Showing posts with label వాన. Show all posts
Showing posts with label వాన. Show all posts

Tuesday, July 13, 2010

ప్రకృతి


ఆకు నీడన చేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు...
నింపుకున్న గుంటలు..
నవ్వులు చిందిస్తూ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా..
గరిక కొనలమీదుగా
ఉదయిస్తూ..

ప్రతికిరణమూ
రంగులద్దుతూ..
మనసునద్దం పడుతూ..
ప్రకృతి.

పొద్దులో చూడండి http://poddu.net/?p=4833

Thursday, April 22, 2010

వాన


ఒకటే వాన
బరువుతగ్గిన ఆకాశం

చినుకుల మధ్యగా
ఆటలాడుతూ చిరుగాలి

గుప్పుమంటూ
గుంటలు నింపుకున్న నేల

తలదాచుకునే ఆరాటంలో
పడుచుదనం పట్టించుకోని పాఠం..
పల్లానికి పరుగెట్టి..

చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..
తాత చేతిపై జ్ఞాపకమవుతూ..

చూరుక్రిందా తడిసిన తలల
తలపుల్లో గుబులు ఒలకపోస్తూ..

ఒకటే వాన.

Thursday, September 10, 2009

వానా వానా...




నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది !!

ఈనెల ఈమాటలో http://www.eemaata.com/em/issues/200909/1462.html


Tuesday, April 7, 2009

ఆ వానకు అర్ధం ఉంది.




నా "వాన " కవితకు చాలా మంది స్పందించారు.. ధన్యవాదాలు.
ఆ కవితలోని మాటలు, ప్రకృతి అందాన్ని నా భావుకత జోడించి
రాసినట్లుగా మీరందరూ దాన్ని ఆస్వాదించారు.. అభినందించారు
ధన్యవాదాలు. కానీ...

మీరు గమనించారో లేదో.. ఆ కవిత లేబుళ్ళలో ఒకటి, తత్వం.
ఆ కోణంలోనుంచి ఈ కవితను ఎవరూ ఆస్వాదించలేదని నా అభిప్రాయం
ఎందుకంటే వచ్చిన వ్యాక్యలలో అది లేదు కాబట్టి. అదికూడా తెలిస్తే (కవితలోని
మాధుర్యం.. ఇంకా ఆనందింపజేస్తుందనిపించి)
ఈ వివరణ ఇస్తున్నాను...

ప్రధానంగా.. ఈ కవిత.. చాలా పోలికలతో నిండి ఉంది.. ఇదే కవితలోని కొన్ని
పదాలను మార్చి రాస్తున్నాను.. చూడండి... అవే పదాలు ఎందుకు వాడాను ?
వాటి తత్వం ఏమిటి ? వాటి నైజమేమిటి ? అన్న వి మీకే వదిలేస్తున్నాను.

అవధరించండి..


నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

కన్నీటి దారలతో,
వేదన గాలి పటాలు ఎగరేస్తూ ....... (అవి గాలి పటాలెందుకయ్యాయి ?)
బాధ చెక్కిళ్ళపై పరవళ్ళుతొక్కుతుండగా
వేడి నిశ్చ్వాసలు జగమంతా నింపుతుంది.. మనసు

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

నా ఒడిలో పడి (ఒడి అంటే ?)
మత్తుగా.. తావి లేని కన్నీరు (మరి రంగు రుచులున్నాయా ?)
పువ్వుల్లా చిందు తున్నాయి, బరువు కిరీటాలు దించుతున్నాయి (పువ్వుల్లా ఎందుకు ? కిరీటాలేమిటి ? )
ఒడిలో చేరి ఇంకి పోతున్నాయి.. మెల్లగ.. కన్నీళ్ళు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

జారే కన్నీటి ధారల్లో
దోబూచులాడుతూ.. బాహ్యరూపం లేదుగనక
నీటి ఆసరాతో వ్యక్త మవుతున్నాయి.. (మరి చిన్న పిల్లల్లా ఎందుకన్నాను ?)
తామెక్కడున్నాయో చాటుతున్నాయి.. మనో భావాలు.


