Showing posts with label ఏకాంతం. Show all posts
Showing posts with label ఏకాంతం. Show all posts

Monday, September 7, 2009

దొరకని ప్రేమ..


చిరు దీపపు వెలుతురులు
అటు వైపూ .... ఇటు వైపూ.

తక్కెడలోని బరువులు , అవిశ్రాంతంగా..
ముల్లును కదుపుతూనే ఉన్నాయి..

రెండు విల్లులు విడిచిన
ఒకటే బాణము..
తపనలు తెలియకేమో ..
తగల కుండా .. దూసుకు పోయింది.

జారి పడ్డ ఈకలు ఏరుకుని
రంగులో ముంచి
రంగరించుకుంటున్న నాకు,

కరిగిన రాత్రి,
రెల్లు గడ్డి మీద...
చల్లగా తగిలి
మేల్కొలిపింది.

Tuesday, August 25, 2009

ఏకాంతం




నీడనూ వదిలి
చీకట్లో.. ఒంటరిగా..
నిండిన దొప్పలతో..
నేనూ..

నిశ్శబ్దంలో..
మిణుగురులనేరుకుంటూ..
అలసి కీచురాళ్ళయిన
నా ఆలోచనలూ..

బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..
బందీలయ్యాము..

మెలకువొచ్చేసరికి
రంగులద్దుకున్న రాత్రి
నీడతోడిచ్చి ..
బండ మెడనగట్టి
దారి నడవమంది.

Tuesday, July 21, 2009

డైరీ


అస్థవ్యస్తం.. రణగొణధ్వనులు..
ఎపుడూ.. ఏదో వెదుకులాట ...

క్యాలికో ముసుగులో
ఆనాటి జీవితం..
విప్పారిన రెప్పలతో..వచ్చేసరికి..

చుట్టూ ప్రపంచం.. మాయమవుతూ..
బరువు శ్వాసనూ...బోలెడు నిశ్శబ్దాన్నీ
వదిలిపోయింది.

ఇంకి పోయిన ఇంకు మూటల్లోని
కలల దొంతరలు..
పుటల మధ్య రెక్కలై మిగిలిన
పువ్వు శిధిలాలు..
కవిత ముసుగులో ఒదిగిన
ఆశ ఖండాలు..
పిల్లలింకా పెట్టని నెమలి పించాలు...

మనసు మల్టీప్లెక్సుగా
మారిపోయింది.

తోడు రాలేని వసంతాలు...
ఆ తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.

Saturday, May 30, 2009

తనెళ్ళిపోయింది..

తనెళ్ళిపోయింది..

ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..

కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..

అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..

Friday, April 17, 2009

పునరావృతం




ఎక్కడినించో...

అందాల్ని ఆనందాల్ని పోగుచేసుకొస్తుంది
కాలాన్ని తనతో తీసుకెళ్ళిపోతుంది..
గతితప్పుతాను

ఎన్నో ఊసులు రాగాలు నవ్వులు తెస్తుంది
భాష తనలో ఇముడ్చుకుంటుంది
మూగవోతాను

హొయలు, విరులు ఆశ్వాసనలు గుట్టలుపోస్తుంది
చేతన తనతో వెళ్ళిపోతుంది..
నిశ్చేష్టుడనవుతాను

కరకు ములుకులు మృదువుగాచేసి తెస్తుంది
మనసును తనతో తీసుకెళుతుంది
చిత్తరువవుతాను..

తను సాగుతూనే ఉంటుంది..
నన్ను చూస్తూనే ఉంటుంది..
అందాలు చిమ్ముతూనే ఉంటుంది..
కబుర్లు చెపుతూనే ఉంటుంది..
తన గమ్యాన్ని చేరుతూనే ఉంటుంది..

గతి తప్పి, మూగబోయి, నిశ్చేష్టుడనై
చిత్తరువులా.. నేనుండిపోతాను.

నేనూ... నా ఏకాంతమూ
ఒకరికి ఒకరై.. మరికొంచెంసేపు..
ఆ చిత్రంలో భాగమవుతాము
ప్రకృతి కన్ను మూస్తుంది..
చీకటి ఆవరిస్తుంది...

ఆ సెలయేటి గట్టున
కవిత పునరావృతమవుతుంది...

Monday, February 2, 2009

ఎవరీమె?

నీడలా నాతోనే ఉంటూ గాధలన్నీ వింటుంది
నాతో కలిసి గతాన్ని తోడుతుంది
పరిచి నిస్పృహల్లో ఆరేస్తుంది
గడిచే కాలాన్ని విడిచే నిట్టూర్పులనీ
నాతో సమంగా అనుభవిస్తుంది.

నిండిన కళ్ళతో మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది విశ్రాంతినిస్తుంది
విడిన బంధాలని, విగత భావాలని
వక్రించిన విధి విధానాన్ని
నాకై విశ్లేషిస్తుంది ఊరటనిస్తుంది

అర్ధం కాని బ్రతుకు నిజాల్ని
ప్రతిధ్వనించే మౌన గీతాల్ని
తిరిగి ప్రశ్నిచే ఆవేదన క్షణాల్ని
ఆకళింపు చేస్తుంది, ఒద్దన్నా
మరోసారి అనుభంవంలోకి తెస్తుంది.

ఆశ దీపానికి చేతులడ్డు పెట్టి
ఆవలి తీరం చూపిస్తుంది
నా చీకట్లు తనలో ఇముడ్చుకుంటుంది
ఒకోసారి నా అస్థిత్వమే తనవుతుంది

ఈరోజెందుకో, కోరిచేరిన తను
కసిరి జారిపోయింది, గాయపడ్డట్టుంది,
తనకంటూ ఒక గుర్తింపు కోరినట్టుంది
గోడమీద తన నీడకోసం
ఆప్యాయంగా తడుముకుంటుంది

తనులేని నేను నాకేమవ్వను?
నేనుకాని నేను తనకేమవ్వను ?

పాపం నా ఏకాంతం. ఈరోజు ఒంటరయ్యింది.


niiDalaa naatOnE unTuu gaadhalannii vinTundi
naatO kalisi gataanni tODutundi
parici nispRhallO aarEstundi
gaDicE kaalaanni viDicE niTTuurpulanii
naatO samamgaa anubhavistundi.

ninDina kaLLatO masakabaarina naa prastutaanni
viDamarici viSadiikaristundi viSraantinistundi
viDina bandhaalani, vigata bhaavaalani
vakrincina vidhi vidhaanaanni
naakai viSlEshistundi uuraTanistundi

ardham kaani bratuku nijaalni
pratidhvanincE mouna giitaalni
tirigi praSnicE aavEdana kshaNaalni
aakaLimpu cEstundi, oddannaa
marOsaari anubhamvamlOki testundi.

aaSa diipaaniki cEtulaDDu peTTi
aavali tiiram cuupistundi
naa ciikaTlu tanalO imuDcukunTundi
okOsaari naa asthitvamE tanavutundi

iirOjendukO, kOricErina tanu
kasiri jaaripOyindi, gaayapaDDaTTundi,
tanakanTuu oka gurtimpu kOrinaTTundi
gODamiida tana niiDakOsam
aapyaayamgaa taDumukunTundi

tanulEni nEnu naakEmavvanu?
nEnukaani nEnu tanakEmavvanu ?

paapam naa Ekaantam. iirOju onTarayyindi.