ కవితను ఎవరూ ఆస్వాదించలేదని నా అభిప్రాయం
ఎందుకంటే వచ్చిన వ్యాక్యలలో అది లేదు కాబట్టి. అదికూడా తెలిస్తే (కవితలోని
మాధుర్యం.. ఇంకా ఆనందింపజేస్తుందనిపించి)
ఈ వివరణ ఇస్తున్నాను...

ప్రధానంగా.. ఈ కవిత.. చాలా పోలికలతో నిండి ఉంది.. ఇదే కవితలోని కొన్ని
పదాలను మార్చి రాస్తున్నాను.. చూడండి... అవే పదాలు ఎందుకు వాడాను ?
వాటి తత్వం ఏమిటి ? వాటి నైజమేమిటి ? అన్న వి మీకే వదిలేస్తున్నాను.

అవధరించండి..


నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

కన్నీటి దారలతో,
వేదన గాలి పటాలు ఎగరేస్తూ ....... (అవి గాలి పటాలెందుకయ్యాయి ?)
బాధ చెక్కిళ్ళపై పరవళ్ళుతొక్కుతుండగా
వేడి నిశ్చ్వాసలు జగమంతా నింపుతుంది.. మనసు

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

నా ఒడిలో పడి (ఒడి అంటే ?)
మత్తుగా.. తావి లేని కన్నీరు (మరి రంగు రుచులున్నాయా ?)
పువ్వుల్లా చిందు తున్నాయి, బరువు కిరీటాలు దించుతున్నాయి (పువ్వుల్లా ఎందుకు ? కిరీటాలేమిటి ? )
ఒడిలో చేరి ఇంకి పోతున్నాయి.. మెల్లగ.. కన్నీళ్ళు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

జారే కన్నీటి ధారల్లో
దోబూచులాడుతూ.. బాహ్యరూపం లేదుగనక
నీటి ఆసరాతో వ్యక్త మవుతున్నాయి.. (మరి చిన్న పిల్లల్లా ఎందుకన్నాను ?)
తామెక్కడున్నాయో చాటుతున్నాయి.. మనో భావాలు.


ఇప్పటికే మీతలలు వేడెక్కి ఉంటాయి. ఇక విరమిస్తాను..

Monday, April 6, 2009

వాన



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

Wednesday, March 25, 2009

రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.


సంధ్య సాయంత్రం ఎప్పటిలానే
పండు భానుడ్ని భుజానేసుకుని
పడమటి దిక్కుగా ప్రయాణమయ్యింది.

దారిలో చూడలేక చీకటి చేతుల్లో ముఖం
దాచుకుంటూ పొద్దు తిరుగుడు పల్లె జనాలు
బాధగా వన్నె తగ్గి తలలు వాల్చారు.

దూరపు కొండలన్నీ, ఈ రోజు, నిన్నలానే
బంగారు జరీ అంచు నల్ల దుప్పటి
కాళ్ళమీదనుంచి ముఖం పైకి లాక్కున్నాయి.

కన్నెర్ర జేసిన నింగి నుదిటిన స్వేద బిందువులు
మిణుకు మిణుకు మంటే, నోరెళ్ళబెట్టిన
చంద్రుడు పాలిపోయి సగం ముఖం దాచుకున్నాడు.

రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.

Tuesday, March 17, 2009

వాన


నిండు చూలాళ్ళల నల్ల మబ్బులు 
మెల్లగా.. మండుటెండలో ..
చల్ల గాలి చేయినందుకుని.. 
సిగ్గు మెరుపుల సాన్నిధ్యంలో,
మూల్గు ఉరుముల నేపధ్యంలో..
మగ్గిన పండు సూరీడ్ని చంకనెత్తుకుని 
నింగి నిండా అల్లుకుంటూ..
మా ఊరొచ్చాయి.

పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడై
చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు.

చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
తలలనూపుతూ పూల రెమ్మలూ
గంధాలొలికే మెల్ల గాలులూ
కిలకిలలాడుతు పక్షి గుంపులు..
తాకాలంటూ తహతహలాడే నేల కణాలూ..
అలలను రేపిన పంట పొలాలు..
పిలవక వచ్చిన తూనీగ బంధువులు..

మబ్బుల ప్రసవం కోసం 
ప్రకృతి రంగం సిద్ధం చేసింది.

ఆహ్వానించే పిల్లల నోళ్ళు..
ఆహ్లాదంగా ఎగిరే తువ్వాయి
వింజామరలతొ నెమళ్ళ నాట్యం..
శుభాన్ని పలుకుతు గిత్తల గంటలు..
చల్లగ జారే  బిడ్డల కోసం
మా ఊరూ రంగం సిద్దం చేసింది.

అందరు సిద్ధం అవడం చూసి..
నింగిన రంగుల జెండా ఎగిరే సరికి..

తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మబ్బుల లాస్యం
ఫెళ ఫెళ లాడుతు ఉరుముల జోస్యం
తకధిమి తకధిమి ప్రకృతి నాట్యం..

Saturday, March 14, 2009

రంగు రంగుల భావాలు


వసంతుడు చిటారు కొమ్మన
పచ్చ జెండా ఎగరేశాడు..
చెట్టెక్కడానికి ఇంతసేపు పట్టిందా ?

ఎక్కడో సరికొత్త రంగుల
ప్రపంచం దిద్దినట్టున్నాడు
పెరట్లో కుంచే విదిలించాడు!! దేవుడు.

చెట్లూ నాతో హోలీ ఆడుతున్నాయి
కడిగినా పోని రంగులు.
నా కళ్ళకద్దు తున్నాయి.

రంగు రంగుల నవ్వులు..
ఆ శబ్దాన్ని.. మధురంగా.. తుమ్మెదలు
దాచుకుంటున్నాయి.. రేపటికోసం.

చుప్పనాతి రెప్ప
అన్ని రంగులనీ...చటుక్కని.. నల్లగా..
క్షణంలో మారుస్తుంది..

ఏంటో మరి.. అన్నీ పచ్చగా
కనిపిస్తున్నాయి...
మనసుకి వసంతమొచ్చినట్టుంది.

పంజరంలో కోకిలకి, బోలెడు
మావి చిగురు పెట్టాను.. కూయలేదు
వదిలేశా ... పాడుతూ వెళ్ళిపోయింది.

పెద్ద పన్నీరు బుడ్డిలో
నడుస్తున్నట్టుంది.. ఒకే దాంట్లో
ఇన్ని గంధాలు ఎలా అమిరాయి ?

తెల్లారే సరికి కొమ్మల చివర
రంగు తూటాలు పేలాయి
శబ్దానికి వసంతుడు మేల్కొన్నాడు

పడమర ఓ గంట కోల్పోయింది..
తూర్పు సంబరాల్లో ముణిగింది
వసంతుడే సాక్షి

మన బ్రతుకులో లేని రంగులు
బయటనుంచి కొనుక్కొచ్చి
జనాల మీద విసిరి మురుస్తున్నం

తన సంకెళ్ళు తెంచుకుని
దొరికిన రంగులన్ని మోసుకుంటూ
తోటంతా జల్లుతుంది. సీతాకోకచిలుక

పువ్వుల ప్రేమ సందేశం
తుమ్మెదలు తీసుకెళ్తున్నాయి
ఎన్ని సఫల మవుతాయో ?

రంగు రంగు లతలు పెనవేసుకునేసరికి
పచ్చ గడ్డాలు పెరిగిన
ఋషుల తపస్సు భంగమయ్యింది


Wednesday, March 4, 2009

నల్లాకాశం




కన్న కలలీడేరుతాయని తెల్లవారే ఘడియ లాయెని
తల పాపట సింధూరాలద్దగ దినకరుడొచ్చు వేళాయెనని !!