ఇప్పటికే మీతలలు వేడెక్కి ఉంటాయి. ఇక విరమిస్తాను..

Monday, April 6, 2009

వాన



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

Tuesday, March 17, 2009

వాన


నిండు చూలాళ్ళల నల్ల మబ్బులు 
మెల్లగా.. మండుటెండలో ..
చల్ల గాలి చేయినందుకుని.. 
సిగ్గు మెరుపుల సాన్నిధ్యంలో,
మూల్గు ఉరుముల నేపధ్యంలో..
మగ్గిన పండు సూరీడ్ని చంకనెత్తుకుని 
నింగి నిండా అల్లుకుంటూ..
మా ఊరొచ్చాయి.

పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడై
చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు.

చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
తలలనూపుతూ పూల రెమ్మలూ
గంధాలొలికే మెల్ల గాలులూ
కిలకిలలాడుతు పక్షి గుంపులు..
తాకాలంటూ తహతహలాడే నేల కణాలూ..
అలలను రేపిన పంట పొలాలు..
పిలవక వచ్చిన తూనీగ బంధువులు..

మబ్బుల ప్రసవం కోసం 
ప్రకృతి రంగం సిద్ధం చేసింది.

ఆహ్వానించే పిల్లల నోళ్ళు..
ఆహ్లాదంగా ఎగిరే తువ్వాయి
వింజామరలతొ నెమళ్ళ నాట్యం..
శుభాన్ని పలుకుతు గిత్తల గంటలు..
చల్లగ జారే  బిడ్డల కోసం
మా ఊరూ రంగం సిద్దం చేసింది.

అందరు సిద్ధం అవడం చూసి..
నింగిన రంగుల జెండా ఎగిరే సరికి..

తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మబ్బుల లాస్యం
ఫెళ ఫెళ లాడుతు ఉరుముల జోస్యం
తకధిమి తకధిమి ప్రకృతి నాట్యం..

Thursday, March 5, 2009

హాయి - 2


తోడుగున్న బాధలన్ని పలచనై పోయె నేడు
గోడుజెప్పి మబ్బులన్ని కరిగి జారిపోయి నట్టు
కలల్లోని కతలు అన్ని కవితలయ్యి కదిలె నేడు
వాన బోగ పిల్లగాళ్ళు నీళ్ళలోకి ఉరికి నట్టు

నింగిలోని చుక్కలన్ని కళ్ళలోన మెరిసె నేడు
దాలిగుంట తిరిగి రగిలి చీకటింట ఎగిరి నట్టు
ఇంద్ర ధనసు క్రింద దూకి పెదవిపైన నిలిచె నేడు
రంగు కుంచె సూరిగాడు తూర్పుదిక్కు విసిరి నట్టు

చెలియ నవ్వు మోము చూసి మనసు ఊయలూగె నేడు
గాలి ఈల పాట వింటు పంటచేలు ఊగి నట్టు

Tuesday, February 24, 2009

వాన వెలిసిన ఉదయం


నల్ల మబ్బుల చిత్తడి ముసుగులోనుంచి
ఈ ' రోజు ', ఉదయాన్నే బద్ధకంగా నిద్ర లేచి
కిటికీలోనుంచి బయటికెళ్ళింది. చూస్తే...

చిరుగాలులు చల్లని వేళ్ళతో తడిసి చెదిరిన
చెట్ల రెమ్మల ముంగురలను సున్నితంగా సద్దుతున్నయి

రాత్రి కొమ్మల మీద పేలిన రంగు గుబ్బలు ఇంకా
తమ గుండెల్లో నీళ్ళు తోడి పోస్తున్నాయి
సొగసు తుంపరలు తమనిండా నింపుకుంటున్నాయి.

చినుకులు పెట్టిన ముద్దులకు ఇంకా సిగ్గులు చిమడక
ప్రకృతి సిగ్గులొలుకుతూ తల దించుకునే
తన సుందర సోయగాల్ని ఆరవేస్తుంది.

తడి రెక్కలు టపటప కొడుతూ నీరెండలో
పక్షులు తమను తామే ఆరేసుకుంటున్నాయి
ముక్కుతో తమ పమిటలు సద్దు కుంటున్నాయి.

