Thursday, November 19, 2009
ఎవరికోసం .. ?
బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...
బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...
బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...
కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..
చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..
ఎవరికోసం .. ?
Tuesday, November 17, 2009
తోడు
గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..
మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..
జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..
తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..
ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..
బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.
నీతోడు పొందాలనుంది.
Monday, November 16, 2009
కవిత లెప్పుడవుతాయో
రెప్ప క్రింద
గులాబీ వనంలో
రాలిపడినవీ..
పారుతున్న ఏటి ధారల్లో
ఏరుకున్నవీ..
వీడని మెళుకువ
కీచురాళ్ళతో పాడుకున్నవీ.
నిట్టూర్పుల వేడికి
ఎండుటాకులై దొర్లుతున్నవీ..
ఎన్ని పదాలో ..
ఎటుచూసినా పదాలే..
ఇవి కవిత లెప్పుడవుతాయో !!?
Subscribe to:
Posts (Atom)