Tuesday, March 31, 2009

నీదీ ఓ బ్రతుకేనా ?


నీదీ ఓ బ్రతుకేనా
ముఖాన అచ్చేసిన అవే
పన్నెండు ఘటనలేగా..
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా ?

ఐనా గడిచిన ప్రతి ఘటననీ
గర్వంగా గంటకొట్టి మరీ చాటిస్తావ్‌
చీకటి వెలుగులయి సమానంగా సాధిస్తావ్‌

ఎన్ని బ్రతుకుల వర్తమానలని
మింగి గతింప చేస్తావ్‌ ? విగత జీవుల్ని చేస్తావ్‌ ?
ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావు?
ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్‌ ?
నీదీ ఓ బ్రతుకేనా ?

కర్కశ మైన నీ ముళ్ళ ముఖాన్ని
గోడకు శిలువేసినా..
సుడిగుండంలా తిరుగుతూ
ప్రపంచాన్ని కబళిస్తావు ..

అవిశ్రాంతంగా.. అందరి బ్రతుకు వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు
నీదీ ఓ బ్రతుకేనా .. ?

నువు దాటిపోయేదాకా
నీ ముఖన్నెందుకు దాటేస్తావు ?
వస్తున్న అలికిడినీ ఎందుకు దాచేస్తావ్‌ ?
పిరికి పంద ... ఎదురొడ్డి ఓడిస్తామనేగా ..?
నీదీ ఓ బ్రతుకేనా ?