నల్ల నింగి, వెన్నెల వెలుగులో
చల్ల చంద్రుని అద్దం ముందు
మబ్బు తెరల వెనక సద్దుచేయక
చుక్కల మెరుగులద్దు కుంటూ
సోయగాలు సరిదిద్దు కుంటుంది ! .. కన్న ...

రవి ఎరుగని తన అందాలను
కలువ కన్నుల ప్రాంగణంలో,
అల్లలాడే నల్ల కురులతొ,
పెళ్ళి సిగ్గులు మొగ్గ తొడగగ
చల్ల గాలులు సలుపు తుంది ! .. కన్న ...

తూర్పు కొండపై చూపు నిలిపి
ఓర్పు తనలో సడలు తున్నా
రేపటుదయపు ఘడియకోసం
రగులే ఆశమంటలు సాక్షిజేసి
ఎదురు చూపుల పోగులేస్తుంది ! .. కన్న ...

నా గుండెల్లో గిలిగింతెడుతూ
చుట్టు తిరుగుతూ గారం పోతూ
పాట కట్టమని మారం చేస్తూ
ఆశగ చూస్తూ నిలిచిందా నల్లాకాశం ! .. కన్న ...

Tuesday, February 24, 2009

వాన వెలిసిన ఉదయం


నల్ల మబ్బుల చిత్తడి ముసుగులోనుంచి
ఈ ' రోజు ', ఉదయాన్నే బద్ధకంగా నిద్ర లేచి
కిటికీలోనుంచి బయటికెళ్ళింది. చూస్తే...

చిరుగాలులు చల్లని వేళ్ళతో తడిసి చెదిరిన
చెట్ల రెమ్మల ముంగురలను సున్నితంగా సద్దుతున్నయి

రాత్రి కొమ్మల మీద పేలిన రంగు గుబ్బలు ఇంకా
తమ గుండెల్లో నీళ్ళు తోడి పోస్తున్నాయి
సొగసు తుంపరలు తమనిండా నింపుకుంటున్నాయి.

చినుకులు పెట్టిన ముద్దులకు ఇంకా సిగ్గులు చిమడక
ప్రకృతి సిగ్గులొలుకుతూ తల దించుకునే
తన సుందర సోయగాల్ని ఆరవేస్తుంది.

తడి రెక్కలు టపటప కొడుతూ నీరెండలో
పక్షులు తమను తామే ఆరేసుకుంటున్నాయి
ముక్కుతో తమ పమిటలు సద్దు కుంటున్నాయి.

రోడ్డు మీద విరిగి పడ్డ ఆకాశం పెంకుల్లో
రెండుకాళ్ళ జింక పిల్లలు గంతులేస్తున్నాయి
నేల గంధాన్ని తమపైన చల్లుకుంటున్నాయి.

పడక్కుర్చీలో తాత ముఖం మడతల్లో దాగిన
తన బాల్యం, బయట పిల్లల్లో పరకాయ ప్రవేశం
చేసి తనని మురిపిస్తోంది. ముసి ముసి నవ్వులు తెప్పిస్తొంది.

నెమళ్ళు పురివిప్పి విసిరిన వలలో అందరి చూపులు
చిక్కి జగతి మరిపిస్తున్నాయి, అవి విసిరిన రంగుల్లో
ప్రకృతి పులకిస్తోంది, గర్వంలో నెమలి ఓళ్ళు జలదరిస్తొంది.

గూటిలోనుంచి బయటపడి రంగులద్దు కున్న
సీతాకోక చిలుకల్లా.. గుండె నిండిన ఆనందం
కాళ్ళు తడుపుతుంది, చిందిన ఆనందపు చిందులు
పరిసరాలని ప్రక్షాళితం చేస్తున్నాయి

చూపరుల ఊహలకు అనుగుణంగా వాటి రూపాన్ని
అవే మార్చుకుంటూ.. మరో చోట అందాలు పండించేందుకు
మబ్బులు వలస వెళుతూ. వీడ్కోలు చెపుతున్నాయి.

