Thursday, October 22, 2009

సత్యం




దొర్లే ఆకుల గుసగుసల్లో..
కొమ్మల్లో చిక్కిన గాలి ఊసుల్లో..
కొండలు పాడే ప్రతి ధ్వనుల్లో..
కొలను చూపే ప్రతి వృత్తములో..
ఎన్ని జీవిత సత్యాలో..

తపన చాలించిన అలల్లో..
తనువు తగిలెళ్ళిన తెమ్మెరల్లో..
తేలిపోతున్న నల్ల మబ్బుల్లో..
తీరమొచ్చిన తెప్ప తనువుల్లో..
ఎన్ని జీవిత సత్యాలో..

నుదుటి కాగితం మీద
కాలం విదిల్చిన అక్షరాలను
కూర్చుకుంటూ..
గుండెలోతుల్లో..
తడవకోకటిగా చెక్కిన చిత్రాలను
సరిపోల్చుకుంటే..

ప్రతి చిత్రం... ఓ సత్యమే !!

Wednesday, October 14, 2009

పశ్చాత్తాపం



తప్పు బరువు పెరిగి రెప్ప
తోడు చేరింది
కాళ్ళు విరిగిన ప్రేమ
కరిగి జారింది

దిశ మళ్ళిన చూపు
నేలపాలవుతూ..
గోరు గురుతును చేరి
సేదతీరింది

గుండె ఒలికిన గంగ
దొప్పల్ని నింపితే
వేడి శ్వాసల హోరు
ఆవిరిగ మార్చింది

ముడిబడిన భృకుటి
విప్పలే లేకేమో
అదిరెడి చుబుకము
పెదవి విరిచింది

నీట తేలిన జగతి
నిలువ నేర్వని స్థితి
నివురు గప్పిన ఆశ
నేటి బ్రతుకు.