రోడ్డు మీద విరిగి పడ్డ ఆకాశం పెంకుల్లో
రెండుకాళ్ళ జింక పిల్లలు గంతులేస్తున్నాయి
నేల గంధాన్ని తమపైన చల్లుకుంటున్నాయి.

పడక్కుర్చీలో తాత ముఖం మడతల్లో దాగిన
తన బాల్యం, బయట పిల్లల్లో పరకాయ ప్రవేశం
చేసి తనని మురిపిస్తోంది. ముసి ముసి నవ్వులు తెప్పిస్తొంది.

నెమళ్ళు పురివిప్పి విసిరిన వలలో అందరి చూపులు
చిక్కి జగతి మరిపిస్తున్నాయి, అవి విసిరిన రంగుల్లో
ప్రకృతి పులకిస్తోంది, గర్వంలో నెమలి ఓళ్ళు జలదరిస్తొంది.

గూటిలోనుంచి బయటపడి రంగులద్దు కున్న
సీతాకోక చిలుకల్లా.. గుండె నిండిన ఆనందం
కాళ్ళు తడుపుతుంది, చిందిన ఆనందపు చిందులు
పరిసరాలని ప్రక్షాళితం చేస్తున్నాయి

చూపరుల ఊహలకు అనుగుణంగా వాటి రూపాన్ని
అవే మార్చుకుంటూ.. మరో చోట అందాలు పండించేందుకు
మబ్బులు వలస వెళుతూ. వీడ్కోలు చెపుతున్నాయి.

దిగులు నిండిన 'రోజు ' మండుతూ లోకాన్ని ఎండగట్టింది.
మళ్ళీ ఎప్పుడన్నట్టు ఎదురు చూస్తూ నిలిచింది.

Monday, February 16, 2009

చింకి పాత

పగ్గాలెరుగని మనసు మగ్గాలు
నేసిన ఆశ వస్త్రాలు..
వాటి మీద
ఊహల రంగులల్లు కున్నాను
కోర్కెల బొమ్మ లద్దుకున్నాను

ఓసారి,
చిరిగిన కలల మబ్బులు చిందించిన
చిరుజల్లులలో తడిసి వెలవెల బోతున్నాయి
నిట్టూర్పుల వేడికి ఆరిపోతున్నాయి ...

మరోసారి,
బ్రతుకు వేగానికి ఎగిరి
జ్ఞాపకాల కంపల్లో చిక్కి చిరుగుతున్నాయి
చింకి పాతల్లా చివరికి మిగిలి పోతున్నాయి..

ఐనా
పగ్గాలు బిగవవు, మగ్గాలు ఆగవు ..
చిరిగిన మబ్బులు ఆగవు
చింకి పాతలూ ఆగవు..


==========================================


paggaalerugani manasu maggalu
nEsina aaSa vastraalu..
vaaTi miida
uuhala rangulallu kunnaanu
kOrkela bomma laddukunnaanu

Osaari,
cirigina kalala mabbulu cindincina
cirujallulalO taDisi velavela bOtunnaayi
niTTuurpula vEDiki aaripOtunnaayi ...

marOsaari,
bratuku vEgaaniki egiri
jnaapakaala kampallO cikki cirugutunnaayi
cinki paatallaa civariki migili pOtunnaayi..

ainaa
paggaalu bigavavu, maggaalu aagavu ..
cirigina mabbulu aagavu
cinki paataluu aagavu..

Sunday, January 25, 2009

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు
వెన్న ముద్ద లెన్నో పూసె చెట్టు కొమ్మ లన్ని చూడు

వెన్నె లంత గుట్ట పోసి మిన్న కుండె నింగి రేడు
చల్ల దూది పింజ తోటి ఆట లాడె పిల్ల గాడు
అమ్మ చేతి చల్ది ముద్ద లోక మంత పెద్ద దయ్యె
నోట బెట్టి మింగ బోవ మాయ మయ్యె నేమి చెప్ప .. !! మబ్బు దిండు