దిగులు నిండిన 'రోజు ' మండుతూ లోకాన్ని ఎండగట్టింది.
మళ్ళీ ఎప్పుడన్నట్టు ఎదురు చూస్తూ నిలిచింది.

Saturday, February 21, 2009

చెరువు


నింగి మబ్బులు కప్పుకుని దాలి గుంటలో పిల్లిలా ఒదిగి
ప్రశాంతంగా పడుకున్న ఆ చెరువు చూస్తే అందరికీ అక్కసే

ఇటు గట్టున మర్రి చెట్టు
ఊడ చేతులు దూర్చి కితకిత లెడుతుంది
కాళ్ళనందులో దించి నీళ్ళు తాగుతుంది
ఒళ్ళు మండిన చెరువు ఒడ్డు తడుపుతుంది.

అటు గట్టున పారిజాతాల చెట్టు
పువ్వులిసిరి సరసాలాడుతుంది
పరవశపు గుండ్రాలు తెగ రేపుతుంది
నచ్చని చెరువు దాని బింబాన్ని పట్టేసి నలిపేస్తుంది

ఇటుపక్క చేరిన పనిలేని పిల్లాడు
పలక రాళ్ళను తీసి విసురు తున్నాడు
వాటి కప్ప గంతులు చూసి ఎగురుతున్నాదు
వాడి కేమి తెలుసు? తగదన్న చెరువు దాన్ని తిరిగి విసిరిందని ?

వీస్తున్న గాలికీ అదను దొరికినట్టుంది
చెరువు కప్పుకున్న ముసుగు లాగేసింది
కోపమొచ్చిన చెరువు, ప్రకృతి అంతా ఒడ్డు పక్కన కట్టేసి
తన మధ్యలో నీలాకాశాన్ని, సూర్యుడిని పట్టి బంధించి
తెగ ఊపి కసి తీర్చుకుంటుంది

Tuesday, October 21, 2008

మా ఇంట్లో చెట్లు

నునులేత ఆకులతొ తొలివాన చినుక్కుల్లో
తడిసి ఆరిన తనువులతో స్వచ్చమయ్యేవి
ఆకు పచ్చని రంగు ఆసాంతము తొడిగేసి
పడుచు ప్రేయసి లాగ పలకరించేవి

బోసి నవ్వులలాగ పూలెన్నొ విరబూసి
మనసుల్ని హాయిలో ఊపివేసేవి
సంధ్య రంగులు ఎన్నొ అరువడిగి తెచ్చేసి
పెద్ద ముత్తయిదువల్లె ఎదురు వచ్చేవి

రెక్కలొచ్చిన గుడ్డు తనదారిగొన్నాట్టు
పెళ్ళిచేసిన బిడ్డ అత్తిల్లు జనినట్లు
ఎండినాకులు నేడు రాలుతున్నాయి
వివశులై ఆ చెట్లు మానులౌతున్నాయి

నగ్నంగ నిలుచుండి తపియించె మునిలాగ
వసంతమెపుడని నేడు ఎదురుచూస్తున్నాయి
తమ బాధ నాతోటి చెప్పుకుంటున్నాయి
నా గుండె మెత్తగా కోత కోస్తున్నాయి !!

nunulEta aakulato tolivaana cinukkullO
taDisi aarina tanuvulatO swaccamayyEvi
aaku paccani rangu aasaantamu toDigEsi
paDucu prEyasi laaga palakarincEvi

bOsi navvulalaaga poolenno virabuusi
manasulni haayilO uupivEsEvi
sandhya rangulu enno aruvaDigi teccEsi
pedda muttayiduvalle eduru vaccEvi

rekkaloccina guDDu tanadaarigonnaaTTu
peLLicEsina biDDa attillu janinaTlu
enDinaakulu nEDu raalutunnaayi
vivaSulai aa ceTlu maanuloutunnaayi

nagnamga nilucunDi tapiyince munilaaga
vasantamepuDani nEDu edurucuustunnayi
tama baadha naatOTi ceppukunTunnaayi
naa gunDe mettagaa kOta kOstunnaayi