వాడి బుగ్గ పూలు పూసె చేతి వేళ్ళు వంగి పోయె
ముక్కు ధార కారు డాయె నోటి పొగల ఆట లాయె
మంచు బంతి చేసి వాడు ఇళ్ళ పైకి రువ్వు డాయె
పిల్ల గుంపు లన్ని జేరి మంచు బొమ్మ చెక్కు డాయె .. !! మబ్బు దిండు

నేల బడ్డ వెన్నె లంత కాస్త కాస్త మాయ మైతె
చంటి గాడి కళ్ళ లోన పొర్లు కొచ్చె బాధ వాన
కారు ముక్కు పీల్చు కుంటు బుంగ మూతి పెట్టు కుంటు
ఎర్ర బుగ్గ మీద కారు వాడి గోడు చూస్తు ఉంటే ..

సంధ్య పొద్దు తోట లోన ఎర్ర మొగ్గ చెంప మీద
ముత్య మోటి వచ్చి నిల్చి ముద్దు పెట్ట మన్నట్టుండె ..!! మబ్బు దిండు

Friday, January 23, 2009

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని
పల్లె అంత సందడాయె చూడు దాని అందాన్ని

పురినిప్పి నెమలి నడిచె కురులిప్పి చెట్టులూగె
చుక్క పట్ట నోరుతెరిచి పిల్లలేమొ బయటకురికె
ఇంట బిడ్డ గుర్తు రాగ పరుగునొచ్చె పాల పిట్ట
నల్ల మబ్బు నింగిలోన సందడంత చూడవచ్చె !! చల్ల గాలి

విరగ బూసినప్పడాలు కోయు భామలక్కడ
సేదదీరు ఊరగాయ ఖైదుచేసిరిక్కడ
పంచెగుట్ట పొదివిపట్టి పిల్లగాని పరుగులు
గాదె మూతదొరకపోతె తాత చేయు చిందులు !! చల్ల గాలి

చినుకు లేమొ పందెమేసి ఒకటి ఒకటి నేల రాలె
చెంగు నెత్తి నెట్టుకుని పల్లె పడతి నాట్యమాడె
బసవ బండి దాన్నిచూసి తాళమేసె జోరులోన
ఆశపూసి రైతు నేడు మునిగిపోయె పాటలోన !! చల్ల గాలి

మడుగులోన గంతులేసి పిల్లగాళ్ళ ఆటలు
చూరు నుంచి నేల జారు వాననీటి నాట్యము
వెదురుపొదలు మొదలుపెట్టి ఈలనోటి పాటలు
నాట్లు వేయ రండి అంటు పోలిగాడి కేకలు !! చల్ల గాలి

తోకముడిచి వణికిపోతు చూరుకింద కుక్కలు
చెరువులోని బాతులెట్టె చెట్టుకింద గుంపులు
వంట ఇంట్లో పొయ్యి పక్క చేరిమూల్గె పిల్లి కూన
తనకేమీ పట్టనట్టు గానుగలోన తిరుగు ఎద్దు !! చల్ల గాలి

కప్పు పైకి పాకి పోయి రెల్లు గడ్డి కప్పేటోళ్ళు
నట్టింట్లో బిందెలోకి నీళ్ళు పట్టి పోసెటోళ్ళు
పార పట్టి తోటలోకి నీళ్ళ దారి పెట్టేటోళ్ళు
చుట్టగట్టి రచ్చబండ పిచ్చపాటి జెప్పేటోళ్ళు !!

చల్ల గాలి వెక్కిరించె హైటెక్కు జీవితాల్ని
అవ్వినేడు మరిచిపోయె పల్లె బ్రతుకు పరువాల్ని

పట్టణాల వీధి లోన నల్ల మట్టి తావి ఏది
కాంక్రీటు కొంపలోన రెల్లు గడ్డి వాసనేది
టీవి ముందు సోఫాలో రచ్చబండ చర్చలేవి
స్టీలుపొయ్యి మంటల్లో గాదె తిండి బలాలేవి !! చల్ల గాలి

Tuesday, December 9, 2008

చినుకులు

తెగనిండిన ఎర్ర బస్సులా
నల్ల మబ్బులు మెల్లగా నింగి కొచ్చాయి
మెరుపు దెబ్బకు మబ్బు చిరిగినట్టుంది, చినుకులు చిన్నగా కారుతున్నాయి

ఇంటిగంట విన్న స్కూలు పిల్లల్లా,
గోలగా పరుగులెడుతున్నాయి
ఉరుములా గొడవ ఆపమంటున్నాయి, చినుకులది లెక్క పెట్టకున్నాయి

కొన్ని మా చూరు ఎత్తుకు నిచ్చెనేసేసాయి
కప్పులో బొక్కంటూ గేలిచేసాయి
పడవచేసే పేపరెదక మన్నాయి, పకోడీలెయ్యమంటూ అమ్మనడుగుతున్నాయి

మేడమీద మిరపలు నప్పలేదేమో
రేకుమీదకి దూకి చిందులేస్తున్నాయి
నోరుతెరిచి నింగి చూస్తున్నాయి, కోపంగా పల్లాన్ని వెదుకుతున్నాయి

నేలతల్లినొదిలి ఎంతకాలమైందో
కన్నీళ్ళతో నేల తడిపేస్తున్నాయి
ప్రేమ గంధాలు ఒలుకుతున్నాయి, కౌగిట్లొకరిగి ఇంకుతున్నాయి

తండ్రి చెరువు కడకు పరుగులెడుతున్నాయి
తోడుగా నా పడవ తీసుకెళుతున్నాయి
ప్రేమల్ని మనకివి నేర్పుతున్నాయి, మనకున్న విలువల్ని చాటుతున్నాయి


teganinDina erra bassulaa
nalla mabbulu mellagaa ningi koccaayi
merupu debbaku mabbu ciriginaTTundi, cinukulu cinnagaa kaarutunnaayi

inTiganTa vinna skuulu pillallaa,
gOlagaa paruguleDutunnaayi
urumulaa goDava aapamanTunnaayi, cinukuladi lekka peTTakunnaayi

konni maa cuuru ettuku niccenEsEsaayi
kappulO bokkanTuu gElicEsaayi
paDavacEsE pEparedaka mannaayi, pakODiileyyamanTuu ammanaDugutunnaayi

mEDameeda mirapalu nappalEdEmO
rEkumeedaki duuki cindulEstunnaayi
nOruterici ningi cuustunnaayi, kOpamgaa pallaanni vedukutunnaayi

nElatallinodili entakaalamaindO
kanneeLLatO nEla taDipEstunnaayi
prEma gandhaalu olukutunnaayi, kougiTlokarigi inkutunnaayi

tanDri ceruvu kaDaku paruguleDutunnaayi
tODugaa naa paDava teesukeLutunnaayi
prEmalni manakivi nErputunnaayi, manakunna viluvalni caaTutunnaayi

Friday, November 28, 2008

వాన

మనసులో మాట ధైర్యం చేసుకుని
మెల్ల మెల్లగా పెదవుల దాకా
విముక్తి కోసం చేరే సరికి

కాలం కాల్వలో బ్రతుకు బల్లకట్టుమీద
వయసు అవతలి తీరం చేరిపోతుంది

కనుల కొలనులోనుండి మరో బిందువు
ఎప్పటిలానే ఆవిరవుతుంది

ఆ మాట కలల మబ్బుల్లోకి చేరిపోతుంది
జ్ఞాపకాల చల్లని గాలి తగిలి
మళ్ళీ కురవటానికి సిద్ధమవుతుంది

తలతడవని వాన అది
ఏ గొడుగూ ఆశ్రయమివ్వదు



manasulO maaTa
dhairyam cEsukuni
mella mellagaa pedavula daakaa
vimukti kOsam
cErE sariki

kaalam kaalvalO
bratuku ballakaTTumeeda
vayasu
avatali teeram
cEripOtundi

kanula kolanulOnunDi
marO binduvu
eppaTilaanE aaviravutundi

aa maaTa kalala
mabbullOki cEripOtundi
jnaapakaala
callani gaali tagili
maLLee kuravaTaaniki
siddhamavutundi

talataDavani vaana adi
E goDuguu aaSrayamivvadu